విజయనగరం కోటలో అలజడి: ఆయన రాజ్యంలో ఏం జరుగుతోంది?

In Vizianagaram TDP Meesala Geetha Raises Her Voice Against Ashok Gajapathiraju - Sakshi

ఆ కోటలో రాజుగారికి తిరుగు లేదు. ఆ వూరిలో రాజుగారు చెప్పిందే వేదం, చేసిందే చట్టం. కాని కొద్ది రోజులుగా రాజు మీద తిరుగుబాటు మొదలైంది. పార్టీలో పోరు ప్రారంభమైంది. అధినాయకత్వం రాజు వెంట... కార్యకర్తలు బీసీ నేత వెంటా నడుస్తున్నారు. ఇంతకీ ఆ రాజు ఎవరో..ఆయన రాజ్యంలో ఏం జరుగుతోంది?

విజయనగరం కోటలో అలజడి రేగింది. గత ఎన్నికల వరకు విజయనగరం జిల్లాలో పూసపాటి వారి మాటకు ఎదురు లేదు. వారు  చెప్పిందే చట్టం. అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జిల్లా నుంచి తుడిచిపెట్టుకుపోయింది. అయినప్పటికీ రాజుగారి మాటే తెలుగుదేశం పార్టీలో వేదంగా కొనసాగుతోంది. 2014లో విజయనగరం అసెంబ్లీ సీటుకు టీడీపీ తరపున పోటీ చేసిన మీసాల గీత విజయం సాధించారు. ఆమె ఇటీవల రాజుగారికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. బీసీలు ఎక్కువగా ఉన్న విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీలకే టికెట్ ఇవ్వాలన్నది ఆమె డిమాండ్. ఈ నేపథ్యంలో అశోక్ గజపతి రాజు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఆమె డుమ్మా కొడుతున్నారు. 

2014లో అశోక్‌గజపతి రాజు లోక్‌సభకు పోటీ చేయగా... మీసాల గీత అసెంబ్లీకి పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో ఇద్దరూ గెలిచారు. గత ఎన్నికల్లో గీతకు సీటు ఇవ్వలేదు. లోక్‌సభకు అశోక్‌గజపతి, అసెంబ్లీకి ఆయన కుమార్తె పోటీ చేశారు. ఇద్దరు ఓడారు. వచ్చే ఎన్నికల్లో మీసాల గీత.. తనకే టిక్కెట్‌ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తన డిమాండ్‌ను, బీసీల జనాభా సంఖ్యను ఆధారాలతో పార్టీ అధినేత చంద్రబాబుకు ఆమె అందించారు. అలాగే చూద్దాం అంటూ ఆమెకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. తర్వాత అశోక్‌ చెప్పిన మాటే వింటున్నారని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. అసలే జిల్లాలో పార్టీ  వీక్‌గా ఉందంటే ఇదేం గొడవ అని తలలు పట్టుకుంటున్నారు.

ఈ గొడవలన్నీ ఇలా ఉండగానే.. కోట బయట మీసాల గీత పార్టీ ఆఫీస్‌ పెట్టగా దాన్ని అశోక్‌ తొలగించారు. ఆపై తన దివాణంలోనే ఆఫీస్‌ ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయంలో కూడా గీత మాట చెల్లలేదు. చంద్రబాబు గోడ మీద కూర్చుని వినోదం చూస్తున్నారు. 

ఈ నేపథ్యంలో విజయనగరం నియోజకవర్గంలో ఉన్న బీసీల జనాభాను కులాలవారీగా ఫ్లెక్సీల రూపంలో పట్టణంలో అనేక చోట్ల ఏర్పాటయ్యాయి. రాజుగారి కోట బయట కూడా ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో బీసీలు లక్షా అరవై వేల మంది ఉన్నారని.. రాజ్యాధికారం బీసీలకే ఇవ్వాలంటూ బీసీ ఐక్యవేదిక పేరుతో వెలసిన ఫ్లెక్సీలు పట్టణంలో కలకలం రేపాయి. అయితే ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై క్లారిటీ లేదు. అయితే ఇది మీసాల గీత వర్గీయుల పనే అంటూ అశోక్ గజపతి వర్గం ఎటాక్ ప్రారంభించింది. అయితే జిల్లాలో అశోక్‌గజపతి రాజు మాట కాదని చంద్రబాబు ఏమీ చేయలేరనే విషయం అందరికీ తెలుసు. 2014లో గెలిచినప్పటికీ తనకు 2019లో మెండి చేయి చూపిన టీడీపీ అధినాయకత్వం మీద మీసాల గీత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top