న్యాయ వ్యవస్థనే అవమానిస్తారా?: మంత్రి ఉత్తమ్‌ | Uttam Kumar Reddy Fires on BRS Leaders for Kaleshwaram Issue | Sakshi
Sakshi News home page

న్యాయ వ్యవస్థనే అవమానిస్తారా?: మంత్రి ఉత్తమ్‌

Aug 6 2025 1:18 AM | Updated on Aug 6 2025 1:18 AM

Uttam Kumar Reddy Fires on BRS Leaders for Kaleshwaram Issue

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫైర్‌ 

కమిషన్‌ నివేదికలోని అంశాలను మాత్రమే ప్రభుత్వం వెల్లడించింది 

ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు హైడ్రాలజీ అనుమతులు ఇస్తే దాచి పెట్టారు 

కేబినెట్‌ ఆమోదం లేకుండానే కాళేశ్వరం చేపట్టారు 

బరాజ్‌లు ఎక్కడ కట్టాలో మీరే నిర్ణయించుకున్నారు.. 

బండారం బట్టబయలైనందుకే కమిషన్‌ను తప్పు పడుతున్నారు 

ఇప్పటికైనా నాలుగు కోట్ల ప్రజలకు క్షమాపణలు చెప్పండి

సాక్షి, హైదరాబాద్‌: ’ప్రజాస్వామ్య వ్యవస్థలపై బీఆర్‌ఎస్‌కు చులకన భావం. చట్టసభలు, న్యాయ వ్యవస్థపై గౌరవం, నమ్మకం లేదు. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి సారథ్యంలోని జ్యుడీషియల్‌ కమిషన్‌ అంటే కూడా లెక్కలేదు. ప్రజలు గత ఎన్నికల్లో బుద్ధి చెప్పినా ఇప్పటికీ వాళ్లలో మార్పు రాలేదు. మేడిగడ్డను కుంగబెట్టిన దుర్మార్గులు ఇప్పడు ఏకంగా సీనియర్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ను అవమానిస్తున్నారా? న్యాయబద్ధ కమిషన్‌కు అపార్థాలు అంటగట్టే నీచానికి దిగజారటం కూడా మీకే చెల్లింది..’ అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కమిషన్‌ నివేదికపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు చేసిన ఆరోపణలను ఖండిస్తూ మంగళవారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.  

వారి బండారం బట్టబయలైంది 
’కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట గత ప్రభుత్వం ఎన్ని అవకతవకలకు, అక్రమాలకు పాల్పడిందో కమిషన్‌ విచారణలో బయటపడింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆనాటి ఇరిగేషన్‌ మంత్రి హరీశ్‌రావు బండారం బట్టబయలైంది. అందుకే తేలు కుట్టిన దొంగల్లా.. హరీశ్‌రావు మళ్లీ కల్ల»ొల్లి కబుర్లు చెప్తున్నారు. కమిషన్‌ ఇచ్చిన నివేదికలోని అంశాలను మాత్రమే ప్రభుత్వం వెల్లడించింది. అది రేవంత్‌రెడ్డి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రాసిన రిపోర్టు కాదనే విషయాన్ని హరీశ్‌రావు మరిచిపోయినట్లున్నారు. 

ఇంకెన్ని సార్లు మోసం చేస్తారు.. 
 కాళేశ్వరం ప్రాజెక్టు ఆలోచన మొదలైనప్పటి నుంచి డిజైన్లు, నిర్మాణంలో లోపాలు, మేడిగడ్డ బరాజ్‌ కుంగుబాటు వరకు అవకతవకలన్నింటిపై కమిషన్‌ సమగ్రంగా విచారణ జరిపింది. ఎవరెవరు తప్పులు చేశారో.. ఎవరెవరు అందుకు బాధ్యులనే వివరాలను నివేదికలో వెల్లడించింది. 

మేమేం తప్పు చేయలేదంటూ మీ పార్టీ ఆఫీసులో తప్పులు మాట్లాడి తెలంగాణ ప్రజలను ఇంకెన్ని సార్లు మోసం చేస్తారు? ఇప్పుడు పార్టీ ఆఫీసులో పెడబొబ్బలు పెడుతున్న హరీశ్‌రావు.. ఆరోజు కమిషన్‌ ముందు ఎందుకు ఈ వివరాలు చెప్పుకోలేదు?..’ అని ఉత్తమ్‌ నిలదీశారు. 

ప్రభుత్వం చర్యలపై భయం పట్టుకుంది.. 
’హరీశ్‌ అబద్ధపు సాక్ష్యాలు, బుకాయింపులన్నీ.. న్యాయ వ్యవస్థ ముందు అబద్ధాలుగా తేలిపోయాయి. ఆయన చేసిన తప్పులన్నీ బయటపడ్డాయి.  కేసీఆర్‌ పాత్ర ఏమిటో, హరీశ్‌రావు చేసిన ఘనకార్యాలేమిటో కమిషన్‌ విచారణలో తేలిపోయాయి. దాంతో ఇప్పుడు ప్రభుత్వం ఈ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే భయం వాళ్లను వెంటాడుతోంది. అందుకే కమిషన్‌ను తప్పుబట్టే దుర్మార్గానికి ఒడిగట్టారు. 

అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధం 
ప్రజాస్వామ్య వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలు, చట్ట సభలపై మా ప్రభుత్వానికి గౌరవముంది. అందుకే అసెంబ్లీలో ఈ నివేదికపై చర్చించేందుకు సిద్ధంగా ఉంది. కాళేశ్వరంలో దోషులుగా తేలిన బాధ్యులు.. అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని కూడా ప్రభుత్వం ఆహ్వానించింది. 

ఫార్మ్‌ హౌస్‌లో మామ డైరెక్షన్, పార్టీ ఆఫీస్‌లో అల్లుడి యాక్టింగ్‌ ఇకనైనా ఆపాలి. ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి చేసిన తప్పులు ఒప్పుకుని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పుకోవాలి. మీరు వేలకోట్ల అవినీతి చేస్తే ఒప్పు,..  మేం విచారణ చేసి నిజాలు నిగ్గుతేలిస్తే అది రాజకీయ కక్ష సాధింపా?..’ అని మంత్రి ప్రశ్నించారు. 

బీఆర్‌ఎస్‌ నేతలకు మాట్లాడే హక్కే లేదు.. 
’కమీషన్ల కక్తుర్తితో ప్రజలను, రైతులను పదేళ్ల పాటు మోసం చేశారు, ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు హైడ్రాలజీ అనుమతులు ఇస్తే దాచిపెట్టారు. నిపుణుల కమిటీ మేడిగడ్డ వద్ద బరాజ్‌ల నిర్మాణం వద్దని చెపితే తొక్కిపెట్టారు. బరాజ్‌లు ఎక్కడ కట్టాలో మీరే నిర్ణయించుకున్నారు. కుంగి పోయే ప్రాజెక్టు కట్టినందుకు సిగ్గుపడాల్సింది పోయి హరీశ్‌రావు కొత్త రికార్డు సృష్టించారు. జనం చెవిలో పువ్వులు పెట్టే ప్రయత్నం చేశారు. ఒక్క మాట కూడా నిజం చెప్పకుండా మరోసారి డూప్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 

నారాయణపేట కొడంగల్‌ ప్రాజెక్టుకు ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో ఇచ్చారు. మా ప్రభుత్వం ఒక్క రూపాయి బిల్లు కూడా ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు ఇవ్వలేదు. కేబినెట్‌ ఆమోదం లేకుండానే మామా అల్లుళ్లు సంతకాలు చేసుకుని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి.. తెలంగాణ ప్రజలను దగా చేశారు. తెలంగాణ ప్రయోజనాలను పాతరపెట్టి, ఆర్థికంగా లక్ష కోట్ల దుర్మార్గానికి ఒడిగట్టిన బీఆర్‌ఎస్‌ నేతలకు నైతికంగా మాట్లాడే హక్కే లేదు..’ అని ఉత్తమ్‌ విమర్శించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement