దళితులకు కేసీఆర్‌ దగా 

Union Minister Kishan Reddy Criticized CM KCR - Sakshi

ధ్వజమెత్తిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శ   

సాక్షి, హైదరాబాద్‌: అధికారంలోకి వచ్చిననాటి నుంచే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల్ని మోసగిస్తోందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తానని ఇచ్చిన హామీని తుంగలో తొక్కి తానే సీఎం అయి మొదట మోసం చేసిన కేసీఆర్‌ ఆ రోజు నుంచి ఇప్పటివరకు దళితులను అన్నిరకాలుగా దగా చేస్తూనే ఉన్నారని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగమని ఇచ్చిన హామీ కూడా అమలుకాలేదని గుర్తుచేశారు.

తాజాగా హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు ముందు దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి మరోసారి మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నియోజకవర్గాలలోని టీఆర్‌ఎస్‌ నాయకులకు మాత్రమే దళితబంధు ఇస్తున్నారని, చిత్తశుద్ధి ఉంటే అన్ని దళిత కుటుంబాలకు ఇవ్వాలని అన్నారు. నిరుద్యోగ భృతి కింద రూ.3,116 ఇస్తామని చెప్పి ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. ధరణి పోర్టల్‌లో పొరపాట్ల కారణంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని పేర్కొన్నారు. పొరపాట్లపై ఇప్పటివరకు 4 లక్షల మంది ఫిర్యాదు చేశారని అన్నారు.

రైతుల రుణమాఫీ విషయంలో కూడా కేసీఆర్‌ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. గిరిజనుల పోడుభూములు గుంజుకుంటూ గిరిజన హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వచ్చి 8 ఏళ్లయినా ఇంకా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నాటి రేషన్‌కార్డులే ఉండటం సిగ్గుచేటని, రేషన్‌కార్డులు కూడా ఇవ్వలేని అసమర్థత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదని విమర్శించారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిందని కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు రూ.5 లక్షల కోట్లకు పెరిగాయని, ఇంకా కావాలని కేంద్రాన్ని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని అన్నారు. 8 ఏళ్లుగా గ్రామ పంచాయతీలకు ఎన్ని నిధులిచ్చారో చెప్పాలని, దీనిపై చర్చించేందుకు కేంద్రం రెడీగా ఉందని, కేసీఆర్‌ సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. అబద్ధాలు ఆడటంలో కేసీఆర్‌ కుటుంబం నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని విమర్శించారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top