3 రాజధానుల నుంచి జనం దృష్టి మరల్చేందుకే..

Umashankar Ganesh Fires On TDP Leader Ayyanna Patrudu - Sakshi

అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఉమాశంకర్‌గణేష్‌ ఆగ్రహం

గంజాయి రవాణా తప్ప నువ్వు చేసిన అభివృద్ధి ఏదంటూ ప్రశ్న  

‘స్కిల్‌’ స్కాంలో చంద్రబాబు, లోకేశ్‌లు రూ.241 కోట్లు కొట్టేశారని ప్రజలకు తెలుసు 

అన్ని ఎన్నికల్లోనూ ఓడిపోతున్నందుకు రాజీనామా చేయాల్సింది చంద్రబాబు కదా..

నర్సీపట్నం: చింతకాయల అయ్యన్నపాత్రుడు పిచ్చి ప్రేలాపన మానుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్‌ హెచ్చరించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక నేరస్థుడైన అయ్యన్నపాత్రుడే ఆర్థిక నేరాల గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. రాజకీయాల్లోకి రాకముందు ఎన్ని ఆస్తులున్నాయో.. రాజకీయాల్లోకి వచ్చాక వేల కోట్లు ఎలా సంపాదించావో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తమపై వచ్చిన అవినీతి ఆరోపణల నుంచి, రాయలసీమ ప్రజల మూడు రాజధానుల ఉద్యమం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే పిచ్చి తుగ్లక్‌ లాంటి అయ్యన్నపాత్రుడితో చంద్రబాబు, లోకేశ్‌లు పిచ్చి ప్రేలాపనలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎల్లో మీడియాకు మేత కోసమే అయ్యన్నపాత్రుడు మందు కొట్టి మాట్లాడుతున్నారని.. ఆయనవి మత్తు మాటలు.. మందు మాటలు.. మతిలేని మాటలంటూ ఎద్దేవా చేశారు. సుదీర్ఘకాలం మంత్రిగా వెలగబెట్టిన అయ్యన్నపాత్రుడు నర్సీపట్నాన్ని గంజాయి అడ్డాగా మార్చారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా అతను ఏం చేశాడన్నది చూస్తే.. గంజాయి రవాణా తప్ప అభివృద్ధి శూన్యమన్నారు. 

తండ్రీకుమారులు ఇద్దరి చేతిలోనూ ఓడిపోయారు.. సిగ్గు లేదా చంద్రబాబు?
2019 ఎన్నికల్లోనే కాక.. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఓడిపోయినందుకు, వైఎస్సార్‌ చేతిలో, ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌ చేతిలో ఓడినందుకు సిగ్గుతో రాజీనామా చేయాల్సింది చంద్రబాబేగానీ, ప్రతి రూపాయినీ ప్రజల కోసమే ఖర్చు చేస్తున్న సీఎం జగన్‌ కాదని ఉమాశంకర్‌గణేశ్‌ స్పష్టం చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో చంద్రబాబు, లోకేశ్‌లు రూ.241 కోట్లను అప్పనంగా కొట్టే్టశారని ప్రజలు గుర్తించారని, సంతకం పెట్టిందెవరన్నది కాదు.. బస్తాల్లో డబ్బులు పట్టుకుపోయిందెవరన్నదే ముఖ్యమన్న విషయాన్ని అయ్యన్నపాత్రుడు తెలుసుకోవాలంటూ ఉమాశంకర్‌ గణేశ్‌ హితవుపలికారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top