TRS Plenary 2022: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ క్రియాశీలక పాత్ర సహా 11 తీర్మానాలు

TRS Plenary 2022 CM KCR May Targets On national Politics - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తామంటూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో.. జాతీయ రాజకీయాలే ప్రధాన ఎజెండాగా ప్లీనరీ కొనసాగనుంది. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ) వేదికగా బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే వేడుకలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. ఇందుకోసం సుమారు పది రోజుల క్రితం ప్రారంభమైన ఏర్పాట్లు మంగళవారం సాయంత్రానికి పూర్తికాగా, వేడుకలకు హాజరయ్యే అతిథుల కోసం భోజనాల ఏర్పాట్లు మంగళవారం రాత్రి నుంచే ప్రారంభించారు. 

అందరి దృష్టీ ‘జాతీయ రాజకీయాలపైనే’ 
తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి గమ్యాన్ని చేరడమే కాకుండా వరుసగా రెండు పర్యాయాలు అధికార పగ్గాలు చేపట్టింది. 21వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తమ పార్టీ మేజర్‌ అయిందని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ ఎలాంటి పాత్ర పోషిస్తుందనే అంశంపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. ప్లీనరీలో మొత్తం 11 తీర్మానాలను ప్రవేశ పెట్టనుండగా, జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ పోషించాల్సిన పాత్ర, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలన వైఫల్యాలు ఎండగట్టడమే ప్రధాన ఎజెండాగా ఉంటుందని పార్టీ నేతలు వెల్లడించారు. అలాగే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ క్రియాశీల పాత్ర పోషించాలని కోరుతూ తీర్మానం ఆమోదించనున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కూడా తీర్మానాలు చేయనున్నారు. ఇప్పటికే తీర్మానాల వారీగా వక్తల పేర్లను ఖరారు చేశారు.  

ఉదయం 11 గంటలకు కేసీఆర్‌ రాక 
సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులు గులాబీరంగు దుస్తులను ధరించి రావాలని ఆదేశించారు. ప్రతినిధులందరికీ ప్రత్యేక కిట్‌లో తీర్మానాల ప్రతులు, పెన్నులు, ప్యాడ్లు, పార్టీ జెండాలు తదితరాలు అందజేస్తారు. హెచ్‌ఐసీసీ ప్రాంగణంలో జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో ప్రతినిధుల పేర్లు నమోదు చేసి, పాస్‌ను పరిశీలించి లోని  కి అనుమతిస్తారు. కేసీఆర్‌ ఉదయం 11 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని వేదికపై ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం వద్ద, తెలంగాణ అమరుల స్తూపానికి నివాళులర్పిస్తారు. కేసీఆర్‌ ప్రా రంభోపన్యాసం తర్వాత తీర్మానాలపై చర్చ మొదలై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.  

టీఆర్ఎస్ పార్టీ 21వ ప్లీనరీ తీర్మానాలు ఇవే..
► యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానం
► దేశం విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ కీలక భూమిక పోషించాలని రాజకీయ తీర్మానం 
► ఆకాశాన్నంటిన ధరలు పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజల మీద మోయలేని భారం వేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధరల నియంత్రణను డిమాండ్ చేస్తూ తీర్మానం
► చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపచేసి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం
► భారతదేశ సామరస్య సంస్కృతిని కాపాడుకోవాలని మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానం
► బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని బీసీ వర్గాల జనగణన జరపాలని డిమాండ్ చేస్తూ తీర్మానం 
► తెలంగాణ రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం
► రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్‌ రూపేణా వసూలు చేయడం మానుకోవాలని డివిజబుల్ పూల్‌లోనే పన్నులు వసూలు చేయాలని తీర్మానం
► నదీ జలాల వివాద చట్టం సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా నిర్వహించాలని ఈమేరకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్రం రిఫర్ చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం
► భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తూ తీర్మానం
► తెలంగాణ రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలను వైద్య కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం

ఊరూరా టీఆర్‌ఎస్‌ జెండా పండుగ 
పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 3,618 మున్సిపల్‌ డివిజన్లు, వార్డుల్లో జెండా పండుగ నిర్వహించాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు జెండా పండుగలో పాల్గొనాలని, గ్రామ కమిటీ, సర్పంచ్, ఎంపీటీసీ, రైతు బంధు కమిటీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. ఉదయం 9 గంటలకు తెలంగాణలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో పార్టీ పతాకావిష్కరణ నిర్వహించాలన్నారు.   

బార్‌కోడ్‌ పాస్‌తో ప్రవేశం 
రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొదలుకుని మొత్తం 22 కేటగిరీలకు చెందిన సుమారు 3 వేల మంది ప్రజా ప్రతినిధులు, నాయకులకు మాత్రమే పార్టీ ఆవిర్భావ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానాలు వెళ్లాయి. సుమారు 65 లక్షల మంది పార్టీ సభ్యులు ఉన్నా.. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పరిమిత సంఖ్యలో ఆహ్వానాలు పంపించామని, ఆహ్వానాలు అందని వారు మన్నించాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సంబంధిత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జీల ద్వారా ఆహ్వానాలు వెళ్లగా తొలిసారిగా ‘బార్‌కోడ్‌’తో కూడిన పాస్‌ను ఉపయోగించి సమావేశ ప్రాంగణంలోకి అనుమతించేలా ఏర్పాట్లు చేశారు. సభాస్థలిలో ప్రధాన వేదికతో పాటు మరో ఐదు డిజిటల్‌ తెరలను ఏర్పాటు చేశారు.

33 రకాల వంటకాలు 
సమావేశ ప్రాంగణమంతా కేసీఆర్‌ భారీ కటౌట్లు, పార్టీ జెండాలతో గులాబీమయం చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్‌ నగరానికి దారితీసే ప్రధాన మార్గాలతో పాటు నగరంలోని ముఖ్య కూడళ్లలో పార్టీ నేతలు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వేడుకలకు హాజరయ్యే ప్రతినిధుల కోసం 33 రకాల వంటకాలు సిద్ధం చేయడంతోపాటు హెచ్‌ఐసీసీలో వేర్వేరు చోట్ల భోజన వసతి కల్పిస్తున్నారు. పార్కింగ్‌ సమస్య తలెత్తకుండా ఇప్పటికే జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ పోలీసు విభాగంతో పార్టీ నేతలు సమన్వయం చేసుకుంటున్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన గద్వాల, భద్రాచలం, కొత్తగూడెం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్‌ తదితర ప్రాంతాలకు చెందిన నేతలు మంగళవారం రాత్రికే హైదరాబాద్‌కు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని కేటీఆర్‌ సూచించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top