జీవో 19 అమలు నిలుపుదల సబబే

Tribunal upholds single judge orders Sangam Dairy - Sakshi

సింగిల్‌ జడ్జి ఉత్తర్వులకు ధర్మాసనం సమర్థన

ప్రభుత్వ అప్పీల్‌ కొట్టివేత

సాక్షి, అమరావతి: సంగం డెయిరీ యాజమాన్య నిర్వహణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌ పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌ 27న జారీచేసిన జీవో 19 అమలును నిలిపేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సమర్థించింది. ఇరుపక్షాల ప్రయోజనాలను కాపాడుతూ సింగిల్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొంది. స్థిర, చరాస్తులను విక్రయించడం, బదలాయించడం, థర్డ్‌ పార్టీ హక్కులు సృష్టించడం వంటివి కోర్టు అనుమతి లేకుండా చేయరాదని సంగం డెయిరీ యాజమాన్యాన్ని సింగిల్‌ జడ్జి ఆదేశించారని గుర్తుచేసింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదంది.

ఈ కారణాలరీత్యా ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టేస్తున్నట్లు తెలిపింది. తమ ఫిర్యాదు మేరకే సంగం డెయిరీపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని, అయితే సింగిల్‌ జడ్జి తమ వాదనలు వినకుండానే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారంటూ గుంటూరు జిల్లా మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ సంఘం దాఖలు చేసిన అప్పీల్‌ను కూడా ధర్మాసనం కొట్టేసింది. జీవో 19ని సవాలు చేస్తూ సంగం డెయిరీ దాఖలు చేసిన వ్యాజ్యంలో తమనూ ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ ఈ సంఘం దాఖలు చేసిన ఇంప్లీడ్‌ పిటిషన్‌ సింగిల్‌ జడ్జి ముందు పెండింగ్‌లో ఉందని, ఈ ఉత్తర్వుల్లో తమ అభిప్రాయాలకు ప్రభావితం కాకుండా దాన్ని విచారించవచ్చని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు  ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌గోస్వామి, జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పులు చెప్పింది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top