TPCC Chief Revanth Reddy Reaction On Dharani Portal Issue - Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు చర్లపల్లి జైల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు: రేవంత్‌ రెడ్డి

Jun 13 2023 8:19 AM | Updated on Jun 13 2023 12:02 PM

TPCC Chief Revanth Reddy Reaction On Dharani Portal Issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని రూ.1,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆ గ్రామ పరిధిలో ఉన్న 146 ఎకరాల భూదాన్‌ భూములను ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితా నుంచి తొలగించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు కట్టబెట్టారని అన్నారు. ఇందులో మంత్రి కేటీఆర్‌ అనుచరులు, రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ నేతలది కీలకపాత్ర అని ఆరోపించారు.

ఈ కుంభకోణంలో కేసీఆర్‌ కుటుంబ సభ్యుల పాత్ర లేకపోతే వెంటనే దీనిపై విచారణకు ఆదేశించాలని, ఇందుకు కారణమైన అధికారులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐసీసీ కిసాన్‌సెల్‌ వైస్‌ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి.మహేశ్‌కుమార్‌గౌడ్, ఉపాధ్యక్షుడు హర్కర వేణుగోపాల్‌ తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు.  

ఎలాంటి లావాదేవీలు వద్దొన్న భూదాన్‌ బోర్డు 
‘తిమ్మాపూర్‌ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లలో 146 ఎకరాల భూదాన్‌ భూములున్నాయని అప్పటి కందుకూరు ఎమ్మార్వో 2007లో కలెక్టర్‌కు రాసిన లేఖలో వెల్లడించారు. ఈ భూములను కాపాడాలని అప్పడు ఎమ్మెల్యే హోదాలో ఇప్పటి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారు. భూదాన్‌ బోర్డు కూడా ఈ భూములపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించవద్దని మహేశ్వరం సబ్‌ రిజి్రస్టార్‌కు లేఖ రాసింది. ఈ మేరకు స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ సదరు గ్రామంలోని సర్వే నంబర్లన్నింటినీ నిషేధిత జాబితాలో చేర్చింది..’అని రేవంత్‌ తెలిపారు.  

ధరణి వచ్చిన తర్వాతే... 
‘2020లో ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చిన తర్వాత ఈ భూములను నిషేధిత కేటగిరీ నుంచి తొలగించారు. 2021లో ఎం.శివమూర్తి పేరిట బదిలీ చేశారు. వాటి విలువ రూ.1,000 కోట్లు ఉంటుంది. రిజి్రస్టేషన్ల శాఖ పరిధిలో ఉన్నప్పుడు నిషేధిత జాబితాలో ఉన్న భూములు ధరణిలో నిషేధిత జాబితాలో ఎందుకు లేవు? ఈ భూములను కొల్లగొట్టింది కేటీఆర్‌ అనుచరులే. ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్‌ అంటుంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు ఎలా రద్దు చేస్తారని ప్రశ్నిస్తోంది అందుకే. తమ వ్యవహారాలు బయటకు వస్తాయనే ఆలోచనతోనే తమకు బంగారు బాతు లాంటి ధరణిని వెనకేసుకు వస్తున్నారు..’అని టీపీసీసీ చీఫ్‌ ఆరోపించారు. 

ధరణి బాధితులు 20 లక్షల మంది 
‘రాష్ట్రంలో 20 లక్షల మంది రైతులు ధరణి బాధితులయ్యారు. తండ్రి చనిపోతే కొడుకు పేరిట భూమి బదిలీకి కూడా అవకాశం లేకుండా పోయింది. ధరణి రద్దయితే రైతుబంధు, రైతుబీమా రాదంటూ సీఎం హోదాలో కేసీఆర్‌ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. 2018లో ఈ ప్రభుత్వమే రైతుబంధు, రైతుబీమా మొదలుపెట్టింది. అప్పటి నుంచి 2020 వరకు ఈ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. ఆ మూడేళ్ల పాటు వచి్చన రైతుబంధు, బీమా ఇప్పుడు ధరణిని రద్దు చేస్తే ఎందుకు రావు? కాంగ్రెస్‌ పార్టీ ధరణి లేనప్పుడే 2009–10లో రూ.74 వేల కోట్ల రైతు రుణమాఫీని చేసింది.  

విదేశీ కంపెనీ చేతుల్లోకి రైతుల సమాచారం! 
కేసీఆర్‌ రైతులను బెదిరించేలా చేస్తున్న వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉంది. రాష్ట్రంలోని భూముల వివరాలు, రైతుల సమాచారం అంతా విదేశీ కంపెనీకి వెళ్లింది. ఇలా చేయడం క్రిమినల్‌ చర్యల పరిధిలోనికి వస్తుంది. ఇప్పుడు ధరణిని రద్దు చేస్తే ఈ బాగోతమంతా బయట పడుతుందనే కేసీఆర్‌ తదితరులు పెడ»ొబ్బలు పెడుతున్నారు..’అని రేవంత్‌ అన్నారు. 

కిషన్‌రెడ్డి సెంట్రల్‌ విజిలెన్స్‌కు లేఖ రాయాలి 
‘స్వగ్రామంలో భూములు అన్యాక్రాంతమవుతుంటే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు? ఆయన వెంటనే సెంట్రల్‌ విజిలెన్స్‌ విచారణ కోరుతూ లేఖ రాయాలి. మేము అధికారంలోకి వచ్చాక రంగారెడ్డి, మేడ్చల్, నల్లగొండ జిల్లాల్లో జరిగిన భూలావాదేవీలపై విచారణ జరిపిస్తాం, తప్పులు చేసిన కలెక్టర్లు, సీసీఎల్‌ఏను ఊచలు లెక్కపెట్టిస్తాం.  

కేసీఆర్‌కు చర్లపల్లి జైల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు 
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ధరణిని రద్దు చేసి ప్రజలకు ఉపయోగపడే నూతన సాంకేతిక విధానంతో మరో విధానాన్ని తీసుకువస్తాం. టైటిల్‌ గ్యారంటీ విధానాన్ని తెస్తాం. రిజి్రస్టేషన్‌ చేసి ఫీజు తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వం ఆ భూముల విషయంలో జవాబుదారీతనంగా ఉండాలనేది మా విధానం..’అని రేవంత్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కరెంటు కష్టాలు వస్తాయని అంటున్న కేసీఆర్‌కు ఊచలు లెక్కపెట్టే కష్టాలు మాత్రం వస్తాయని, చర్లపల్లి జైల్లో ఆయనకు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కట్టిస్తామని, బిడ్డ, అల్లుడు, కొడుకు అందరూ అక్కడే ఉండవచ్చని ఎద్దేవా చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement