టీపీసీసీ: అసంతృప్త నేతలకు బుజ్జగింపులు లేవు

TPCC Bhatti Vikramarka Meets Party Higher Leaders - Sakshi

 అలకలపై చూసీచూడనట్టు వ్యవహరించాలని భావిస్తున్న ఏఐసీసీ

నాయకులందరినీ కలుపుకొని పోవాలని రేవంత్‌రెడ్డికి సూచన

పాదయాత్ర వంటి కార్యక్రమాలను అధిష్టానంతో సంప్రదించాకే ప్రకటించాలని ఆదేశం

పార్టీ పెద్దలతో భట్టి విక్రమార్క భేటీపై చర్చ

సాక్షి, న్యూఢిల్లీ: టీపీసీసీ కొత్త సారథి, కార్యవర్గం ప్రకటన తర్వాత జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్‌ అధిష్టానం నిశితంగా దృష్టి సారించింది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకంపై పార్టీలో నెలకొన్న అసంతృప్తి, నాయకుల అలకల విషయంలో చూసీచూడనట్లుగా వ్యవహరించాలని భావిస్తున్నట్టు సమాచారం. కొత్త కమిటీ ఏర్పాటుపై అసంతృప్తితో ఉన్న నాయకులను ఢిల్లీకి పిలిపించుకొని బుజ్జగించే ఉద్దేశం పార్టీ పెద్దల్లో లేదని తెలిసింది. పార్టీ అధినేత్రి తీసుకున్న నిర్ణయానికి ప్రతీ ఒక్క నాయకుడూ కట్టుబడి ఉండాల్సిందేనన్న ధోరణిలో హైకమాండ్‌ ఉందని ఏఐసీసీ కీలక నేత ఒకరు తెలిపారు. కొద్దిరోజుల్లో అన్నీ సర్దుకుంటాయని, రాష్ట్రంలో కొత్త నాయకత్వం పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటుందని భావిస్తోందని పేర్కొన్నారు.

అందరినీ కలుపుకొనేలా..
అసమ్మతి, అసంతృప్తి, విమర్శల విషయంలో అందరు నేతలను కలుపుకొనిపోవాల్సిన బాధ్యత, అవసరం పార్టీ నూతన అధ్యక్షు డిగా రేవంత్‌రెడ్డికి ఉంటుందనే విషయాన్ని పార్టీ హైకమాండ్‌ ఇప్ప టికే స్పష్టం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే రేవంత్‌రెడ్డి తనకు వ్యతిరేకంగా అధిష్టానానికి లేఖ రాసిన సీనియర్‌ నేత వీహెచ్‌ను ఆస్పత్రికి వెళ్ల పరామర్శించారు. స్వయంగా సీనియర్‌ నేతల ఇళ్లకు వెళ్లి వారిని కలుస్తున్నారు. ఇక పాదయాత్ర వంటి కీలక అంశాల విషయంలో సీనియర్లు, కీలక నాయకులతో తొలుత చర్చించాలని, తర్వాత అధిష్టానం అనుమతి తీసుకుని బహిరంగ ప్రకటన చేయాలని రేవంత్‌రెడ్డికి సూచించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

భట్టి ఢిల్లీ పర్యటనపై చర్చ...
కొత్త పీసీసీ ఏర్పాటైన రెండు మూడు రోజులకే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఢిల్లీకి రావడం, పార్టీ పెద్దలతో సుదీర్ఘంగా భేటీ కావడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇటీవల సీఎం కేసీఆర్‌ను కలిసిన నేపథ్యంలో.. వివరణ కోరేందుకే భట్టిని హైకమాండ్‌ పిలిపించిందన్న ప్రచారాన్ని ఏఐసీసీ కీలక నేత ఒకరు తోసిపుచ్చారు. కొత్త పీసీసీ ప్రకటన తర్వాత పార్టీకి సంబంధించిన పలు అంశాలపై పార్టీ పెద్దలతో చర్చించేందుకు భట్టి ఢిల్లీ వచ్చారని పేర్కొన్నారు. ఏఐసీసీ వర్గాల సమాచారం ప్రకారం.. భట్టి విక్ర మార్క గురువారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శు లు బోసురాజు, శ్రీనివాసన్‌లతో భేటీ అయ్యారు. పార్టీలో ప్రస్తుత పరిస్థితులు, పలువురు నాయకుల అసంతృప్తి, పదవుల విష యంలో భిన్నాభిప్రాయాల వంటి అంశాలపై చర్చించారు.

సీఎంను కలవడం తప్పేం కాదు
భట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల బృందం సీఎంను కలవడంలో తప్పేమీ లేదని కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో జరిగే ప్రతీచిన్న విషయంపై ఏఐసీసీ స్థాయి నుంచి అబ్జర్వేషన్‌ ఉండదని, రాష్ట్ర నాయకులు ఎవరిని కలవాలి, ఎవరిని కలవకూడదనేది హైకమాండ్‌ సూచించదని అంటున్నాయి. భట్టి విషయంలో ఎలాంటి బుజ్జగింపులు, మందలింపులు వంటివేమీ జరగలేదని, సీఎల్పీ నేత హోదాలో రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం ప్రణాళికలు, వ్యూహాలపైనే పార్టీ పెద్దలు చర్చించారని పేర్కొంటున్నాయి. 

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top