ఎన్నికల కదనరంగంలోకి దూకేందుకు... 

Tomorrow is a crucial meeting of the Congress party - Sakshi

రేపు కాంగ్రెస్‌ పార్టీ కీలక భేటీ 

బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే అంశమే ఎజెండాగా టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం 

హాజరుకానున్న ఠాక్రే, రేవంత్, ఉత్తమ్, పీఏసీ సభ్యులు, ఆఫీస్‌ బేరర్లు, జిల్లా అధ్యక్షులు 

డిక్లరేషన్లపై నేతల సూచనలు తీసుకోనున్న పార్టీ నాయకత్వం 

మండల కమిటీల ఏర్పాటుపై దిశానిర్దేశం... త్వరలోనే నాలుగు ప్రత్యేక కమిటీల ఏర్పాటు 

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల కదనరంగంలోకి దూకేందుకు కాంగ్రెస్‌ పార్టీ సంసిద్ధమవుతోంది. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో సాధించిన ఘన విజయం స్ఫూర్తితో తెలంగాణలోనూ గెలుపే ధ్యేయంగా ముందుకెళ్తోంది. అందులోభాగంగా సోమవారం గాందీభవన్‌లో కీలక సమావేశం జరగనుంది. ఈ ఏడాది నవంబర్‌ లేదా డిసెంబర్‌లో జరుగుతాయని భావిస్తున్న అసెంబ్లీ పోరులో బీఆర్‌ఎస్‌ను ఎలా ఎదుర్కోవాలన్న అంశమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం నిర్వహిస్తోంది.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటల నుంచి జరగనున్న ఈ విస్తృతస్థాయి సమావేశానికి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మన్లు కలిపి 300 మందికి పైగా నాయకులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణపై  చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.  

డిక్లరేషన్లపై చర్చ  
రానున్న ఎన్నికల కోసం వివిధ వర్గాలను ఆకట్టుకునేందుకు టీపీసీసీ ఆధ్వర్యంలో డిక్లరేషన్లు చేస్తున్నారు. అందులోభాగంగా గత ఏడాది వరంగల్‌లో జరిగిన రైతు గర్జన సభలో రైతు డిక్లరేషన్‌ను ప్రకటించగా, ఈ నెల 8న ప్రియాంకా గాంధీ సమక్షంలో జరిగిన యువ సంఘర్షణ సభలో యూత్‌ డిక్లరేషన్‌ను ప్రకటించారు. ఈ రెండు డిక్లరేషన్ల పట్ల ప్రజల్లో సానుకూల దృక్పథం వచ్చిందన్న అంచనాతో మరో నాలుగైదు డిక్లరేషన్లను ప్రకటించేందుకు టీపీసీసీ సిద్ధమవుతోంది.

ముఖ్యంగా బీసీ, మహిళా డిక్లరేషన్లపై దృష్టి సారించింది. వచ్చే నెల్లో ఈ రెండు డిక్లరేషన్లను ప్రకటించే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆయా డిక్లరేషన్లలో పొందుపర్చాల్సిన అంశాలతోపాటు ఇవాల్సిన హామీలపై ఈ సమావేశంలో నేతల నుంచి సూచనలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా మరింత దూకుడుగా ముందుకెళ్లే అంశంలో భవిష్యత్‌ కార్యాచరణ గురించి కూడా చర్చించనున్నారు.

అదేవిధంగా ఎన్నికల కోసం పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవడంలో భాగంగా మండల కమిటీల ఏర్పాటు ప్రారంభమైనప్పటికీ చాలా మండలాల్లో ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ మండల కమిటీల ఏర్పాటు కోసం కూడా నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్టు గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి. 

కొత్త కమిటీలు కూడా.. 
పార్టీ కేడర్‌ను, నాయకులను సమన్వయం చేసేందుకు నాలుగైదు కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలని టీపీసీసీ భావిస్తోంది. ఈ కమిటీలు ఎన్నికలు పూర్తయ్యేంతవరకు క్రియాశీలంగా పనిచేస్తాయని, ఎన్నికల రూట్‌మ్యాప్‌ను సమన్వయపర్చేందుకే వీటిని ఏర్పాటు చేస్తున్నారనే చర్చ గాం«దీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది.

మాజీ మంత్రులు జీవన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు తదితరులకు ఈ కమిటీల బాధ్యతలు అప్పగించి, ప్రతి కమిటీలో నలుగురైదుగురు కీలక నేతలను నియమించే అవకాశాలున్నాయి. ఈ కమిటీలను కూడా వారం, పది రోజుల్లో ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top