
ఖమ్మం: దేశం కోసం, రైతుల కోసం పని చేసే పార్టీ బీజేపీ అని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లా బీజేపీ అడ్డా కాబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు(మంగళవారం, జూలై 29) ఖమ్మం పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడుతూ.. ‘ బీజేపీలో చేరేందుకు కమ్యూనిస్టులు సిద్ధంగా ఉన్నారు. నాతో కొంతమంది కమ్యూనిస్టు నాయకులు మాట్లాడుతున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ ఉనికిని కోల్పోతుంది.
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తూనే ముస్లింలకు 10 శాతం ఇవ్వడం న్యాయం కాదు. బీసీలకు మాత్రమే 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి. అలాగని మేము ముస్లిలకు వ్యతిరేకం కాదు. ఓబీసీ ద్వారా 10 శాతం రిజర్వేషన్ ముస్లింలకు ఉంది. బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోంది. రాష్ట్రంలో రైతు బంధు అయిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెరమీదకు రైతు బంద్‌ను తీసుకొచ్చారు. ఖమ్మం మున్సిపాలిటీ బీజేపీ పార్టీ కైవసం చేసుకోబోతుంది. మనలో ఏమైనా విభేదాలు ఉంటే వాటిని పక్కనపెట్టి పార్టీ కోసం పని చేయాలి. రాబోయే స్థానిక సంస్థల, మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరబోతోంది’ అని రాంచందర్ రావు జోస్యం చెప్పారు.