కేసీఆర్‌ కాళ్లుమొక్కిన ఉన్నతాధికారి.. ఎమ్మెల్యే టిక్కెట్‌ కోసమేనా!

Telangana Health Director Srinivasa Rao Touch KCR Feet Viral - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి. శ్రీనివాసరావు వ్యవహార శైలిపై సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది. ఆయన ప్రవర్తనను పలువురు సీనియర్‌ అధికారులు తప్పుబడుతున్నారు. పదవుల కోసం ఇంతగా దిగజారతారా అంటూ ఆక్షేపిస్తున్నారు. 

ఇంతకీ ఏం జరిగింది?
తెలంగాణలో ఒకేసారి 8 కొత్త ప్రభుత్వ వైద్యకళాశాలలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం నాడు ఆన్‌లైన్‌లో  ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రగతిభవన్‌కు వచ్చిన డాక్టర్‌ శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా సీఎం కేసీఆర్‌కు పాద నమస్కారం చేశారు. అక్కడితో ఆగకుండా మరోసారి ముఖ్యమంత్రి కాళ్లుమొక్కారు. దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. శ్రీనివాసరావు వ్యవహార శైలిని పలువురు అధికారులు ఆక్షేపించారు. ఎమ్మెల్యే టిక్కెట్‌ కోసమే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.

పరువు తీస్తున్నారు: ఆకునూరి మురళి
శ్రీనివాసరావు కొత్తగూడెం అసెంబ్లీ టిక్కెట్‌ కోసమే కేసీఆర్‌ కాళ్లు పట్టుకున్నారని మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి విమర్శించారు. ‘మీలాంటి అధికారులు బ్యూరోక్రసీ పరువు తీస్తున్నారు. మొన్న కొత్తగూడెం వెళ్ళినప్పుడు చూశాను టౌన్ నిండా మీ ఫ్లెక్సీలే. పదవిని దుర్వినియోగం చేస్తూ కొత్తగూడెంలో ఏదో కార్యక్రమాలు చేస్తున్నారని కొందరు నాతో అన్నార’ని ఆకునూరి మురళి ట్వీట్‌ చేశారు. కేసీఆర్‌కు శ్రీనివాసరావు కాళ్లు మొక్కిన వీడియోను కూడా షేర్‌ చేశారు. 

శ్రీనివాసరావు కోరిక నెరవేరుతుందా?
టీఆర్‌ఎస్‌ తరపున ఎమ్మెల్యే టిక్కెట్‌ కోసం డాక్టర్‌ శ్రీనివాసరావు ప్రయత్నిస్తున్నట్టు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ తరపున పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సిట్టింగ్‌లకే టిక్కెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. 

మరోవైపు కొత్తగూడెం టికెట్ పొత్తుల్లో భాగంగా సిపిఐ కి వెళ్తుందన్న ప్రచారం స్థానికంగా పెద్ద ఎత్తున వినిపిస్తోంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం టికెట్ కోసం ఇప్పటినుంచే అన్ని ప్రయత్నాలు ప్రారంభించేశారట. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు కోరిక ఫలిస్తుందో, లేదో చూడాలని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

(క్లిక్ చేయండి: శ్రీనివాసరావుకు ముఖ్యమంత్రి అభినందన)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top