టీ కాంగ్రెస్‌లో ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌! | Sakshi
Sakshi News home page

జూనియర్లు.. సీనియర్లు తేడాల్లేవ్‌! తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌!

Published Sat, Feb 3 2024 7:49 PM

Telangana Congress MP Applications Time Over - Sakshi

హైదరాబాద్‌, సాక్షి:  తెలంగాణ కాంగ్రెస్‌లో ఎంపీ దరఖాస్తుల గడువు శనివారంతో ముగిసింది. ఉన్న 17 లోక్‌సభ స్థానాల కోసం..  మొత్తం 306 దరఖాస్తులు గాంధీభవన్‌కు వచ్చాయి. మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు రాగా, హైదరాబాద్‌లో తక్కువగా వచ్చాయి. నిన్న(శుక్రవారం) ఒక్కరోజే 100కిపైగా అప్లికేషన్లు రాగా.. దరఖాస్తులు ఇచ్చిన వాళ్లలో నేతలతో పాటు ప్రొఫెసర్లు, పలువురు ఉన్నతాధికారులు సైతం ఉండడం గమనార్హం. 

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య భారీగానే ఉంది. ముఖ్యంగా కీలక నేతలు అసెంబ్లీకి బదిలీ కావడంతో.. వాళ్ల స్థానాల్లో పోటీకి బంధువులు, సన్నిహితులు ఆసక్తి చూపిస్తున్నారు. భువనగిరి ఎంపీ సీటు కోసం కోమటిరెడ్డి బంధువులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. కోమటిరెడ్డి అన్న కొడుకు పవన్‌, బంధువు చల్లూరి మురళీధర్‌ అప్లికేషన్లు సమర్పించారు. రేవంత్‌ సీఎం కావడంతో ఖాళీ అయిన మల్కాజ్‌గిరి ఎంపీ సీటు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణతో పాటు ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్‌  కూడా ఉన్నారు. అలాగే.. రేవంత్‌ సన్నిహితుడు పటేల్‌ రమేష్‌ రెడ్డి, చామలచకిరణ్‌లు సైతం దరఖాస్తులు సమర్పించారు.

ఇక నల్గొండ సీటు కోసం జానారెడ్డి కొడుకు రఘువీర్‌ దరఖాస్తు ఇచ్చారు. మహబూబాబాద్‌ సీటు కోసం  తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్‌  రమేష్‌ భట్టు అప్లికేషన్‌ సమర్పించడం గమనార్హం. దరఖాస్తులు ఇచ్చినవాళ్లలో.. మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, ఆయన కుమార్తె చంద్రప్రియ (నాగర్‌కర్నూల్‌), ఎంఆర్‌జీ వినోద్‌రెడ్డి, విద్యా స్రవంతి (సికింద్రాబాద్‌) పెరిక శ్యామ్‌ (పెద్దపల్లి) తదితరులున్నారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మల్కాజ్‌గిరితో పాటు ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గాలైన వరంగల్, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌ కోసం మొత్తంగా నాలుగు దరఖాస్తులు అందజేశారు.

హాట్‌ సీటు ఏదంటే.. 
తెలంగాణలో కాంగ్రెస్‌ తరఫున హాట్‌సీట్‌గా మారింది ఖమ్మం లోక్‌సభ స్థానం. రేణుకా చౌదరి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, పలువురు దరఖాస్తులు ఇచ్చారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి, వీ హనుమంతరావులు సైతం అప్లికేషన్లు ఇచ్చారు. తెలంగాణ మాజీ హెల్త్‌ డైరెక్టర్‌ గడల శ్రీనివాసరావు, ప్రముఖ వ్యాపారవేత్త, వీవీసీ గ్రూపు సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ వంకాయల పాటి రాజేంద్రప్రసాద్‌లు సైతం దరఖాస్తు చేసుకున్నారు. 

హాట్‌ టాపిక్‌గా గడల 
ఖమ్మంతో పాటు సికింద్రాబాద్‌ ఎంపీ స్థానానికి కూడా గడల శ్రీనివాస్‌ దరఖాస్తు చేశారు. గతంలో హెల్త్‌ డైరెక్టర్‌గా ఉండి.. అప్పటి సీఎం కేసీఆర్‌ కాళ్లు మొక్కి వార్తల్లోకెక్కిన గడల.. కొత్తగూడెం అసెంబ్లీ టికెట్‌ ఆశించారు. కానీ కేసీఆర్‌ టికెట్‌ ఇవ్వలేదు. రేవంత్‌ సర్కార్‌ కొలువుదీరిన వెంటనే గడలను ఆ పోస్టు నుంచి బదిలీ చేసినా.. లాంగ్‌లీవ్‌లో ఉండి మరీ ఆయన సన్నిహితుల ద్వారా గాంధీభవన్‌కు దరఖాస్తు పంపించడం గమనార్హం.

Advertisement
 
Advertisement