ఎవరు హోల్డ్‌? ఎవరు ఓపెన్‌?.. అసలు కథేంటో తర్వాత అర్థమైందట..  | Sakshi
Sakshi News home page

ఎవరు హోల్డ్‌? ఎవరు ఓపెన్‌?.. అసలు కథేంటో తర్వాత అర్థమైందట.. 

Published Sun, Nov 27 2022 12:03 PM

TDP Is Unable To Find Candidate To Contest Kakinada Parliamentary Seat - Sakshi

ఏపీ రాజకీయాలకు తూర్పును మార్పుగా చెబుతారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఏ పార్టీకి అధికంగా సీట్లు వస్తాయో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనేవారు. గత ఎన్నికల్లో కూడా ఇదే సెంటిమెంట్‌ పనిచేసింది. తూర్పు జిల్లాలో కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జైత్రయాత్ర మొదలైంది. వైఎస్‌ జగన్‌ దండయాత్రతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ అడ్రస్‌ గల్లంతయింది.
చదవండి: దేవినేని వారి పబ్లిసిటీ స్టంట్స్‌.. అరెరే.. డ్రామా చేస్తే నమ్మాలి కదా..! 

ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ స్ధానానికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పచ్చ పార్టీకి అభ్యర్ధులే దొరకడంలేదట. గత ఎన్నికల్లో టీడీపీ తరపున చలమల శెట్టి సునీల్ పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తరువాత ఆయన వైఎస్సార్‌సీపీలో చేరారు. దీంతో టీడీపీలో పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్ధి కరువయ్యారు. మాజీ డిప్యూటీ సీఎం, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వచ్చే ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు అభ్యర్ధిగా టీడీపీ నుండి పోటీ బరిలోకి దిగుతారని గతంలో ప్రచారం జరిగింది. కాని తనకు అసెంబ్లీ స్ధానం చాలని.. పార్లమెంటు స్ధానం వద్దని రాజప్ప నిర్ణయం తీసుకున్నారట.

పైసలుంటేనే బాబు టికెట్లిస్తారట.!
రాజప్ప వద్దనడంతో జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్ ను దింపుతారని ప్రచారం జరిగింది. ప్రస్తుతం నవీన్ టీడీపీ కాకినాడ పార్లమెంటరీ ఏరియా అధ్యక్షుడుగా ఉన్నారు. అందువల్ల ఈ ప్రతిపాదనను చంద్రబాబు వద్ద ఉంచారట. ఐతే ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేయాలంటే కనీసం రూ.50 కోట్లు ఖర్చు చేయాలని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. తన వద్ద డబ్బు లేక పోయినా... ప్రజా బలం ఉందని నవీన్ చెప్పారట.

కాని వచ్చే ఎన్నికల్లో ప్రజాబలం కాకుండా ధన బలంతోనే పనవుతుందని చెప్పిన చంద్రబాబు.. నవీన్ ప్రతిపాదనను పక్కన పెట్టారని చర్చ నడుస్తోంది. ఆ తరువాత ప్రత్తిపాడు టిడిపి నేత వరుపుల రాజా అనుకున్నప్పటికీ.. ఆయన కూడా ప్రత్తిపాడు అసెంబ్లీ సీటుకే పరిమితమవుతానని చెప్పారట. ఒక నేతను చంద్రబాబు వద్దంటే..మరొకరు తానే వద్దనడంతో ఇంకో అభ్యర్థి కోసం వెతుకులాట మొదలైంది.

ఎవరు హోల్డ్‌? ఎవరు ఓపెన్‌.?
ప్రజాబలం ఎలాగూ లేదు.. డబ్బుంటే చాలని చంద్రబాబు చెప్పడంతో ఇద్దరు సీనియర్ నేతలకు సాన సతీష్ బాబు పేరు మదిలో మెదిలింది. కొంత కాలం క్రిందట మనీలాండరింగ్ కేసులో సిబిఐ అరెస్ట్ చేసిన సతీష్ బాబు ఐతే వచ్చే ఎన్నికల్లో డబ్బులు ఖర్చు  చేసేందుకు వెనుకాడడని ఆ సీనియర్లు భావించారు. దీంతో సాన సతీష్ బాబు పేరును చంద్రబాబు చెవిలో వేశారట. ఆ పేరు విని ఉలిక్కి పడ్డ చంద్రబాబు.. అతని పేరును అలానే హోల్డ్ లో ఉంచండి.. ఎన్నికలు సమీపించినప్పుడు చూద్దామని తనకు ఆ పేరు చెప్పిన సీనియర్ నేతలతో చెప్పారట. సతీష్ పేరును హోల్డ్‌లో ఉంచమని చంద్రబాబు ఎందుకో చెప్పారో అని సీనియర్ నేతలు ఆలోచిస్తే.. అసలు కథేంటో వారికి తర్వాత అర్ధమైందట. 

మాకొక అభ్యర్థి కావలెను.?
వచ్చే ఎన్నికల్లో జనసేనతో మాత్రమే పొత్తు పెట్టుకుంటే కాకినాడ పార్లమెంటు సీటును జనసేనకు ఇవ్వాలని... ఒక వేళ బీజేపీ, జనసేన పార్టీలు రెండింటితోను పొత్తు పెట్టుకుంటే కాకినాడ పార్లమెంటు సీటును బీజేపీకి ఇవ్వాలని చంద్రబాబు ఆలోచన చేశారట. కాని ఇటీవల విశాఖ వేదికగా జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలు టీడీపీని ఒంటరి చేశాయనే సంకేతాలు అందుతున్నాయి.

ఈ నేపథ్యంలో కాకినాడ పార్లమెంటు సీటు కోసం అభ్యర్ధిని వెతికే పనిలో పడ్డారు జిల్లా నేతలు. సతీష్‌ను బరిలో దింపితే వర్కవుట్ కాదని పార్టీలో మరి కొందరి వాదన. అయితే డబ్బు బాగా ఖర్చుచేసే అభ్యర్థి కావాలని చంద్రబాబు చెబుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికలకు కాకినాడ పార్లమెంటు స్ధానానికి టీడీపీకి అభ్యర్ధి దొరికడం కష్టంగా మారిందని తెలుగు తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు.
-పొలిటికల్‌ ఎడిటర్, సాక్షి డిజిటల్‌
feedback@sakshi.com

Advertisement
Advertisement