సాక్షిప్రతినిధి, విజయనగరం: కార్పొరేట్ ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆధిపత్యానికి తొలిసారిగా చెక్ పడింది. నెల్లిమర్ల నగర పంచాయతీ చైర్మన్ స్థానాన్ని కూటమి తరఫున బీజేపేకి కేటాయించింది. స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండానే టీడీపీ అధిష్ఠానం స్థానం కేటాయించడం గమనార్హం. టీడీపీ మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యే ఇన్నాళ్లూ వారిని తొక్కుతూ ముందుకు సాగుతున్నారు. నామినేటెడ్ పదవులతో బాటు అభివద్ధి పనులు, ఇతరత్రా ప్రభుత్వ కార్యకలాపాలు అన్నింటికీ టీడీపీని దూరం పెడుతున్నారు. మండలాల వారీగా జనసేన నాయకులతో కమిటీలు ఏర్పాటు చేసి మండల రెవెన్యూ, ఎంపీడీఓ అధికారులకు లిస్ట్ పెంపించారు.
వీళ్లు రిఫర్ చేసిన ఫైళ్లు.. పనులు మాత్రమే చేయాలని మండల.. డివిజన్ స్థాయి అధికారులకు హుకుం జారీ చేశారు. తన పీఏలు, దగ్గరివాళ్లతో ఇంకో టీమ్ ఏర్పాటు చేసి భూ వ్యాపారాలు... ఆక్రమణలు వంటివాటికి తెరలేపారు. దీంతో తమ మిత్రపక్షానికి ఎమ్మెల్యే పదవి వచ్చినా తమకు వీసమెత్తు గౌరవం, గుర్తింపు లేకపోవడంతో మార్క్ఫెడ్ రాష్ట్ర ఆధ్యక్షుడు కర్రోతు బంగార్రాజు వంటివారు బహిరంగంగానే గుర్రుమన్నారు. పార్టీ హైకమాండ్కు సమాచారం చేరవేస్తూ వస్తున్నారు. మాధవి ఒంటెత్తు పోకడలను ఓ కంట కనిపెడుతూ వస్తున్న టీడీపీ.. సరిగ్గా టైమ్ చూసి టెంకి జెల్ల కొట్టింది. ఆశలు కల్పించి చివరకు దెబ్బ కొట్టారు.
వాస్తవానికి జనసేన ఎమ్మెల్యేలు ఉన్నచోట స్థానిక సంస్థల పదవులు టీడీపీ జనసేన మధ్య ఫిఫ్టీ ఫిఫ్టీ షేరింగ్ అని మొదట్లో ప్రచారం చేశారు. ఈ లెక్కన నాలుగు మండలాల ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ పదవుల వరకు ఆ లెక్కన వాటాలు వేస్తే వేయచ్చేమో కానీ నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్న ఒకేఒక నగర పంచాయతీ మాత్రం జనసేనకు వస్తుందని నమ్మకం కలిగించారు. జనసేన కార్యకర్తలు సైతం జోష్లో ఉన్నారు. ఈ క్రమంలో పలువురు కార్యకర్తలు మాధవిని కలిసి నగర పంచాయతీకి తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు.
పరిస్థితి అంతా తన కంట్రోల్లో ఉందని భావించిన ఎమ్మెల్యే కూడా వారికి భరోసా ఇస్తూ వచ్చారు. ప్రచారంలో భాగంగా నెల్లిమర్లలో ఇల్లు కూడా తీసుకున్నారు. దసరా కానుకల పేరిట రెండు రోజుల కిందట కొంతమంది ఓటర్లకు చీరలు కూడా పంపిణీ చేశారు. జనసేన అభ్యర్థి పేరును కూడా నిర్ణయించారు. సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీకి చైర్మన్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో అంతా అవాక్కయ్యారు. బీజేపీకి వెళ్లినట్లు ఎమ్మెల్యేకు కూడా ఈ విషయం తెలియకపోవడం గమనార్హం. దీంతో ఏం చేయాలో తోచక, క్యాడర్కు సమాధానం చెప్పలేక మాధవి సైలెంట్ అయ్యారు.
ఇదిలా ఉండగా అటు టీడీపీ సైతం పోటీకి సిద్ధమైంది. టీడీపీకి చెందిన లెంక అప్పలనాయుడు చైర్మన్ అభ్యర్థిగా టీడీపీ కండువా ధరించి నామినేషన్ దాఖలు చేశారు. మొత్తానికి ఏదైతేనేం మాధవికి గట్టి షాక్ ఇచ్చామని టీడీపీ నాయకులు లోలోన సంబరపడుతుండగా జన సైనికులు మాత్రం కరెంట్ షాక్ తగిలిన కాకిలా గిలగిల్లాడుతున్నారు.
ఇదీ చదవండి: పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ


