అబద్ధాలపై టీడీపీ అదే యాగీ | Sakshi
Sakshi News home page

అబద్ధాలపై టీడీపీ అదే యాగీ

Published Fri, Mar 18 2022 4:49 AM

TDP Over Action In AP Assembly Budget Sessions - Sakshi

సాక్షి, అమరావతి: ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి టీడీపీ నాలుగు రోజులుగా పడరాని పాట్లు పడుతూ దిగజారి వ్యవహరిస్తోంది. వాస్తవాలకు పాతరేసి, శవ రాజకీయం చేస్తోంది. బయట చంద్రబాబు, సభలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు నానా యాగీ చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం  శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేలు అరుపులు, కేకలతో మితిమీరి ప్రవర్తించారు. శాసనసభాపతిని, ముఖ్యమంత్రిని కించపరుస్తూ నినాదాలు చేశారు. కాగితాలు చింపి స్పీకర్‌పైకి విసురుతూ సభా కార్యాక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగుతున్నంత సేపు సభాపతి వారిస్తున్నా వినిపించుకోకుండా చప్పట్లు కొడుతూ, వాటర్‌ బాటిళ్లతో బల్లలపై కొడుతూ గోల గోల చేశారు.

ఉదయం సభ ప్రారంభం కాగానే తెలుగుదేశం సభ్యులు యథావిధిగా స్పీకర్‌ వెల్‌ను చుట్టుముట్టి అరుపులు, నినాదాలతో సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. గీత దాటితే వేటే అని రెండు రోజుల క్రితం స్పీకర్‌ ఇచ్చిన రూలింగ్‌ను ఉల్లంఘిస్తూ పోడియం పైకి ఎక్కి సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. చినరాజప్ప, ఆదిరెడ్డి భవాని, వేగుళ్ల జోగేశ్వరరావు తదితరులు మెట్లపై కూర్చొని నిరసన కొనసాగించారు. టీడీపీ సభ్యులకు ప్రతి రోజూ ఇది ఆనవాయితీగా మారిపోయిందని, దయచేసి ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని స్పీకర్‌ కోరారు. అనగాని సత్యప్రసాద్, మరికొందరు సభ్యుల ప్రవర్తనపై స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం అంశంపై ప్రభుత్వం ప్రకటన చేసినందున, మరోసారి చర్చించే అవకాశంలేదని స్పష్టం చేశారు. అయినప్ప టికీ వారు దూసుకొస్తుండటంతో స్పీకర్‌ ఆదేశాల మేరకు మార్షల్స్‌ అడ్డుకున్నారు. 

స్పీకర్, సీఎంను కించపరుస్తూ నినాదాలు
స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లకుండా మార్ష ల్స్‌ అడ్డుగా నిలబడటంతో తెలుగుదేశం సభ్యులు వారి సీట్ల వద్ద నిలబడి సభాపతిని, సీఎంని కించపరుస్తూ గట్టిగా నినాదాలు చే శారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరగకుండా గట్టిగా శబ్దం చేస్తూ అడ్డుకోజూశారు. కొంత మంది కాగితాలు ఉండలుగా చుట్టి స్పీకర్‌ పోడియంపైకి విసిరారు. మరికొందరు నిబంధనలకు వ్యతిరేకంగా సభలో దృశ్యాలను సెల్‌ఫోన్లలో చిత్రీకరించి,  వాట్సాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు బయటకు పంపారు. ఈ విషయం స్పీకర్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఒక్క సభ్యుడు కూడా సెల్‌ఫోన్లను సభలోకి తీసుకు రాకూడదని అప్పటికప్పు డు రూలింగ్‌ ఇచ్చారు. మార్షల్స్‌ వారి విధి నిర్వహణలో భాగంగానే టీడీపీ సభ్యులను పోడియం నుంచి వారి స్థానాలకు పంపించారన్నారు. ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని పలుమార్లు సూచించినప్పటికీ, వారు వినిపించుకోక పోవడంతో ఒక రోజు పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వారు ఈలలు వేస్తూ బయటకు వెళ్లడం చూసి మిగతా సభ్యులు విస్మయానికి గురయ్యారు.

బాబు డైరెక్షన్‌లో శవ రాజకీయాలు 
అంతకుముందు టీడీపీ సభ్యుల ప్రవర్తనపై అధికార పార్టీ సభ్యులు పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యులు చంద్రబాబు డైరక్షన్‌లో ప్రతి రోజూ ఎదో ఒక రీతిలో గిల్లి కజ్జాలు పెట్టుకొని సభను అడ్డుకుంటున్నారని విమర్శించారు. వారు సస్పెండ్‌ అయిన తర్వాతే సభ జరిగే విధంగా ఒక స్పష్టమైన కార్యాచరణతో వస్తున్నారని చెప్పారు. సభాకాలాన్ని హరిస్తున్న వీరిని తక్షణం సస్పెండ్‌ చేయాలని కోరారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వివరణను తెలుగుదేశం పార్టీ సభ్యులు తప్పుదోవ పట్టిస్తున్నారని, సభను ఎంత ప్రశాంతంగా నడపాలని చూస్తున్నా వారు గొడవ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే ఊరుకునేది లేదని, నిరసన తెలపడానికి కూడా ఒక పద్ధతి ఉంటుందని, ఇది సరైన విధానం కాదన్నారు. శ్మశానాల వద్ద మనుషులను పెట్టి కొత్త శవాల కోసం తెలుగుదేశం పార్టీ సభ్యులు వెతుకుతున్నారంటూ ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి విమర్శించారు. దేవదాయ శాఖ మంత్రి  వెలంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ శ్మశాన వాటికకు కేరాఫ్‌ అడ్రస్‌గా టీడీపీ ఆఫీసు మారిందన్నారు.   

Advertisement
Advertisement