
పద్ధతి మార్చుకో.. లేకపోతే నేనే రంగంలోకి దిగుతా
ఇందుకు రెండు నెలలే గడువు
మంత్రి టీజీ భరత్‌కు టీడీపీ సీనియర్ నేత కేఈ ప్రభాకర్ హెచ్చరిక
కర్నూలు జిల్లా టీడీపీ మహానాడులో విభేదాలు బహిర్గతం
కర్నూలు రూరల్: మంత్రి టీజీ భరత్ వ్యవహారశైలిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ఫైర్ అయ్యారు. పద్ధతి మార్చుకోకపోతే తానే రంగంలోకి దిగి పని చెబుతానని హెచ్చరించారు. ఇందుకు రెండు నెలల గడువిస్తున్నట్లు చెప్పారు. గురువారం కర్నూలులో జిల్లా మహానాడు జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు జయ నాగేశ్వరరెడ్డి, కేఈ శ్యామ్‌బాబు, బొగ్గుల దస్తగిరి, జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి తదితరులు హాజరయ్యారు. మంత్రి టీజీ భరత్ గైర్హాజరవడంతో కేఈ ప్రభాకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
మంత్రి వ్యవహార శైలి ఏ మాత్రం బాగోలేదని.. నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్తే ఆధార్ కార్డు చూసి పనులు చేయడం ఏమిటని ప్రశి్నంచారు. కర్నూలు నియోజకవర్గం వారికి మాత్రమే పనులు చేయడం అన్యాయమన్నారు. మంత్రి తన పనితీరును మార్చుకోకపోతే రెండు నెలల్లో తానే డైరెక్ట్‌గా ఆయనను ఎదుర్కొనేందుకు రంగంలోకి దిగుతానని హెచ్చరించారు. కాగా, మంత్రిపై కేఈ ప్రభాకర్ విరుచుకుపడుతున్నా.. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సహా ఆ పార్టీ ప్రజాప్రతినిధులెవ్వరూ నోరు మెదపకపోవడం గమనార్హం. మరోవైపు ఆ పార్టీ కార్యకర్తలు సైతం మహానాడును పట్టించుకోకపోవడంతో సభలో పెద్ద ఎత్తున ఖాళీ కుర్చిలు దర్శనమిచ్చాయి.
పొత్తుతో కమ్యూనిస్టు పార్టీల్ని చిత్తు చేశాం.. టీడీపీకి ఇప్పుడా పరిస్థితి రాకుండా చూడండి
⇒ నాడు టీడీపీ తెలివైన రాజకీయం చేయగలిగింది
⇒ పదవుల పంపకంలో నిష్పత్తి ఎక్కడ పాటిస్తున్నారు?
⇒ ఇలాంటి పరిస్థితి ఇంకా ఎంతకాలం .. ఇది కరెక్ట్ కాదు
⇒ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాట్ కామెంట్స్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘అప్పట్లో మనం తెలివిగా రాజకీయం చేసి ఉభయ కమ్యూనిస్టు పార్టీలను రాష్ట్రంలో నిరీ్వర్యం చేసేశాం. మన పార్టీతో పొత్తు పెట్టుకున్న కారణంగానే నాడు ఆ రెండు పార్టీలూ రాష్ట్రంలో శాశ్వతంగా నష్టపోయాయి. పొత్తుతో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఒకటో, రెండో పదవులు వచ్చి ఉండవచ్చు. ఆ తరువాత మాత్రం ఆ పార్టీలు రాష్ట్రంలో అడ్రస్ లేకుండా పోయాయి. ఇప్పుడు ఆ పరిస్థితి మన పార్టీకి రాకుండా రాష్ట్ర నాయకత్వం చూడాలి’ అని టీటీడీ బోర్డు సభ్యుడు, కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో గురువారం జరిగిన టీడీపీ జిల్లా మహానాడులో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.
జనసేన, బీజేపీతో పొత్తు మనకే నష్టం
‘జనసేన, బీజేపీ పొత్తుతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నిర్వీర్యమైపోతుంది. ఈ పరిస్థితిని అధిష్టానం ఇప్పుడు గుర్తించకపోతే టీడీపీ పరిస్థితి కూడా ఉభయ కమ్యూనిస్టు పార్టీల మాదిరిగానే తయారవుతుంది’ అని జ్యోతుల హెచ్చరించారు. ‘రాజకీయాల్లో కూటములుంటాయి. పార్టీలతో కలిసి పనిచేసే విధానం ఉంటుంది. టీడీపీ ఏర్పడిన తరువాత ఎన్నిసార్లు కూటములు ఏర్పడలేదు? ఎన్ని రాజకీయ పార్టీలతో కలవలేదు? ఎన్నిసార్లు బయటకు రాలేదు? పొత్తు నుంచి బయటకు వచి్చనప్పుడు మన పరిస్థితి ఏమిటో ఒక్కసారి చూడండి’ అని అన్నారు. ‘ఇది కరెక్ట్ కాదు. ఇలా ఎన్నాళ్లుంటుంది. ఆ పరిస్థితి తెలుగుదేశం పార్టీకి రాకుండా నాయకత్వం చూడాలి’ అని అన్నారు.
నిష్పత్తి ప్రకారమే పదవులు
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు నిష్పత్తి ప్రకారమే పదవుల పంపకం జరగాలని నెహ్రూ అన్నారు. ఒక వ్యక్తికి రెండు పదవులు (జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబుకు కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ పదవి ఉండగా తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు) ఇచ్చే పరిస్థితి న్యాయమా అని జ్యోతుల నిలదీశారు. ఒక పదవి ఉండగానే ఇక్కడ మరో పదవి ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచి్చందని ప్రశి్నంచారు. మెజార్టీ ఉన్న టీడీపీ పరిస్థితి ఏమిటని అన్నారు.
టీడీపీలో ఎవరికిస్తారని అడగడం లేదని, పార్టీ నాయకులకు ఇవ్వాలని మాత్రమే కోరుతున్నానని చెప్పారు. టీడీపీ ఒక్కటే అధికారంలో లేదని, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని, అన్నీ అందరూ కలిసి సమన్వయంతో కలిసి నడుపుకోవాలని సూచించారు. అసలు ఏ పార్టీకి ఎన్ని పదవులిచ్చారో ఒక్కసారి ఆలోచించాలని కోరారు. టీడీపీలో ద్వితీయ శ్రేణి నేతలు పార్టీ కోసం రూ.లక్షలు ఖర్చు పెట్టుకుని నాశనమైపోయారన్నారు. ‘మీకు ఏ పనీ పాటా లేదా’ అని ఇంట్లో వారి భార్యలు తిడుతున్నారన్నారు. కనీసం వారికి సమాధానం చెప్పడానికైనా ఏదో ఒక తోక (పదవి) తగిలించాలని నెహ్రూ విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గు పడుతున్నా
⇒ నిధుల కేటాయింపులో ఎందుకీ వివక్ష
⇒ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు
⇒ మినీ మహానాడులో మాడుగుల ఎమ్మెల్యే బండారు వ్యాఖ్యలు
నక్కపల్లి: ‘ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా. నియోజకవర్గంలో తిరగలేకపోతున్నా. ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నా. ఏడాది నుంచి ఒక్క అభివృద్ధి పనీ చేయలేకపోయా. నిధుల కేటాయింపులో ఎందుకీ వివక్ష’ అంటూ అనకాపల్లి జిల్లా మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తీవ్ర అసంతృప్తి, ఆక్రోశం వెళ్లగక్కారు. పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలోని అడ్డురోడ్డులో గురువారం జరిగిన టీడీపీ జిల్లా మినీ మహానాడు వేదికపై జిల్లా పార్టీ అధ్యక్షుడి సమక్షంలోఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా మంత్రి వంగలపూడి అనిత ఎదుట ఎమ్మెల్యే బండారు నిస్సహాయంగా చేసిన ప్రసంగం దుమారం రేపింది.
బండారు మాట్లాడుతూ.. మాడుగుల, చోడవరం నియోజకవర్గాలు బాగా వెనుకబడి ఉన్నాయన్నారు. చంద్రబాబు ఆదేశిస్తేనే ఇక్కడికి వచ్చి పోటీ చేశానన్నారు. టీడీపీ, చంద్రబాబు, తనపై ఉన్న నమ్మకంతో మాడుగుల ప్రజలు 28 వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే ఏడాది పూర్తవుతున్నా ఒక్క అభివృద్ధి పనీ చేయలేకపోయానన్నారు. మంత్రులు, ప్రభుత్వంలో పలుకుబడి ఉన్నవారు వారి ప్రాంతాలకు అధిక శాతం నిధులు పట్టుకుపోతూ మాడుగుల, చోడవరం నియోజకవర్గాలకు అరకొరగా నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో ఇద్దరు జనసేన పార్టీ వారైతే, టీడీపీ నుంచి గెలిచిన వారిలో ఒకరు స్పీకర్‌గా, మరొకరు హోంమంత్రిగా ఉన్నారన్నారు.
మిగిలిన ఇద్దరిలో తాను, చోడవరం ఎమ్మెల్యే కేవీఎస్‌ఎన్ రాజు ఉన్నత పదవుల్లేకుండా నియోజకవర్గానికి మాత్రమే పరిమితమై పని చేయాల్సి వస్తోందని అసంతృప్తి వెళ్లగక్కారు. ఈ రెండు నియోజకవర్గాల్లో పెద్దేరు, రైవాడ జలాశయాలు ఉన్నాయని, వీటి మరమ్మతులకు నిధులు కేటాయించాలని ప్రభుత్వ పెద్దలను కోరితే పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో రిజర్వాయర్ల ఆధునికీకరణ, మరమ్మతులకు నిధులు కేటాయిస్తున్నట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయన్నారు.
ఇక్కడ మాత్రం నిధులివ్వట్లేదని, ఈ నియోజకవర్గ ప్రజలు టీడీపీకి ఓట్లేయలేదా అని నిలదీశారు. ‘పోనీ.. మూడేళ్లపాటు నిధులివ్వలేమని చెప్పేయండి. నేను నియోజకవర్గంలోకి వెళ్లి నాకు ఓట్లేసి గెలిపించిన ప్రజల కాళ్లావేళ్లాపడి ప్రాధేయపడతా’ అని ఆక్రోశం వెళ్లగక్కారు. మూడు నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న గోవాడ సుగర్ పరిశ్రమ మూతపడే స్థితికి చేరుకుందని, ఆధునికీకరణకు నిధులు విడుదల చేయాల్సి ఉందన్నారు.