వైఎస్సార్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌

TDP Ex MLA Panchakarla Ramesh Babu Joined In YSRCP - Sakshi

సాదరంగా ఆహ్వానించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

వికేంద్రీకరణపై సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న విశాఖ జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు పంచకర్ల

ఉత్తరాంధ్రకు మంచి రోజులు వచ్చాయని హర్షం

చంద్రబాబు విధానాలతో విసిగిపోయామని వ్యాఖ్య

పనిగట్టుకుని ఉత్తరాంధ్రపై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం

సాక్షి, అమరావతి: విశాఖపట్నం జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ బాబు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. సీఎం జగన్‌ ఆయనకు పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ ఇన్‌చార్జ్‌ వి.విజయసాయిరెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాస్, వెలంపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. పార్టీలో చేరిన రమేష్‌ సేవలను తప్పకుండా ఉపయోగించుకుంటామని, ముఖ్యమంత్రి ఆయనకు సముచితమైన స్థానం కల్పిస్తారని విజయసాయిరెడ్డి చెప్పారు. పార్టీలో చేరడం సంతోషకరమైన విషయమని అన్నారు. పంచకర్ల రమేష్‌ బాబుతో పాటు ఇతర నేతలు లంకా మోహన్‌ రావు, చెల్లుబోయిన రామ్మోహన్, కాండ్రేగుల జోగేందర్‌  సింహాచలం నాయుడు వైఎస్సార్‌సీపీలో చేరారు. 

ఉత్తరాంధ్రపై చంద్రబాబు విషం: పంచకర్ల
► చంద్రబాబు నిర్ణయాలతో విసిగి పోయి 5 నెలల క్రితమే టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశాను.  చంద్రబాబు, ఆయన మనుషులు పనిగట్టుకుని ఉత్తరాంధ్రపై విషం చిమ్ముతున్నారు. తన మనుషులే అభివృద్ధి చెందాలనే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. 
► అభివృద్ధి వికేంద్రీకరణపై ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఈ నిర్ణయాన్ని ఉత్తరాంధ్రతో సహా మూడు ప్రాంతాల ప్రజలూ స్వాగతిస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ధర్నాలు చేయాలని చంద్రబాబు ప్రజలను, రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. 
► లోకేష్‌ నాయకుడిగా పనికి రాడని టీడీపీ నేతలంతా చెప్పినా, బాబు దొడ్డిదారిన అతన్ని మంత్రిని చేశారు.  పార్టీపై పెత్తనం చెలాయించేలా చేశారు. లోకేష్‌ అజ్ఞానాన్ని మేము భరించలేక పోయాం. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగన్‌ నాయకత్వంలో ఇంతకాలానికి ఉత్తరాంధ్రకు మంచి రోజులు వచ్చాయి. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా మారబోతోంది.

మీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి : మంత్రి అవంతి
► చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఇచ్చిందే ఉత్తరాంధ్ర  ప్రజలు. ఆయనకు అంత నమ్మకమే ఉంటే.. విశాఖలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్‌ చేస్తున్నాం. అప్పుడే ఉత్తరాంధ్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో చంద్రబాబుకు తెలుస్తుంది. 
► చంద్రబాబు ఇప్పటికైనా ఊహల్లోంచి బయటకు రావాలి. ఆయన అధికారంలో ఉండగా విశాఖలో ప్రైవేట్‌ గెస్ట్‌ హౌస్‌లకు రూ.23 కోట్లు చెల్లించారు. జగన్‌ ప్రభుత్వం 30 ఎకరాల్లో స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ కట్టాలని నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు అడ్డుపడుతుండటం దారుణం. అమరావతిలో తాత్కాలిక భవనాలకు మాత్రం 33 వేల ఎకరాలను సేకరించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top