కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు బాబు.. మొన్నటివరకు విర్రవీగారు.. ఇప్పుడేమైంది..

TDP Chandrababu Amaravati Land Scam Corruption AP CID - Sakshi

ఇంతకాలం తెలుగుదేశం నేతలు, ఆ  పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, జ్యోతి, టీవీ 5 వంటి మీడియా సంస్థలు ఏమని అంటుండేవి? ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి వెంట్రుక కూడా పీకలేరని, వారేమిటి? స్వయంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు కూడా ఏం పీకుతారు? అంటూ రెచ్చిపోయి మాట్లాడుతుంటారు. పైగా ఎదురు డబాయించడం. వాళ్లను బ్యాన్ చేస్తా! వీళ్లను బ్యాన్ చేస్తా? నేను గెలిచాక పోలీసుల సంగతి చూస్తా! జగన్‌కు ట్రీట్‌మెంట్ ఇస్తా అంటూ  ఇష్టారీతిన బెదిరించడం చంద్రబాబుకు  అలవాటైంది. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబే అంతలా మాట్లాడుతుంటే, అధికారంలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిస్సహాయంగా చూస్తూ ఉంటారా? ఈ సరికే  అనేక కేసులలో చంద్రబాబు అండ్ కో ఏ రకంగా నిందితులో జగన్ అసెంబ్లీలోనే  తెలియచెప్పారు.  

అప్పట్లో  చంద్రబాబుకు న్యాయ వ్యవస్థలో ఉన్న బలం ఆధారంగా కేసులు ముందుకు వెళ్లకుండా నెగ్గుకు రాగలిగారు.  కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు కదా! అప్పుడప్పుడు ఆయనకు కూడా  ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆయన పై వచ్చిన అవినీతి అభియోగాల మీద విచారణకు వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినా తమను ఏమీ పీకలేరని టీడీపీ నేతలు సవాల్ చేస్తూ వచ్చారు. అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం  ఇప్పుడు ఆ  అవినీతి ఆరోపణల నిగ్గు తేల్చడానికి నడుం బిగించింది. రాజధాని భూములలో క్విడ్ ప్రోకో జరిగిందని చెబుతున్న కేసులో ఆస్తుల జప్తునకు సిఐడీకి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.  దాంతో టీడీపీ నేతలు గగ్గోలు పెట్టడం ఆరంభించారు. అమ్మో! ఇంకేముంది ఇదంతా రాజకీయ వేధింపే అంటూ ప్రచారం ఆరంభించారు. 

వారికి మద్దతు ఇచ్చే పత్రిక ఒకటి జగన్ టీడీపీ నేతలను వేటాడమన్నారని ఏకంగా కథనాన్ని రాసింది. మరో టీడీపీ పత్రిక చంద్రబాబు అద్దెకు ఉంటున్న ఇల్లును జప్తు చేశారని పేర్కొంది. అదేదో చంద్రబాబుకు సంబంధం లేని భవంతి అని జనం అనుకోవాలన్నది వారి తాపత్రయం కావచ్చు.  అసలు  ప్రభుత్వం చేసిన అభియోగం ఏమిటి? రియల్ ఎస్టేట్ వ్యాపారి లింగమనేని రమేష్‌కు ప్రభుత్వపరంగా లాభం చేసి, ప్రతిఫలంగా చంద్రబాబు ఆయనకు చెందిన ఇంటిని పొందారన్నది ఆరోపణ. దీనినే క్విడ్ ప్రోకో అంటారు. గతంలో ఒక వ్యక్తిగా  జగన్  పరిశ్రమలు పెడితే, వాటిలో ఎవరైనా పెట్టుబడులు పెడితేనే చంద్రబాబు బ్యాచ్ క్విడ్ ప్రోకో అంటూ ఆరోపించేది. దానికి సోనియాగాంధీ కూడా తోడై అక్రమ కేసులు పెట్టి ఆయనను నెలల తరబడి జైలులో ఉంచారు. మరి చంద్రబాబు ఏకంగా కొందరికి అనుచిత లబ్ది చేకూర్చి ఒక భవంతిని తీసుకుంటే ఏమనాలి? బహుమతి అని వినసొంపైన పేరు పెట్టినా, దానినే లంచం అని కూడా అంటారు కదా!  

ఈ ఇంటికి సంబంధించి చంద్రబాబు ఎన్నిసార్లు ఎన్నిరకాలుగా మాట్లాడారు? ఒకసారి ఇది ప్రభుత్వ భవనం  అని, పూలింగ్ లో వచ్చిందని, తను సీఎంను కనుక అందులో ఉంటున్నానని అన్నారు. ఈ ఒక్క భవనాన్ని మాత్రమే ఉంచుతామని, మిగిలిన నదీతీర భవనాలను తొలగించి టూరిజం అభివృద్ది చేస్తామని కూడా ఆయన చెప్పారు. ఆయన పదవీకాలంలో ఆ పనిచేయలేదు.  నిజానికి అసలు ఆయన ఉంటున్న  కట్టడమే అక్రమ నిర్మాణం. నదీ తీర ప్రాంత నిబంధనలను ఉల్లంఘించిన కట్టడం. గతంలో ఒకసారి పెద్ద ఎత్తున వరదలు వస్తే అప్పటి టీడీపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నదిలో పడవలో తిరుగుతూ  ఈ అక్రమ కట్టడాలన్నిటిని తమ ప్రభుత్వం కూల్చి వేస్తుందని చెప్పారు. ఈ కట్టడాల వల్ల నది ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోందని చెప్పారు. కానీ ఆ తర్వాత కాలంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబే అందులో నివాసానికి దిగేసరికి ఎక్కడివారక్కడ నోరు మూసుకోవలసి వచ్చింది.

హైదరాబాద్‌లో ఓటుకు నోటు కేసులో నుంచి బయటపడడానికి రాత్రికి, రాత్రే చంద్రబాబు విజయవాడకు వెళ్లిపోయిన తర్వాత జరిగిన పరిణామం ఇది. పర్యావరణవేత్లలు చెప్పినా, అధికారులు చెప్పినా, అదే  అక్రమ కట్టడంలో ఉండడానికి చంద్రబాబు ఇష్టపడ్డారు. అప్పట్లోనే చంద్రబాబు ఈ ఇంటిని తీసేసుకున్నారని ప్రచారం జరిగేది. ఇంటి యజమాని లింగమనేని రమేష్ కూడా తాను ప్రభుత్వానికి ఇచ్చేశానని ప్రకటించారు.  అది చంద్రబాబు క్విడ్ ప్రోకో కింద బహుమతిగా పొందారని,  కోట్ల రూపాయల విలువైన ఆ భవంతిని ఆయన అలా పొందడం చట్ట విరుద్దమని సీఐడీ కేసు పెట్టి , భవనాన్ని జప్తు చేసింది. లింగమనేని రమేష్‌కు చంద్రబాబు ఏ రకంగా ఉపయోగపడ్డారు? ముందస్తు సమాచారం ద్వారా  రమేష్‌కు ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సహకరించారని, అమరావతి రాజధాని గ్రామాల చుట్టూరా  రింగ్ రోడ్డు ప్లాన్  వేసినప్పుడు రమేష్ భూములు ప్రభుత్వ భూ సమీకరణలో పోకుండా అలైన్ మెంట్ లో మార్పులు చేశారని  సీఐడీ ఆరోపణ. 

చంద్రబాబుకు కుటంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీకి చెందిన  భూమి పోకుండా, రింగ్ రోడ్డు పక్కనే తమ భూమి ఉండేలా ప్లాన్ మార్చుకున్నారన్నది మరో అభియోగం. హెరిటేజ్ సంస్థ కూడా ముందస్తుగానే కంతేరు ప్రాంతంలో 14 ఎకరాల మేర కొనుగోలు చేసింది.  అది అప్పట్లోనే  వివాదాస్పదం అయింది. చంద్రబాబు అద్దెకు ఉంటున్నందునే ఆ ఇల్లు ను జప్తు చేశారన్నట్లుగా టీడీపీ మీడియా చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఉత్త పుణ్యానికి చంద్రబాబు ఆ ఇంటిని పొందారన్నది ఆరోపణ. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది ప్రభుత్వ భవనమని చెప్పిన చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చాక అది ప్రైవేటు బిల్డింగ్ అని అసెంబ్లీలో చెప్పడం విశేషం. ప్రభుత్వ భవనం అయితే  దానిని ప్రభుత్వానికి స్వాధీనం చేయవలసి ఉంటుంది. లేదా ప్రతిపక్ష నేత హోదాలో దానిలో ఉంటున్నానని చెప్పవచ్చు.  అలాకాకుండా మళ్లీ లింగమనేనికి ఎలా వెళుతుంది? ఒకవేళ నిజంగానే లింగమనేని నుంచి అద్దెకు తీసుకుని ఉంటే, సంబందిత అద్దె లావాదేవీలు ఎందుకు చూపించలేదు? ఈ ప్రశ్నలకు చంద్రబాబు ఇంతవరకు జవాబు ఇవ్వలేదు. 

మాజీ మంత్రి పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం దొరకడం లేదు.  ఆయన తరపున కొందరు టీడీపీ నేతలు మాత్రం యథా ప్రకారం ఇదంతా కక్ష అని విమర్శిస్తూ మాట్లాడారు. నారాయణ సమీప బంధువులు లేదా ఆయన విద్యా సంస్థలలో పనిచేసే సిబ్బంది పేరుతో ముందుగానే భూములు కొనుగోలు చేయించి, ఆ తర్వాత అధిక లాభం పొందాలని నారాయణ ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ఆయనకు సంబంధించినవారిని సీఐడీ విచారించింది. వారు తమ సాక్ష్యాలలో ఆ భూములు నారాయణవేనని వెల్లడించారట. తాజాగా ఈ లావాదేవీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు రెండున్నర ఎకరాల  వాటా ఉందని వార్త వచ్చింది. చంద్రబాబు, పవన్ లు ఇద్దరికి లింగమనేని సన్నిహితుడు కావడం విశేషం. చంద్రబాబు ప్రభుత్వం మార్పు చేసిన అలైన్ మెంట్ కనుక అమలు అయి ఉంటే వేల కోట్ల రూపాయల లబ్ది వీరికి అక్రమంగా  జరిగి ఉండేదని సీఐడీ అంచనా వేసింది. 

ఈ సందర్భంలో ఒక ఉదాహరణ చెప్పాలి. హైదరాబాద్‌లో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి గాను భూ సేకరణ జరిగింది. ఆ టైమ్ లో తెలుగుదేశం నేతలు పలు ఆరోపణలు చేస్తుండేవారు. ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ తో పాటు కొందరు టీడీపీ నేతలకు చెందిన భూముల గుండా రింగ్ రోడ్డు వెళ్లిందని, తద్వారా వారికి  నష్టం వాటిల్లేలా చేశారని ఈనాడు మీడియా కథనాలు ఇచ్చేది. అలాగే రామోజీరావుకు చెందిన కొంత భూమి కూడా పోయిందని అంటారు. దాంతో ఆయన ఆగ్రహానికి లోనై  అవుటర్ రింగ్ రోడ్డులో గద్దలు అంటూ చెలరేగిపోయి బోలెడు స్టోరీలు ఇచ్చేవారు. అయినా ఆనాటి ప్రభుత్వం వాటిని ఎదుర్కొని అధికారుల సమావేశం ఏర్పాటు చేసి, అన్ని రాజకీయ పక్షాలను ఆహ్వానించి వారి సందేహాలను నివృత్తి చేసే యత్నం చేసింది. అప్పట్లో అన్ని స్టోరీలు రాసిన ఈనాడు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన ఇన్ సైడ్ ట్రేడింగ్ ,అలైన్ మెంట్ మార్పు, అస్సైన్డ్ భూముల కుంభకోణం వంటివాటికి మద్దతు ఇచ్చేలా వార్తలు ఇస్తుండడం విశేషం. 

ఇక  ఈ కేసు ఏమవుతుందన్నది ఆసక్తికరం. ఎసీబీ న్యాయమూర్తికి ఈ జప్తు సమాచారం ఇచ్చి ఆయన అనుమతి పొంది ముందుకు వెళ్లవలసి ఉంటుంది.  అయితే ప్రభుత్వం పెట్టిన 1944 నాటి చట్టం ప్రయోగిస్తారా అని టీడీపీ మీడియా వాపోతోంది. అందులో ఉన్న సెక్షన్ 3 వర్తించదని, కేసు నిలబడదని వాదిస్తోంది. చట్టం ఎప్పటిదైనా అది రద్దు కానంతవరకు అమలు అవుతుంది. మన దేశంలో ఉన్న క్రిమినల్ చట్టాలలో అత్యధికం స్వాతంత్రం రావడానికి పూర్వం నాటివేనన్న సంగతి మర్చిపోరాదు.  చంద్రబాబు, లింగమేనేని, నారాయణలపై ఆరోపణలు చేస్తున్నా, అసలు రాజధానే  నిర్మాణం కానప్పుడు, రింగ్ రోడ్డే లేనప్పుడు అవినీతి ఎలా అవుతుందని టీడీపీ మీడియా ప్రశ్నించింది. గత ప్రభుత్వం  రూపొందించిన దాని ప్రకారం  అమలు చేస్తే  చంద్రబాబు తదితరులు లాభపడేవారా? కారా? అన్నది ఇక్కడ ప్రశ్న. 

దొంగతనం జరిగినా, సొత్తు ఏమీ దక్కలేదుగా అంటే చోరీ నేరం కాకుండా పోతుందా? అన్నది ఇక్కడ ప్రశ్న. కోర్టులో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందన్నది ఆసక్తికరమైన విషయమే. జాతీయ స్థాయిలో సంచలనం రేపిన 2 జీ స్పెక్ట్రం , బొగ్గు గనుల స్కామ్ లలో  కూడా ఊహజనిత నష్టాల ఆధారంగానే సీబీఐవారు  కేసులు పెట్టారన్న సంగతి గుర్తుంచుకోవాలి.    రాజధాని భూముల క్విడ్ ప్రోకో  కేసులోనే కాకుండా అస్సైన్డ్ భూముల వ్యవహారంలో కూడా  టీడీపీ నేతలు  చిక్కుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద  చంద్రబాబు తో సహా టీడీపీ నేతల మూలాలను వైసీపీ ప్రభుత్వం పీకడం మొదలుపెట్టినట్లేనా! తెలుగుదేశం నేతలు ఇంతకాలం ఏం పీకుతారంటూ వేస్తున్న ప్రశ్న జవాబు లభిస్తున్నట్లేనా!


-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్‌

చదవండి: మలుపు తిప్పిన ముఠా! బాబు దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌కూ వాటా

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top