జనసేన x టీఢీపీ

tdp between janasena leaders clashes incident jaggampeta  - Sakshi

రసాభాసగా టీడీపీ–జనసేన ఆత్మీయ సమావేశాలు 

ఇరు పార్టీల నేతల్లో అడుగడుగునా అభద్రతా భావం, ఆధిపత్య పోరు   

గండేపల్లి/గోకవరం/మదనపల్లె/పెడన/బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు)/తుమ్మపాల (అనకాపల్లి జిల్లా) : టీడీపీ–జనసేన ఆత్మియ సమావేశాలు ఇరు పార్టీ నేతల మధ్య  అంతరాలను బట్టబయ­లు చేస్తున్నాయి. ఆ రెండు పార్టీల నేతలకు ఏ దశలోనూ అసలు పొసగడం లేదు. దీంతో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు బాహాబాహీకి దిగుతూ సమావేశాలను రసాభాసగా మార్చేస్తున్నారు. తాజాగా గురువారం జరిగిన సమావేశాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది.   

ఆ జనసేన నేతకు టికెట్‌ ఇస్తే మద్దతివ్వం: టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ప్రతిజ్ఞ 
టీడీపీ, జనసేన పొత్తు కాకినాడ జిల్లాలో ఆదిలోనే వికటిస్తోంది. ఇటీవల పిఠాపురంలో ఈ రెండు పార్టీల సమావేశం రసాభాసగా ముగియగా, తాజాగా గురువారం జగ్గంపేట నియోజకవర్గ సమావేశానిదీ అదే పరిస్థితి. సమావేశానికి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి జ్యోతుల నెహ్రూ, ఆయన తనయుడు నవీన్‌కుమార్, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పాటంశెట్టి సూర్యచంద్ర, పెద్దాపురం, పిఠాపురం జనసేన పార్టీ ఇన్‌చార్జిలు తుమ్మల బాబు, తంగెళ్ల ఉదయశ్రీనివాస్‌  హాజరయ్యారు.

గోకవరం మండల జనసేన పార్టీ కన్వినర్‌ ఉంగరాల మణిరత్నంపై ఇటీవల టీడీపీ నేత గణేష్‌ దాడి చేసిన అంశాన్ని సమావేశం ప్రారంభంలోనే సూర్యచంద్ర ప్రస్తా­వించారు. నెహ్రూ ప్రసంగిస్తుండగానే.. దాడి వ్యవహారాన్ని తేల్చాలంటూ పట్టుబట్టారు. జ్యోతుల నవీన్‌ కలుగజేసుకోవడంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. సూర్యచంద్రను నవీన్‌ గెంటివేయడంతో ఒక్కసారిగా ఇరు పార్టీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. జనసేన టికెట్టు సూర్యచంద్రకు ఇస్తే మద్దతిచ్చేది లేదంటూ జ్యోతుల నెహ్రూ ప్రతిజ్ఞ చేశారు. దీంతో సూర్యచంద్ర, ఆ పార్టీ నాయకులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.   

మాకన్నా తక్కువ స్థాయి నేతకు మైక్‌ ఎలా ఇస్తారు?  
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో జరిగిన టీడీపీ–జనసేన ఆత్మియ సమావేశంలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు దొమ్మలపాటి రమేష్, షాజహాన్‌బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు హాజరయ్యారు. జనసేన నుంచి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్‌ మహేష్, రాయలసీమ కోకన్వినర్‌ గంగారపు రాందాస్‌చౌదరి, చేనేత విభాగం అధ్యక్షుడు అడపా సురేంద్ర పాల్గొన్నారు. మొదట రాందాస్‌చౌదరి, తర్వాత రమేష్‌ ప్రసంగించారు.

తర్వాత జనసేన తరఫున శివరాం, సురేంద్రకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీనిని మైఫోర్స్‌ మహేష్‌ తమ్ముడు, అతడి అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ నాయకుడికి కాకుండా తమకంటే తక్కువ స్థాయి నాయకుడికి మైక్‌ ఎలా ఇస్తారంటూ రాందాస్‌చౌదరిపై తిరుగుబాటు చేయడమేగాక.. గొడవకు ది­గారు. కాగా, జనసేన మదనపల్లె అభ్యరి్థగా ప్రచారం చేసుకుంటున్న రామాంజనేయులు, దారం అనిత వర్గం సమావేశానికి డుమ్మా కొట్టారు.   

కుర్చిలతో కుమ్ములాట   
కృష్ణా జిల్లా పెడనలో సమావేశం జరుగుతుందని టీడీపీ, జనసేన పార్టీలోని కొందరికి సమాచారం వెళ్లింది. మరికొంతమంది ముఖ్య నేతలకు సమాచారం చేరకపోవడంతో.. తమ నాయకుడికి ఎందుకు సమాచారం ఇవ్వలేదని నిలదీసేందుకు టీడీపీలోని మాజీ డిప్యూటీ స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్‌ వర్గానికి చెందిన కొందరు ఫంక్షన్‌ హాలుకు చేరుకున్నారు. జనసేన పెడన నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఇటీవల ఉరివి సర్పంచ్‌ సురేష్‌ను నియమించడం తెలిసిందే.

 నియోజకవర్గంలో పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిర్వహించిన రామ్‌సుదీర్‌ను కాదని వేరే వారికి పదవి ఇవ్వడంపై రామ్‌సు«దీర్‌ వర్గీయులు ఆగ్రహంగా ఉన్నారు. టీడీపీ నేతలు జనసేన ఇన్‌చార్జి సురేష్­ వేదికపైకి ఆహ్వనించి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు యత్నించారు. దీంతో రామ్‌సుదీర్‌ వర్గీయులు గొడవకు దిగారు. ఆ సమయంలోనే జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ సభావేదిక వద్దకు చేరుకున్నారు.

సురేష్ను ఏ విధంగా పెడనకు ఇన్‌చార్జిగా నియమించారంటూ రామ్‌సు«దీర్‌ వర్గీయులు నిలదీశారు. అక్కడే ఉన్న జనసేనలోని మరో వర్గం వారు కూడా రామ్‌సుదీర్‌ వర్గంతో గొడవకు దిగడంతో రసాభాసగా మారింది. ఒక వర్గంపై మరో వర్గం వారు కుర్చిలు విసురుకున్నారు.  జనసేన వాళ్లు కుమ్ములాడుకుంటున్న సమయంలో టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు సభా వేదిక వద్దకు వచ్చారు. పరిస్థితి చేయి దాటిపోతోందని గమనించి  బయటకు వెళ్లిపోయారు.  

జనసేన రాష్ట్ర నేత పిలిచినా.. డోంట్‌ కేర్‌! 
విశాఖ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన పార్టీల ఆత్మియ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ వచ్చారు. ఆయన రాగానే జనసేన నాయకులు లేచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ పక్కన కుర్చీ వేశారు. అయితే మూర్తియాదవ్‌ అక్కడ కాకుండా లైన్‌ చివరిలో కూర్చున్నా­డు. సత్యనారాయణ పలుమార్లు పిలిచినా కనీసం ఆయన వైపు కూడా మూర్తియాదవ్‌ చూడ­లేదు. టీడీపీ నాయకులు సైతం పిలిచినా ఆయన స్పందించలేదు.   

జనసేన నేతలకు అధిష్టానం షోకాజ్‌..  
సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని అడిగిన అనకాపల్లి నియోజకవర్గంలోని జనసేన నేతలకు పార్టీ అధిష్టానం షోకాజ్‌ నోటీసులిచ్చింది. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న తమకు షోకాజ్‌ నోటీసులిచ్చి అవమానించడం అన్యాయమని దూలం గోపీనాథ్, మళ్ల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top