మళ్లీ వస్తాను.. అన్ని చక్కదిద్దుతాను: శశికళ

Tamil Nadu Shashikala Said Come Back To Politics - Sakshi

సమన్వయ కమిటీ నిర్ణయంపై చిన్నమ్మ ఆగ్రహం 

మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని స్పష్టీకరణ 

గ్రామాల్లో పర్యటనకు ప్రణాళిక 

సాక్షి, చెన్నై: తనతో మాట్లాడిన వాళ్లను అన్నాడీఎంకే నుంచి తొలగిస్తూ సమన్వయ కమిటీ చేసిన ప్రకటనపై చిన్నమ్మ శశికళ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని, అన్నింటినీ చక్కదిద్దుతానని మంగళవారం ఆమె స్పష్టం చేశారు. కరోనా పరిస్థితులు సద్దుమనిగినానంతరం దూకుడు పెంచబోతున్నారు. ఇందులో భాగంగా అన్నాడీఎంకేలో దివంగత సీఎంలు ఎంజీఆర్, జయలలిత హయాంలో పార్టీ కోసం శ్రమించిన సీనియర్‌ నేతలతో ఫోన్‌లో సంప్రదించారు. కార్యకర్తలతోనూ మాట్లాడుతూ భరోసా ఇస్తున్నారు. తాను రావడం ఖాయమని, అన్నాడీఎంకేను కైవసం చేసుకుందామని ధైర్యం చెబుతున్నారు. శశికళ వ్యూహాలకు చెక్‌పెట్టేందుకు ఆమెతో ఫోన్‌లో మాట్లాడిన నేతలను అన్నాడీఎంకే సమన్వయ కమిటీ పార్టీ నుంచి తొలగించింది.

గ్రామ పర్యటన 
మంగళవారం మదురై, తేని జిల్లాల్లోనే అన్నాడీఎంకే నేతలు, పార్టీ అనుబంధ ఎంజీఆర్‌ యూత్‌ విభాగం నేతలు పలువురితో చిన్నమ్మ ఫోన్‌లో మాట్లాడారు. పార్టీని రక్షించుకోవాల్సిన అవశ్యం ఏర్పడిందన్నారు. తనను అడ్డుకోవడం ఎవరి తరం కాదని పేర్కొన్నారు. జయలలిత ఆశయాల దిశగా తన ప్రయాణం ఉంటుందన్నారు. కార్యకర్తలు తన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. 

కార్యకర్తల అభీష్టం మేరకు గ్రామాల్లో పర్యటించేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలిపారు. కాగా అన్నాడీఎంకే నుంచి ఉద్వాసనకు గురైన అధికార ప్రతినిధి పుహలేంది మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభావం చూపించలేని బీజేపీ, పీఎంకే వంటి చిన్న పార్టీలకు అన్నాడీఎంకేను తాకట్టు పెట్టారని విమర్శించారు. త్వరలో పళనిస్వామి జైలుకు వెళ్లబోతున్నారని, ఈ మేరకు తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టబోతున్నట్టు పేర్కొనడం చర్చకు దారి తీసింది.    

చదవండి: Tamilnadu: శశికళ ఫోన్‌కాల్‌ ఆడియో కలకలం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top