Tamilnadu: ‘అన్నాడీఎంకే’ నా ఊపిరి: శశికళ

Sasikala Phone Call Audio Viral In Tamil Nadu - Sakshi

వేరు చేయడం ఎవరి తరం కాదు 

చిన్నమ్మ 23వ ఫోన్‌కాల్‌ ఆడియో కలకలం

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే తన ఊపిరి అని, దానిని వేరు చేయడం ఎవరితరం కాదు అంటూ.. దివంగత సీఎం అమ్మ జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ అంశానికి సంబంధించిన ఫోన్‌కాల్‌ ఆడియో గురువారం వైరల్‌గా మారింది.  అస్త్రసన్యాసం ప్రకటనను వెనక్కి తీసుకుని మళ్లీ రాజకీయ ప్రవేశానికి చిన్నమ్మ శశికళ సన్నద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తన మద్దతు దారులతో ఆమె ఫోన్‌ ద్వారా మాటలు కలిపే పనిలో పడ్డారు.

బుధవారం అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆనందన్‌తో ఫోన్లో మాట్లాడిన శశికళ, గురువారం శివగంగై జిల్లా కారైక్కుకుడి అన్నాడీఎంకే నేత ప్రభాకరన్‌తో ఐదు నిమిషాలకు పైగా మాటలు కలిపారు. ఈసందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకేలో చర్చకు దారి తీశాయి. ఇప్పటి వరకు ఆమె 22 మంది నేతలతో మాట్లాడి ఉన్నట్టు సమాచారం ఉంది. ఈ సమయాల్లో ఎక్కడా ఆమె అన్నాడీఎంకే పేరును ఉచ్చరించలేదు. పార్టీని రక్షించుకోవాలని, నేను వస్తున్నాను.. అని మాత్రమే స్పందించారు. అయితే, తాజాగా, అన్నాడీఎంకే తన ఊపిరని, దానిని ఎవరూ వేరు చే యలేరని వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.

ఎంతో కష్ట పడ్డాను.. 
దివంగత నేత ఎంజీఆర్‌ తదుపరి అన్నాడీఎంకే బలోపేతం కోసం అమ్మ జయలలితో కలిసి తాను ఎంతో కష్టపడ్డానని, ఇది ఎవరికీ తెలియని విషయంగా చిన్నమ్మ ఆ ఫోన్‌కాల్‌లో పేర్కొన్నారు. అమ్మకు వచ్చే లేఖల్ని చదివి వినిపించడం, వాటికి సమాధానాలు పంపించడం తానే చేయడం జరిగేదని పేర్కొంటూ, ఇప్పుడు కార్యకర్తల నుంచి తనకు వస్తున్న లేఖలు చదివి, చూస్తూ కూర్చునే పరిస్థితి లేదన్నారు. ఆరోజు కూవత్తూరులోనూ తాను చెప్పిన విషయాలు అందరికీ గుర్తుంటాయని, అందరం ఏకం అవుదామంటూ చిన్నమ్మ ముగించారు.

14వ తేదీ భేటీలో ఎమ్మెల్యేలకే అనుమతి.. 
చిన్నమ్మ ఫోన్‌ కాల్‌ వ్యవహారాలు ఓ వైపు ఉన్నా, మరోవైపు పార్టీ తమ గుప్పెట్లో నుంచి జారకుండా అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కుస్తీలు పట్టే పనిలోపడింది. ఈనెల 14న పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి అనుమతి దక్కడంతో గురువారం పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్‌ పన్నీరు సెల్వం, కో కన్వీనర్‌ పళనిస్వామి సంయుక్త ప్రకటన చేశారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే అనుమతి ఉందని, ఇతరులు ఎవ్వరూ రాకూడదని, కరోనా నిబంధనల్ని తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. ఈ సమావేశంలో శాసనసభాపక్ష ఉపనేత, విప్‌ను ఎంపిక చేయనున్నారు.

చదవండి: దేశంలో, పార్టీలో మోదీనే టాప్‌: సంజయ్‌ రౌత్‌   
యూపీ కేబినెట్‌ ప్రక్షాళన!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top