Uttar Pradesh: యూపీ కేబినెట్‌ ప్రక్షాళన!

Adityanath Delhi visit sparks speculation of UP Cabinet expansion - Sakshi

ఢిల్లీలో అమిత్‌ షాతో సీఎం యోగి మంతనాలు

నేడు ఉదయం ప్రధాని మోదీ, జేపీ నడ్డాలతో భేటీ

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలపై కీలక చర్చలు

కరోనా, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై సమీక్ష

సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ పదవుల్లో మార్పుతో పాటు, మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు చెలరేగుతున్న సమయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం  ఢిల్లీ చేరుకున్నారు. యోగిపై యూపీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి, బ్రాహ్మణులు బీజేపీపై గుర్రుగా ఉన్నారని, పార్టీకి దూరమయ్యే ప్రమాదముందనే సంకేతాల నేపథ్యంలో యోగి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.  

అందరినీ కలుపుకొని వెళ్లండి
లక్నో నుంచి ఢిల్లీకి వచ్చిన వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో సుమారు గంటన్నర పాటు భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ పదవుల్లో మార్పులు చేర్పులతో పాటు, మంత్రివర్గ విస్తరణ, పంచాయతీ ఎన్నికల ఫలితాల పరిణామాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇటీవల లక్నో పర్యటన చేసిన ఆర్గనైజేషన్‌ జనరల్‌ సెక్రటరీ బీఎల్‌ సంతోష్, ఇన్‌చార్జి రాధామోహన్‌ సింగ్‌ ఫీడ్‌ బ్యాక్‌ ఆధా రంగా పార్టీలో అందరితో కలుపుకుపోవాలని సీఎం యోగికి అమిత్‌ షా సూచించారు. అదే స మయంలో పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వా లని , రాష్ట్రంలో కుల సమీకరణాలను సరిదిద్దేందుకు క్షేత్రస్థాయిలో బలం ఉన్న పాత మిత్రులను ఏకం చేయాలని అమిత్‌ షా పేర్కొన్నారు.  

ప్రధానితో జేపీ నడ్డా భేటీ
గురువారం సాయంత్రం బీజేపీ అధ్యక్షుడు నడ్డా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. కొద్ది రోజుల క్రితం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్‌) బిఎల్‌ సంతోష్, రాష్ట్ర ఇన్‌ఛార్జి రాధా మోహన్‌ సింగ్‌ల రాష్ట్ర పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పార్టీ పనితీరు, ప్రభుత్వ పనితీరుపై ఎమ్మెల్యేలు, నాయకులతో చర్చించి ఒక నివేదికను సిద్ధం చేశారు.ఈ నివేదిక పూర్తి సారాంశాన్ని ప్రధాని మోదీకి నడ్డా, బీఎల్‌ సంతోష్‌ వివరించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే కూడా యూపీలోని క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసి... బీజేపీ అగ్రనేతలకు నివేదించారు. యోగీ నేతృత్వంలోనే 2022 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాలని ఆర్‌ఎస్‌ఎస్‌– బీజేపీ నిర్ణయానికి వచ్చినా... పార్టీలో, ప్రభుత్వంలో ప్రక్షాళన అవసరమని భావిస్తున్నాయి.

ఎమ్మెల్సీ ఏకే శర్మకు కేబినెట్‌లో చోటు!
మాజీ ఐఏఎస్‌ అధికారి, ప్రధానికి సన్నిహితుడిగా పేరుపడ్డ ఏకే శర్మను ఉప ముఖ్యమంత్రిగా కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలున్నట్లు కొద్దిరోజులుగా వినపడుతోంది. గుజరాత్‌ కేడర్‌కు చెందిన  శర్మ 20 ఏళ్లపాటు మోదీతో కలిసి పనిచేశారు. యూపీకి చెందిన వారు. ఈ ఏడాది జనవరిలో వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకోగానే శర్మను ఎమ్మెల్సీ చేశారు. యూపీలో కేబినెట్‌లో ఏడు ఖాళీలు ఉన్నా... శర్మ మరో అధికార కేంద్రంగా మారతారనే భయంతో యోగి మంత్రివర్గ విస్తరణ/ పునర్వవస్థీకరణను వాయిదా వేస్తున్నారు. ఇదే విషయంలో ప్రధానితో ఆయనకు విభేదాలు పొడసూపాయనే ప్రచారం జరిగింది. శర్మ  ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. పార్టీ అగ్రనేతలను కలుస్తున్నారు. ఏకే శర్మతో పాటు బుధవారమే కాంగ్రెస్‌ను వీడి బీజేపీ చేరిన జితిన్‌ ప్రసాదకు కూడా కేబినెట్‌లో చోటు దక్కుతుందని భావిస్తున్నారు. అప్నాదల్‌ (ఎస్‌) నాయకురాలు అనుప్రియా పటేల్‌ కూడా గురువారం అమిత్‌ షాతో భేటీ కావడంతో మిత్రపక్షాల మద్దతును కూడగట్టే ప్రయత్నాలను బీజేపీ చేస్తోందనేది స్పష్టమవుతోంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top