బీజేపీ హైకమాండ్: ఫ్లెక్సీల్లో ఫొటోలు కాదు.. ఇంటింటికీ వెళ్లాలి!

కమలం గుర్తును ప్రచారం చేయాలి
బీజేపీ నేతలకు రాష్ట్ర సంస్థాగత ఇన్‌చార్జి సునీల్ బన్సల్ దిశానిర్దేశం..
పార్టీ ఎవరికి దండ వేస్తే వారే నాయకులు
సీనియర్లు రాకపోతే మండలాధ్యక్షులే కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశం
పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడమే లక్ష్యమని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ‘‘గోడల మీద నేతల పేర్లు, ఫ్లెక్సీల్లో ఫొటోలు కాదు.. కమలం గుర్తును ఇంటింటికీ తీసుకెళ్లాలి. బీజేపీ ఎన్నికల గుర్తును ప్రజల్లో ప్రచారం చేయాలి. సొంతంగా దండలు, పార్టీ కండువాలు వేసుకుని వచ్చేవారు నాయకులు కాదు. పార్టీ ఎవరికి దండ వేస్తుందో వారే లీడర్లు..’’ అని బీజేపీ నేతలకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సంస్థాగత ఇన్‌చార్జి సునీల్ బన్సల్ స్పష్టం చేశారు.
ఎవరో పెద్ద నాయకుడో, ఎంపీనో, ఎమ్మెల్యేనో వస్తారని వేచి చూడకుండా.. షెడ్యూల్ ప్రకారం మండల అధ్యక్షులే పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ముందుకు వెళ్లాలని సూచించారు. అసెంబ్లీ కేంద్రంగా కాకుండా మండలాలు కేంద్రంగా పార్టీ కార్యక్రమాలను ఉధృతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ‘ప్రజా గోస–బీజేపీ భరోసా’ బైక్‌ర్యాలీలు సాగిన తీరుతోపాటు మేడ్చల్ జిల్లాలో మల్కాజిగిరి లోక్‌సభ స్థానంపై సునీల్ బన్సల్ బుధవారం సమీక్షించారు. దీనితోపాటు రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లకు నియమితులైన పార్లమెంట్ కన్వీనర్, ప్రభారీ, విస్తారక్‌లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ నెల 29న ప్రధాని మన్‌కీబాత్ కార్యక్రమాన్ని మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలోని సగం పోలింగ్ బూత్‌లలో నిర్వహించాలన్నారు.
31లోగా బూత్ కమిటీల నియామకం..
‘ప్రజా గోస– బీజేపీ భరోసా’ కార్యక్రమానికి పెద్ద లీడర్లు సరిగా రావడం లేదని, కేటాయించిన నియోజకవర్గాల్లో పూర్తి సమయం ఉండటం లేదని కొందరు తన దృష్టికి తీసుకురావడాన్ని సునీల్ బన్సల్ ప్రస్తావించినట్టు తెలిసింది. ‘‘ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడమే లక్ష్యం. ఎవరైనా సీనియర్ నాయకుడు రాకపోతే పార్టీ మండలాధ్యక్షుడే లీడర్. ఆ రోజు మండలంలో జరగాల్సిన కార్యక్రమాన్ని యధాతథంగా పూర్తిచేయాలి. నిర్దేశిత కార్యక్రమం మేరకు అన్ని మండలాల్లో బైక్ ర్యాలీలు పూర్తి చేయాలి. కార్యకర్తలు స్వచ్ఛందంగా బైక్ పెట్రోల్, ఇతర ఖర్చులు పెట్టుకుని కార్యక్రమం చేపట్టేలా చూడాలి. పార్టీ నాయకత్వం నిర్ణయించిన కార్యక్రమానికి ఎవరూ అడ్డుచెప్పే ప్రశ్నే ఉత్పన్నం కాదు..’’ అని స్పష్టం చేసినట్టు సమాచారం.
అంతేగాకుండా లోక్‌సభ నియోజకవర్గాల్లోనో, ఏదైనా నిర్ణయించిన కార్యక్రమంలోనో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరూ హాజరుకాకపోయినా సరే.. ఈనెల 31లోపు అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ కమిటీల నియామకం పూర్తి చేయాలని సూచించినట్టు తెలిసింది. లోక్‌సభ విస్తారక్‌లు, ఇతర నేతల సమావేశంలో నేతలు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి, చింతల రామచంద్రారెడ్డి, ఎనీ్వఎస్‌ఎస్ ›ప్రభాకర్, యెండల లక్ష్మీనారాయణ, కాసం వెంకటేశ్వర్లుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు :