ఢిల్లీలోనే తేల్చుకుందాం | Sakshi
Sakshi News home page

ఢిల్లీలోనే తేల్చుకుందాం

Published Mon, Sep 25 2023 3:41 AM

State Congress BC leaders meeting decision on allotment of tickets - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బలహీన వర్గాల నేతలకు తగినన్ని టికెట్లు కేటాయించాల్సిందేనని, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 34 స్థానాలు ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్‌ బీసీ నేతల సమావేశం డిమాండ్‌ చేసింది. ఈ విషయంలో ఎందాకైనా కొట్లాడాలని, ఢిల్లీ వెళ్లి సోనియాగాం«దీ, రాహుల్, మల్లికార్జున ఖర్గే సమక్షంలోనే తేల్చుకోవాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సందర్భంగా కూడా రాహుల్‌ ఓబీసీల పక్షాన మాట్లాడారని, తెలంగాణ కాంగ్రెస్‌లో మాత్రం సర్వేల పేరుతో బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ సమావేశం అభిప్రాయపడింది.

ఏఐసీసీ ఓబీసీ సెల్‌ కోఆర్డినేటర్‌ కత్తి వెంకటస్వామి అధ్యక్షతన ఆదివారం గాం«దీభవన్‌లో బీసీ నేతల సమావేశం జరిగింది. ఈ భేటీలో సీనియర్‌ నాయకులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కీగౌడ్, సురేశ్‌ షెట్కార్, మహేశ్‌కుమార్‌గౌడ్, పొన్నం ప్రభాకర్, చెరుకు సుధాకర్, గాలి అనిల్‌కుమార్, సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, మెట్టు సాయికుమార్, ముత్తినేని వీరయ్య వర్మలతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నేతలకు టికెట్ల కేటాయింపే ఎజెండాగా చర్చించారు. 

సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలివీ.. 
 పార్టీ అధిష్టానాన్ని కలిసేందుకు సోమ లేదా మంగళవారాల్లో ఢిల్లీ వెళ్లాలి. అక్కడ సోనియా, రాహుల్, ఖర్గేను కలిసి తమ డిమాండ్లను వారి ముందుంచాలి.  
  అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు కచ్చితంగా 34 సీట్లు కేటాయించాలని కోరుతూ అందరి సంతకాలతో అధిష్టానానికి లేఖ రాయాలి. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతకు కూడా ఈ లేఖను అందజేయాలి.  
 టికెట్ల కేటాయింపులో అన్ని కులాలకు ప్రాధాన్యమివ్వాలి. అభ్యర్థుల ప్రకటన కోసం విడుదల చేసే తొలిజాబితాలో బీసీ నేతల పేర్లు రాకుండా కుట్ర జరుగుతోంది. తొలి జాబితాలోనే బీసీ నేతల పేర్లను కూడా ప్రకటించాలి.  
  బీసీలకు ఇచ్చే స్థానాలను ముందుగా గుర్తించి అక్కడ బీసీ నేతల పేర్లతోనే సర్వేలు జరపాలి.  
  బీసీ నేతల్లో ఎవరికి టికెట్‌ వచ్చినా అందరం కలిసి గెలిపించుకోవాలి. 
 పార్టీ పదవులు, నామినేటెడ్‌ పదవుల్లో బీసీల వాటాను అమలు చేయాలి.  

పెరిక, పద్మశాలీలకు అన్యాయం 
బీసీ కులాల్లో పెద్ద సంఖ్యలో జనాభా ఉండే పద్మశాలీలతోపాటు పెరిక వర్గానికి చెందిన నాయకులకు పార్టీలో అన్యాయం జరుగుతోందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. పద్మశాలీల పక్షాన మునుగోడు నుంచి పున్నా కైలాశ్‌ నేత, ముషీరాబాద్‌ నుంచి సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, బాల్కొండ నుంచి ఈరవత్రి అనిల్‌ లాంటి నాయకులు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో వారికి అవకాశం ఇవ్వాలనే చర్చ జరిగింది.

నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి లాంటి లోక్‌సభ స్థానాల్లో రెండు స్థానాలను బీసీలకిచ్చే పరిస్థితి లేదని అంటున్నారని, సికింద్రాబాద్, భువనగిరి, నిజామాబాద్‌ లాంటి లోక్‌సభ స్థానాల పరిధిలో అవసరమైతే మూడు సీట్లు బీసీలకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి కామారెడ్డి ఎమ్మెల్యేగా పెరిక కులానికి చెందిన ఎమ్మెల్యే ఉన్నాడని, ఆయన సీటును కూడా కేసీఆర్‌ గుంజుకున్న నేపథ్యంలో తమ కులానికి కాంగ్రెస్‌లో అయినా న్యాయం చేయాలని వికలాంగ విభాగం చైర్మన్‌ ముత్తినేని వీరయ్య వర్మ కోరారు.

Advertisement
Advertisement