రాష్ట్రాన్ని అథోగతి పాల్జేసిన చంద్రబాబు

Somu Veerraju Fires On Chandrababu Naidu - Sakshi

అమరావతికి ఇచ్చిన రూ.7 వేల కోట్లకు లెక్కలు చెప్పలేదేం

సబ్‌ స్టేషన్లలో షిఫ్ట్‌ ఆపరేటర్ల ఉద్యోగాలు టీడీపీ అమ్ముకుంది

బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు  

సాక్షి, విశాఖపట్నం: గత ఐదేళ్ల పాలనలో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అథోగతి పాల్జేందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.7 వేల కోట్లకు లెక్కలు చెప్పకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను కేంద్రంపైకి ఎగదోస్తున్నాడని మండిపడ్డారు. ఆ నిధులు ఏం చేశారో ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి అడగాలన్నారు. శుక్రవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..

► 2014 తర్వాత రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌ ఇచ్చింది కేంద్రంలో ఉన్న బీజేపీనే. రాష్ట్రంలో సబ్‌స్టేషన్లను నిర్మిస్తే.. అందులో షిఫ్ట్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలను టీడీపీ ప్రభుత్వం అమ్ముకుంది.
► దత్తాత్రేయ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కార్మికులకు ఈఎస్‌ఐ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి, మెడికల్‌ కళాశాలకు విశాఖలో భూకేటాయింపులు చేయాలని రాష్ట్రాన్ని కోరితే.. చంద్రబాబు కేటాయించలేదు.
► దీనిని బట్టే విశాఖపై ఆయనకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. కార్మిక ఆస్పత్రిని విశాఖలోనే ఏర్పాటు చేయాలి.
► గ్రామాలను డిజిటలైజేషన్‌ చేసేందుకు కేంద్రం రూ.5 వేల కోట్లు ఇచ్చింది. వాటిని ఏంచేశారో కూడా తెలియడం లేదు.
► ఏపీలో రానున్న రోజుల్లో బీజేపీ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా  వ్యవహరిస్తుంది.
► ప్రస్తుత ప్రభుత్వాన్ని ఇసుక, టీటీడీ భూముల విషయంలో ప్రశ్నించాం. ‘ప్రసాదం పథకం’ కింద గతంలో శ్రీశైలం దేవస్థానానికి కేంద్రం నిధులిచ్చింది. ప్రస్తుతం సింహాచలం దేవస్థానానికి రూ.50 కోట్లు కేంద్రం ఇచ్చింది. త్వరలో అన్నవరం దేవస్థానాన్ని కూడా ప్రసాదం పథకంలోకి చేరుస్తాం. ఉపాధి లేక మత్స్యకారులు వలసలకు పోయి పాకిస్థాన్‌లో అరెస్టయ్యే దుస్థితి ఉండకూడదు.
► ఏపీలో 970 కిలోమీటర్ల తీరం ఉంది. ట్యూనా చేపల వేటకు ఆస్కారం ఉంది. ప్రభుత్వం ఆ దిశగా దృçష్టి సారించాలి. సమావేశంలో ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎంపీ హరిబాబు, బీజేపీ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top