బరిగీసి.. బర్రెలక్క | Sakshi
Sakshi News home page

బరిగీసి.. బర్రెలక్క

Published Thu, Nov 23 2023 4:52 AM

Sirisha competed in Kolhapur inspiring the youth - Sakshi

రాష్ట్రంలోని నిరుద్యోగుల తరపున అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు శిరీష. సోషల్‌మీడియాలో ‘బర్రెలక్క’గా ప్రాచుర్యం పొందిన 26 ఏళ్ల యువతి కర్నె శిరీష.  నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీలో నిలవడంతో ఆమెకు వివిధ వర్గాల నుంచి విశేష మద్దతు లభిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే యానాం మాజీ మంత్రి, ఢిల్లీ ప్రత్యేక అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఆమె ప్రచార ఖర్చుల కోసం రూ. లక్ష ఆర్థిక సాయం అందజేశారు. ఇతర ప్రాంతాల నుంచి నిరుద్యోగులు వచ్చి కొల్లాపూర్‌లో ఆమెకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 

మద్దతుగా హోరెత్తిన ప్రచారం..    
కొల్లాపూర్‌ నుంచి నామినేషన్‌ వేసిన శిరీష తాను నిరుద్యోగుల తరపున పోరాటం చేసేందుకే అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచినట్టు ప్రకటించారు. దీంతో క్రమంగా ఆమెకు సోషల్‌మీడియాతో పాటు రాష్ట్రంలోని యువత, నిరుద్యోగుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి నిరుద్యోగులు స్వచ్ఛందంగా ప్రచారం నిర్వహించేందుకు కొల్లాపూర్‌కు తరలివస్తున్నారు.

ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్న ఆమె తమ్ముడు చింటూపై  కొందరు యువకులు ఇటీవల దాడికి పాల్పడటంపై నిరుద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఈ ఘటనపై ఖండించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ శిరీషకు మద్దతు ఇచ్చారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న శిరీషకు రక్షణ కల్పించాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఎక్స్‌ (ట్విట్టర్‌) లో పోస్ట్‌ చేశారు. 

బర్రెలక్క పేరుతోనే ట్రెండింగ్‌..   
‘హాయ్‌ ఫ్రెండ్స్‌.. డిగ్రీలు ఎన్ని వచ్చినా నోటిఫికేషన్లు, ఉద్యోగాలు రావడం లేదు. అందుకే మా అమ్మకు చెబితే నాలుగు బర్లను కొనిచ్చింది. బర్లను కాయడానికి వచ్చిన ఫ్రెండ్స్‌’ అంటూ ఏడాదిన్నర కిందట శిరీష చేసిన వీడియో సోషల్‌ మీడియాలో సంచలనమైంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్‌ గ్రామానికి చెందిన కర్నె శిరీష   బీకాం వరకు చదువుకుంది.

తల్లి అనూరాధ ఓ చిన్న టిఫిన్‌ సెంటర్‌ నడుపుతూ శిరీషతో పాటు ఇద్దరు కుమారులను చదివించింది. చిన్న రేకులòÙడ్డులో జీవనం సాగిస్తున్న ఆ కుటుంబానికి తల్లితో పాటు తానూ పెద్దదిక్కులా నిలవాలని భావించింది. ఆ మేరకు పోలీస్‌ కానిస్టేబుల్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమైంది. అయితే నోటిఫికేషన్లు రాలేదంటూ అప్పట్లో ఈమె చేసిన వీడియోపై పోలీసులు 2022లో పెద్దకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ 505(2) సెక్షన్‌ కింద కేసు కూడా నమోదు చేశారు. 

నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నా
‘రాష్ట్రంలో నోటిఫికేషన్లు రాక, నియామకాల ప్రక్రియ సక్రమంగా లేక ఉద్యోగాలు పొందలేని నిరుద్యోగుల తరపున అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నాతో కలసి ప్రచారంలో ఉన్న మా తమ్మునిపై దాడిచేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నిరుద్యోగుల తరపున పోరాటాన్ని కొనసాగిస్తాను. యువత రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నా. నిరుపేద కుటుంబానికి చెందిన విద్యావంతురాలుగా నాకు అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఙప్తి చేస్తున్నా.’

-పాదం వెంకటేష్‌ 

Advertisement
 
Advertisement