కాంగ్రెస్‌లో సంస్కరణలు తేవాల్సిందే.. సోనియాతో శశిథరూర్‌ కీలక భేటీ.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ!

Shashi Tharoor Meets Sonia Gandhi After Sharing Congress Reforms - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: అక్టోబర్‌లో జరిగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని భావిస్తున్న ఆ పార్టీ ఎంపీ శశిథరూర్‌.. సోనియా గాంధీతో సోమవారం సమావేశమయ్యారు. పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని కొందరు యువ కార్యకర్తలు రూపొందించిన ఆన్‌లైన్‌ పిటిషన్‌కు ఆయన అంగీకారం తెలిపిన అనంతరం ఈ భేటీ జరగడం గమనార్హం. అయితే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని శశి థరూర్ సోనియా గాంధీకి ఈ భేటీలో చెప్పారని, అందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. దీంతో ఆయన అక్టోబర్ 17న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది.

కొద్దినెలల క్రితం ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్‌ చేసిన తీర్మానాలకు అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాలని పార్టీకి చెందిన కొందరు యువ నాయకులు ట్విట్టర్‌లో ఓ పిటిషన్‌ను రూపొందించారు. దీనికి మద్దతుగా 650మంది పార్టీ నాయకులు సంతకాలు చేశారు. దీన్నే ట్విట్టర్‌లో షేర్ చేసి తాను స్వాగతిస్తున్నట్లు శశిథరూర్ తెలిపారు. దీనిపై ప్రచారం చేస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.

తీర్మానాలివే..
కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడమే గాక కుటుంబం నుంచి ఒక్కరికి ఒకే పదవి ఇవ్వాలనే తీర్మానాలను ఉదయ్‌పూర్ సమావేశాల్లో కాంగ్రెస్ ఆమోదించింది. అయితే ఐదేళ్లకుపైగా పార్టీలో పనిచేసే కుటుంబాలకు దీని నుంచి మినాహాయింపు ఇచ్చింది.

ఇందులో భాగంగానే అక్టోబర్‌ 17న అధ్యక్ష పదవికి  ఎన్నికలు నిర్వహించేందుకు  కాంగ్రెస్ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. వాస్తవానికి ఈ ఎన్నికలు సెప్టెంబర్‌లోనే జరగాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల అక్టోబర్‌కు వాయిదావేశారు. అయితే ఎన్నికలు జరుగుతాయని అందరూ భావిస్తుండగా.. కొన్ని రాష్ట్రాల అధ్యక్షులు రాహుల్ గాంధీకి అనుకూలంగా తీర్మానాలు చేస్తున్నారు. అధ్యక్షుడి ఎంపికను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకే వదిలేయాలని మూడు రాష్ట్రాల పీసీసీలు ఇప్పటికే తీర్మానాలకు ఆమోదం తెలిపాయి. 

దీంతో ఎన్నికలు లేకుండా మళ్లీ గాంధీ కుటుంబసభ్యులకే పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని చూస్తున్నారనే ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌లో నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకురావాలనే పిటిషన్‌కు శశిథరూర్ బహిరంగంగా మద్దతు తెలిపారు. పార్టీలో సంస్కరణల కోసం డిమాండ్ చేసిన జీ-23 నేతల్లో ఈయన కూడా ఒకరు. ఈ విషయంపై 2020లోనే సోనియా గాంధీకి లేఖ రాశారు.

కచ్చితంగా పోటీ..
తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తానని థరూర్ కొద్దిరోజుల క్రితమే చెప్పారు. తాను పోటీ చేసేది లేనిది త్వరలో తెలుస్తుందన్నారు. గాంధీ కుటుంబం నుంచి కాకుండా మరో నాయకుడు కాంగ్రెస్ పగ్గాలు చేపడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్ గాంధీ సుముఖంగా లేకపోతే రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్‌ను బరిలోకి దింపాలని సోనియా భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అదే జరిగితే శశిథరూర్ తప్పకుండా అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని ఆయన సన్నిహిత వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి.
చదవండి: వీడియో లీక్ ఘటన.. పంజాబ్ సీఎం కీలక నిర్ణయం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top