కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య పరిణామం.. బరిలోకి గాంధీ కుటుంబ విధేయుడు!

Congress President Poll Mallikarjun Kharge May Join Race - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తెరపైకి కొత్తపేరు వచ్చింది. పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖేర్గే రేసులో ఉండనున్నట్లు తెలుస్తోంది. నామినేషన్లకు చివరి రోజున అనూహ్యంగా ఖ‍ర్గే బరిలోకి రావడం ఆసక్తికరంగా మారింది. హస్తం పార్టీ అధ్యక్ష పదవికోసం సీనియర్ నేతలు శశిథరూర్, దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే రాజస్థాన్‌లో ఊహించని పరిణామాల కారణంగా సీఎం అశోక్ గహ్లోత్ రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో ఆయన స్థానంలో గాంధీ కుటుంబం విధేయుల్లో ఒకరైన ఖర్గేను బరిలోకి దింపాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సోనియా గాంధీనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఆమె ఆమోదం తెలిపితే ఖర్గే వెంటనే నామినేషన్ దాఖలు చేస్తారని పేర్కొన్నాయి. ఈయన పోటీతో అధ్యక్షపదవికి త్రిముఖ పోరు ఉండనుంది.

దిగ్విజయ్ డౌట్!
మరోవైపు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న దిగ్విజయ్ సింగ్‌.. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఖర్గే నివాసానికి వెళ్లారు. పోటీలో ఉండాలంటే బుధవారం మధ్యాహ్నం 3 గంటల్లోపు వీరు నామినేషన్ వేయాల్సి ఉంటుంది. అయితే గాంధీల విధేయుడైన ఖర్గే బరిలో ఉండటంతో దిగ్వజయ్ సింగ్‌ పోటీ నుంచి తప్పుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్పాయి.

దళిత వర్గానికి చెందిన ఖర్గే.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. 8 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు లోక్‌ ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. హోంమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.

జీ-23నేతల ఆయోమయం
మరోవైపు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని జీ-23 నేతలు కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకు సీనియర్ నేతలు పృథ్విరాజ్ చవాన్, భూపిందర్ హుడా, మనీశ్‌ తివారీలు ఆనంద్ శర్మ నివాసంలో భేటీ అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే పోటీ చేయాలా? వద్దా? అనే విషయంపై వీరు సందిగ్ధంలో ఉన్నట్లు సమాచారం. అధ్యక్ష పదవి రేసులో నిలిచేందుకు ముకుల్ వాస్నిక్, కుమారి సెల్జా పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చినట్లు పార్టీ సన్నిహత వ‍ర్గాలు పేర్కొన్నాయి.
 

చాలా ఏళ్ల తర్వాత దక్షిణాది నుంచి
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నామినేషన్‌కు శుక్రవారం(సెప్టెంబర్ 30) చివరి తేది. అక్టోబర్ 17న ఎన్నికలు నిర్వహిస్తారు. 19న ఫలితాలు ప్రకటిస్తారు. ఈ సారి గాంధీ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉండటంతో 25 ఏళ్ల తర్వాత తొలిసారి గాంధీ కుటుంబానికి చెందని వారు పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి 1994లో పీవీ నరసింహారావు చివరిసారిగా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు శశిథరూర్, ఖర్గే ఎవరు గెలిచినా మరోసారి ఆ పదవి చేపట్టిన దక్షిణాది నేతగా అరుదైన ఘనత సాధిస్తారు. వీవీ నరసింహారావు తర్వాత 1996-98 వరకు సీతారాం కేసరి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత నుంచి 2017వరకు సోనియా గాంధీనే ఆ పదవిలో కొనసాగారు.
చదవండి: ‘గాంధీలు లేకుండా కాంగ్రెస్‌ పార్టీ శూన్యం’

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top