ప్రజాప్రతినిధి ఇంట్లో పెళ్లికి నేతల జేబులు ఖాళీ.. వాట్సాప్‌ చాటింగ్‌ వైరల్‌

Sarpanch MPTCs Money Collection For Marriage In leader House At Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌:  రాజువారింట్లో వివాహనికి రాజ్యమంతా కదిలి వెళ్తుంది. మరి వెళ్లే ప్రజలంతా ఖాళీ చేతులతో వెళ్తారా? ఎవరి స్థోమతకు తగినట్లుగా వారు కానుకలు తీసుకెళ్తారు. జిల్లాలో ఓ నియోజకవర్గంలో కీలక ప్రజాప్రతినిధి ఇంట్లో త్వరలో మోగనున్న పెళ్లి భాజాలు.. నేతల జేబులు ఖాళీ చేస్తున్నాయి. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా.. ఇప్పుడు రాష్ట్రమంతటా మోరుమోగిపోతోంది. నెట్టింట్లో వైరల్‌గా మారింది. అసలు విషయం ఏంటంటే.. ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో త్వరలో పెళ్లి జరగాల్సి ఉంది.

అసలే పెద్ద ప్రజాప్రతినిధి. అందులోనూ ఆయన ఇంట్లో శుభకార్యం. ఆయన అనుచరులు ఉత్తినే ఉంటారా? అంతా కలిసి భారీ బహుమతి తీసుకెళ్లి చదివించాలని నిర్ణయించారు. వెంటనే వాట్సాప్‌ గ్రూపుల్లో చాటింపు వేశారు. సర్పంచులు ఇంత, ఎంపీటీసీలు ఇంత అంటూ రేటు ఫిక్స్‌ చేశారు. వారిలో ఆ నేతకు వీరాభిమాని అయిన ఓ గ్రామస్థాయి నేత ఈ వ్యవహారాన్ని మొత్తం అన్నీ తానై చూసుకుంటున్నారు. కొందరు నగదు రూపంలో చెల్లింపులు చేస్తుండగా.. మరికొందరు తమకు తోచిన కానుకలు సమర్పించుకుంటున్నారు.

రామడుగు మండలంలోని ఒక గ్రామ మాజీ సర్పంచికి ఆ శుభకార్యానికి కావాల్సిన కోడిగుడ్లు సరఫరా చేయాలని ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది. కొడిమ్యాల మండలానికి చెందిన ఒక నాయకునికి చికెన్, చొప్పదండి కేంద్రానికి చెందిన నాయకునికి మటన్‌ పంపించాల్సి ఉంటుందని సదరు అనుచరుడు హంగామా చేస్తున్నట్లు సమాచారం.
చదవండి: మర్రి శశిధర్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. స్పందించిన మాణిక్యం ఠాగూర్‌

ఈ వ్యవహారంపై ఓ గ్రామ సర్పంచిని ‘సాక్షి’ వివరణ కోరింది. స్పందించిన సదరు సర్పంచి.. ‘మేమంతా కానుకలను ఇష్టపూర్వకంగానే ఇస్తున్నాం. ఇందులో ఎవరి బలవంతం లేదు’ అని స్పష్టం చేశాడు. ఇదే నేత సరిగ్గా ఏడాది కింద.. పోలీసు పోస్టింగు విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొనడం గమనార్హం.

ఏడాదిలో మూడోది..!
కరీంనగర్‌ జిల్లాలో నేతల ఇళ్లల్లో పెళ్లిళ్లు జరిగిన సమయంలో ఇలాంటి కానుకల కోసం చందాలు సేకరించడం ఏడాదిలో ఇది మూడో ఘటన. ఆగస్టులో ఓ పార్టీ నేత ఇంట్లో వివాహం జరిగినప్పుడు పలు మహిళా సంఘాల నుంచి రాష్ట్రవ్యాప్తంగా చందాలు సేకరించారు. అప్పట్లో ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.

ఈ ఏడాదిలో కలెక్టరేట్‌లోని ఓ ఉన్నతాధికారి ఇంట్లో పెళ్లి కోసం కూడా దాదాపు రూ.50 లక్షల వరకు వసూలు చేశారని ఉద్యోగులు గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే. జిల్లాలో ఏడాదికాలంలో పెళ్లికానుకల చందాల వసూలులో ఇది మూడోది. ఈ షాదీ ముబారక్‌ కానుకల వ్యవహారం ఇటు అధికారుల్లో, నేతల్లో ఒక సంప్రదాయంగా మారుస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  
చదవండి: కేసీఆర్‌ చేసింది పెద్ద రిస్కే.. ఇది ఆషామాషీ విషయం కాదు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top