టీడీపీ బూతు వ్యాఖ్యలపై.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu - Sakshi

సీఎంపై ఉద్దేశపూర్వకంగానే పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారు

గత కొన్ని నెలలుగా ఆయన అసభ్య పదజాలం వాడుతున్నారు

సజ్జల రామకృష్ణారెడ్డి 

సాక్షి, అమరావతి: సీఎం జగన్‌ను ఏకవచనంతో దూషిస్తూ టీడీపీ నేత పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలపై చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. పట్టాభి వ్యాఖ్యలు ప్రజలకు విస్మయం కల్గించాయన్నారు. కొన్ని నెలలుగా పట్టాభి ఉద్దేశ్యపూర్వకంగానే అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని మండిపడ్డారు. పట్టాభి మాట్లాడిన బూతులు, రెచ్చగొట్టిన తీరును ప్రజలందరూ చూశారన్నారు. సీఎం జగన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు జీర్ణించుకోలేక శాంతియుతంగా నిరసన చేస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారన్నారు. 

నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
టీడీపీ బూతు వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చిందని సజ్జల వెల్లడించారు. ఎప్పుడూ హైదరాబాద్‌లో ఉండే చంద్రబాబు, సోమవారం విజయవాడలో అకస్మాత్తుగా ఎందుకు దిగారని.. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఏ మంటలు పెట్టడానికి ఏపీలో అడుగుపెట్టారని ఆయన ప్రశ్నించారు. రెండున్నరేళ్లుగా, అందులోనూ ఏడాదిన్నర కోవిడ్‌ కాలంలో కూడా చెక్కుచెదరని నిశ్చయంతో పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మీద, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడలేక చంద్రబాబు దిగజారి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని బాబు అంటున్నారని.. కానీ, నిజానికి విఫలమైంది చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఒక్కటంటే ఒక్క పథకం ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టలేకపోయారని సజ్జల విమర్శించారు. ప్రతి ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలవుతున్నందుకు చంద్రబాబు ఇప్పటికైనా సిగ్గుపడాలన్నారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top