వివేకా హత్య కేసులో స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ చంద్రబాబుదే: సజ్జల

Sajjala Ramakrishna Reddy Comments On Cbi And Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డికి సంబంధం లేదని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అవినాష్‌రెడ్డికి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఎన్నికల ముందు వివేకా హత్య కేసు ద్వారా మా నాయకుడిని నైతికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించారన్నారు. బీటెక్‌ రవి, ఆదినారాయణరెడ్డికి సంబంధాలు ఉన్నట్లు ఆధారాలున్నాయని సజ్జల పేర్కొన్నారు.

‘‘వివేకాను కోల్పోవడం వైఎస్సార్‌సీపీకి, జగన్‌కు నష్టమే. వివేకా తిరిగి పార్టీలోకి వస్తానంటే ఆహ్వానించింది జగనే. వివేకా హత్య కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదు. కొందరిని టార్గెట్‌ చేస్తూ విచారణ చేస్తున్నారు. వివేకా బావమరిది శివప్రకాష్‌రెడ్డి ఫోన్‌ చేస్తేనే అవినాష్‌రెడ్డి వెళ్లారు. శివప్రకాష్‌రెడ్డి ఫోన్‌ చేసి వివేకా గుండెపోటుతో చనిపోయారని తనకు చెప్పినట్లు ఆదినారాయణరెడ్డే చెప్పాడు. వివేకా ఫోన్‌లోని రికార్డులను ఎందుకు డిలీట్‌ చేశారు?’’ అని సజ్జల ప్రశ్నించారు.

‘‘వివేకా హత్యకు, రెండో పెళ్లికి సంబంధం ఉందని ఆంధ్రజ్యోతిలో వేశారు. కుటుంబసభ్యులంతా కలిసి వివేకా చెక్‌ పవర్‌ తీసేశారని ఆంధ్రజ్యోతి చెప్పింది. చంద్రబాబు హయాంలోనే వివేకా హత్య జరిగింది. బీటెక్‌ రవి, ఆదినారాయణరెడ్డి, వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి ఫోన్‌ రికార్డులు ఎందుకు చూడలేదు?. శివశంకర్‌రెడ్డి మా పార్టీ నాయకుడు.. వైఎస్‌, వివేకాతో కలిసి పనిచేశారు. శివశంకర్‌రెడ్డి తప్పు చేయలేదని మేం భావిస్తున్నాం. వివేకా హత్య కేసులో స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ మొత్తం చంద్రబాబుదే. సీబీఐ వెనుక రాజకీయ ప్రమేయం కచ్చితంగా ఉంది’’ అని ఆయన అన్నారు.
చదవండి: ఏది నిజం?: పచ్చ పైత్యం ముదిరిపోయింది!

‘‘బీజేపీలో తన కోవర్టుల ద్వారా సీబీఐ విచారణను ప్రభావితం చేస్తున్నారు. చంద్రబాబు గతంలో వైఎస్‌పై ఫ్యాక్షనిస్ట్‌ ముద్ర వేసి కుట్రలు చేశారు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌పై కూడా కుట్రలు చేస్తున్నారు. చంద్రబాబు పకడ్బందీగా కథనం తయారు చేస్తారు. ఆ కథనాన్ని అనుకూల మీడియాలో ప్రచారం చేయిస్తారు. ఇదే అంశాన్ని టీడీపీ నాయకులు పదేపదే ప్రస్తావిస్తారు’’ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top