Rangareddy Politics: మంత్రి సబిత ఇంటికి వెళ్తే.. ఆ పార్టీ నాయకులకు చిక్కులే!

Rangareddy District Politics Special Ground Report - Sakshi

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మూడు ముక్కలైంది. ఇన్నాళ్లు ఉమ్మడి జిల్లాను శాసించిన నేత‌లు ఇప్పుడు త‌మ‌ నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమిత‌మవుతున్నారు. టోటల్‌గా జిల్లాను లీడ్ చేసే నేత‌లు ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు. ఒకరి ఇలాకాలో మరొకరు వేలు పెడితే... అగ్గిమీద గుగ్గిలంలా భగ్గుమంటున్నారు. ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్నట్టుగా మారిన రంగారెడ్డి జిల్లా రాజ‌కీయాల‌పై స్పెష‌ల్ రిపోర్ట్‌.

అధికార పార్టీలో ఎవరికి వారే..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై గులాబీ పార్టీ పూర్తి స్థాయి ఆధిపత్యం సాధించినా... నేతల మధ్య సమన్వయలోపం ఇబ్బందికరంగా మారింది. వికారాబాద్‌, తాండూరు, చేవెళ్ల, రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సొంత క్యాడర్ ఉంది. నేరుగా మంత్రితో మాట్లాడే చొరవ ఉన్న నేతలు ఉన్నారు.

ఇది ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు రుచించడం లేదు. నేరుగా మంత్రి దగ్గరకు వెళ్లే నేతలను ఎమ్మెల్యేలు టార్గెట్ చేస్తున్నారు. నియోజకవర్గంలో ఇబ్బందులు సృష్టిస్తున్నారని వాపోతున్నారు. మంత్రి ఇంటికి వెళ్లగానే ఎమ్మెల్యేలు కాల్ చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారని పలువురు ఎంపీపీ, జడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డిది మరో దారి. తమ కుటుంబ రాజకీయ ప్రత్యర్థి సబితా రెడ్డి జిల్లాలో మంత్రిగా ఆధిపత్యం చలాయించడం ఆమెకు ఇబ్బందిగా మారింది. ఎంపీ రంజిత్ రెడ్డి కూడా జిల్లాపై పట్టు కోసం, సొంత క్యాడర్ కోసం ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నా... ఎమ్మెల్యేలు మాత్రం అడ్దుకుంటూనే ఉన్నారు.

వికారాబాద్ జిల్లాలో జ‌డ్పీ ఛైర్‌ప‌ర్సన్ సునీతారెడ్డికి, ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య వివాదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. వీరి పంచాయ‌తీ ప్రగ‌తిభ‌వ‌న్‌కు చేరడంతో కొంత స‌ద్దుమ‌ణిగింది. మేడ్చల్ జ‌డ్పీ ఛైర్మన్ శ‌ర‌త్‌చంద్రారెడ్డికి, మంత్రి మ‌ల్లారెడ్డికి అంత‌ర్గత‌పోరు ఆగడంలేదు. మేడ్చల్ జిల్లాలో ఎమ్మెల్యేలు మైనంప‌ల్లి హ‌న్మంత్‌రావు, వివేక్, భేతి సుభాష్‌రెడ్డి ఎవ‌రికివారుగానే కొన‌సాగుతున్నారు.

కాంగ్రెస్‌కు మాజీలే మిగిలారు
ఇక కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి జిల్లాలో నిస్సత్తువగా మారిపోయింది. టీపీసీసీ ఇచ్చే ఆదేశాలు అమలు చేసేందుకు జిల్లా నేతలు సిద్ధంగా లేరా అనే అనుమానాలు కలుగుతున్నాయి. గత ఎన్నికల తరువాత జిల్లాలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొంత కాలంగా రాష్ట్ర స్థాయి నేతల నుంచి.. కింది స్థాయి వరకు నాయకులను నిస్సత్తువ ఆవహించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి  గెలుపొందిన ఎమ్మెల్యేలు ఎవరు ఇప్పుడు పార్టీలో లేరు. అందరూ మాజీలు మాత్రమే మిగిలారు. వారిలో కూడా ఏ ఒక్కరూ క్రియాశీలంగా పని చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకులను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఫేస్ వ్యాల్యూ ఉన్న నాయకులు లేకపోవడం పెద్ద లోటనే చెప్పాలి. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి వ‌దిలేసిన రాజేంద్రన‌గ‌ర్, శేరిలింగంప‌ల్లి, కూక‌ట్‌ప‌ల్లి, ఉప్పల్‌ నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ క్యాడ‌ర్ చిన్నాభిన్నామైంది. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ అసలు పార్టీలో ఉన్నారో లేరో తెలియ‌ని ప‌రిస్థితి. పార్టీకి రాజీనామా లేఖ ఇచ్చారు. కానీ ఇంకా ఆమోదించ‌లేదు.

చేవెళ్ల నుంచి పోటీ చేసిన ర‌త్నం.. మ‌ళ్లీ టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరిపోయారు. గత ఎన్నిక‌ల్లో ఉమ్మడి జిల్లాలో మూడు స్థానాల్లో విజ‌యం సాధించిన కాంగ్రెస్‌.. గెలిచినవారిని నిలుపుకోలేక‌పోయింది. ఇక మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన రేవంత్‌రెడ్డి.. పార్లమెంట్ స్థానం ప‌రిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా త‌యారు చేసుకోలేకపోయారు.

కమలనాథుల పరిస్థితి అంతంతే..
ఉమ్మడి జిల్లాలో కమలనాథుల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారైంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం నాయకులు పని చేస్తుంటే... జిల్లా నేతల మధ్య సమన్వయం లోపించిందనే వార్తలు వస్తున్నాయి. కాషాయపార్టీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై ప్రత్యేక నజర్‌ పెట్టింది. చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం ఇప్పటికే తొలిదశ సెర్చ్‌ పూర్తయింది.

వికారాబాద్‌ జిల్లాలో మాజీ మంత్రి చంద్రశేఖర్‌ పార్టీ కార్యక్రమాలు ముమ్మరం చేశారు. రాజేంద్రనగర్‌, మహేశ్వరం నియోజకవర్గాల్లో నేతల మధ్య కొత్త వివాదం తలెత్తింది. రంగారెడ్డి అర్బన్‌ జిల్లా అధ్యక్షులుగా ఎల్బీ నగర్‌కు చెందిన సామ రంగారెడ్డి, రూరల్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బొక్క నర్సింహారెడ్డి మధ్య సమన్వయం లేకపోవడం ఇబ్బందికరంగా మారింది.

రాజేంద్రనగర్‌, మహేశ్వరం రెండూ నియోజకవర్గాలు సగం అర్బన్‌లో, మరో సగం రూరల్‌లో ఉన్నాయి. నియోజకవర్గం మొత్తం ఎవరు పనిచేసుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, మహేశ్వరం నియోజకవర్గాల్లో అత్యధిక ఓట్లు సంపాదిస్తే చేవెళ్ల పార్లమెంట్‌ స్థానం గెలవవచ్చని బీజేపీ భావిస్తోంది.

అందుకుతగ్గ స్థాయిలో లెక్కలు వేస్తున్నారు కమలనాథులు. చేవెళ్ల పార్లమెంట్‌ స్థానం నుంచి గతంలో హర్యానా గవర్నర్‌  బండారు దత్తాత్రేయ వియ్యంకుడు జనార్ధన్‌రెడ్డి పోటీ చేసి.. రెండు లక్షల ఓట్లు సంపాదించారు. బలమైన అభ్యర్థిని బరిలో దింపితే చేవెళ్ల నుంచి గెలుస్తామని బీజేపీ హైకమాండ్‌ భావిస్తోంది.

ఇక మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానం పరిధిలోని బీజేపీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్సీ నుంచి ఎంపీ వరకు ఎన్నిక ఏదైనా తానే బరిలో దిగుతానంటారు మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బలమైన నేతను దించడానికి ఆపరేషన్‌ ఆకర్ష్‌ మొదలుపెట్టారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి లాంటి నేతను బీజేపీలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఇప్పటికే కుత్బుల్లాపూర్‌లో కూన శ్రీశైలంగౌడ్‌ బీజేపిలో చేర‌డంతో కొంత‌ బలం చేకూరింద‌ని చెప్పవ‌చ్చు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top