రైతులకు మద్దతుగా రాహుల్ ట్రాక్టర్ ర్యాలీ

Rahul Gandhi Drives Tractor To Parliament Farmers Protest Against New Farm Laws - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ సోమవారం రైతులు నిర్వహించిన ట్రాక్టర్‌ ర్యాలీలో పాల్గొన్నారు. ఐదో రోజు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఆయన స్వయంగా ట్రాక్టర్‌ నడుపుతూ పార్లమెంట్‌ వద్దకు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యకతిరేకతంగా రైతులు ట్రాక్టర్‌ ర్యాలీ చేపట్టారు. రైతుల ట్రాక్టర్‌ ర్యాలీకి  రాహుల్‌ గాంధీ మద్దతు పలికారు. అయితే పాస్‌ ఉన్న వాహనాలకు మాత్రమే పార్లమెంట్‌ భవనంలోకి అనుమతి ఉండటంతో రాహుల్‌ గాంధీ ట్రాక్టర్‌ను లోపలకి అనుమతించలేదు. ఈ క్రమంలో ఆయన ట్రాక్టర్‌ మీద నుంచే మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ రైతులకు సంబంధించిన సమస్యను పార్లమెంట్‌ దృష్టికి తీసుకువెళ్లిందని, కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను ఉభయ సభల్లో చర్చించడానికి అనుమతించడం లేదని మండిపడ్డారు. దేశంలోని రైతులు తీవ్రంగా అణచివేయబడుతున్నారని, అందుకే తాను రైతుల చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీకి మద్దతుగా పాల్గొన్నానని తెలిపారు.  

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు.. నల్ల చట్టాలని వాటిని వెంటనే  కేంద్రం వెనక్కు తీసుకోవాలని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. కేంద్రం ఈ చట్టాలను రైతుల కోసం కాకుండా కొంతమంది కార్పొరేట్‌ వ్యాపారుల కోసం తీసుకువచ్చిందని దుయ్యబట్టారు. ఈ నల్ల చట్టాలను ఎందుకు తీసుకువచ్చారో దేశంలోని ప్రజలకు తెలుసన్నారు. పార్లమెంట్‌ ముందు నిరసన తెలిపిన కాంగ్రెస్‌ నాయకులు రణదీప్ సుర్జేవాలా, బీవీ శ్రీనివాస్‌లను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రణ్‌దీప్‌ సుర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ.. రైతుల సమస్యలపై స్వరం పెంచిన ప్రతి ఒక్కరినీ మోదీ ప్రభుత్వం అణిచివేస్తుందని మండిపడ్డారు. ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రాబోయే తరాల కోసం పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం అరెస్టులు చేసినా చట్టాలను వెనక్కి తీసుకునేంతవరకు నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top