
సాక్షి, తాడేపల్లి: అమరావతి రాజధాని ప్రాంతంలో గతంలో స్టార్టప్‌ల పేరుతో తన బినామీలతో చేసుకున్న అవినీతి ఒప్పందాలను పునరుద్దరించుకోవడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ వెళుతున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి మండిపడ్డారు.
తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సింగపూర్ కంపెనీలతో గతంలో తనకు ఉన్న లాలూచీ వ్యవహారాలను తిరిగి కొనసాగించేందుకు చంద్రబాబు తహతహలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే మంత్రి నారాయణను కూడా వెంట తీసుకువెళుతున్నారని అన్నారు. పైకి మాత్రం సింగపూర్‌తో మైత్రి, పెట్టుబడులు అంటూ కట్టుకథలను ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..
సీఎం చంద్రబాబు అండ్ కో సింగపూర్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఎల్లో మీడియాలో సింగపూర్ భజన మొదలైంది. వైఎస్ జగన్ నిర్వాకం వల్ల ఆ దేశంతోనే సంబంధాలు దెబ్బతిన్నాయని ఏడుపుగొట్టు వార్త రాసుకొచ్చారు. సొంత అజెండాతో చంద్రబాబు సింగపూర్ వెళ్తుంటే ఆ దేశంతో సంబంధాలు పునరుద్ధరించడానికి సింగపూర్ వెళ్తున్నానని చంద్రబాబు చెప్పగానే ఆయనకు భజన చేస్తూ ఎల్లో మీడియా అదంతా నిజమేనన్నట్టు హడావుడి మొదలెట్టేశారు. వాస్తవానికి చంద్రబాబు పర్యటన వేరు. ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం వేరు.
సింగపూర్‌తో మైత్రి దెబ్బతిందని ఎవరు చెప్పారు.?
వైఎస్ జగన్ వల్లే సంబంధాలు దెబ్బతిన్నాయని ప్రచారం చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో సింగపూర్‌కి మైత్రి ఎక్కడ దెబ్బతింది? ఏపీ పౌరులు సింగపూర్ వెళ్లడం లేదా? సింగపూర్ నుంచి ఏపీకి రాకపోకలు జరగడం లేదా? మైత్రిని పునరుద్ధరించడానికి చంద్రబాబు ఎవరు? అసలు సంబంధాలు దెబ్బతినడానికి జగన్‌కి ఏంటి సంబంధం? ఆ దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించడానికి చంద్రబాబు ఎవరు? ఆయనేమన్నా దేశానికి ప్రధానమంత్రా, దేశ విదేశాంగమంత్రా?. భారత దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకి విదేశాంగ వ్యవహారాలతో ఏం పని?
కేవలం ఒకే ఒక్క జూమ్ కాల్‌తోనే నారా లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులు వరద పారిస్తున్నారని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. అలాంటప్పుడు సింగపూర్ దాకా పోవాల్సిన అవసరం ఏమొచ్చింది.? ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు జమ కాక సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని విద్యార్థులు బాధపడుతుంటే వారి సమస్యలు పట్టించుకోకుండా సింగపూర్ వెళ్లడానికి ఇదేనా సమయం.? వరుసగా కురుస్తున్న వర్షాలతో రైతాంగం ఖరీఫ్ సీజన్‌కి సన్నద్ధమవుతుంటే, వారికి కావాల్సిన ఎరువులు, విత్తనాలు కల్పించాల్సిన బాధ్యతలను పర్యవేక్షించకుండా చంద్రబాబు రెండు డజన్ల బృందంతో సింగపూర్ పర్యటకు వెళ్లడం ఏంటి.? రైతులకు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుకి లేదా?
సింగపూర్ ప్రభుత్వం పేరు చెప్పి కన్సార్సింతో ఒప్పందాలు
చంద్రబాబు, సింగపూర్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటనేది చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు. 2014-19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉండగా రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలంటూ ఇవే ఎల్లో మీడియాలో ఊదరగొట్టారు. కానీ జీవోలు రిలీజ్ అయ్యాక చూస్తే సింగపూర్ ప్రభుత్వంతో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నట్టు చేసిన ప్రచారం పెద్ద బూటకమని తేలిపోయింది.
అసెండాస్ సింగ్‌బ్రిడ్జి, సెంబ్ కార్ప్ కన్సార్సియంతో ఒప్పందాలు చేసుకుని నేరుగా సింగపూర్ ప్రభుత్వంతోనే ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది అనేలా ప్రజల్ని భ్రమింపజేశారు. అమరావతి కోసం మాస్టర్ ప్లాన్ ఉచితంగా ఇచ్చినట్టు మొదట ప్రచారం చేశారు. కానీ ఆ తర్వాత సూర్జానా జురాంగ్ అనే కంపెనీకి టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యత ఇచ్చినట్టు జీవోలు ఇచ్చి, ఆ పని పూర్తి చేసినందుకు రూ.28.96 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం చెల్లించింది. టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో నేరుగా పనులు అప్పగించి బిల్లులు చెల్లించడాన్ని 2023లో కేంద్ర ఆధీనంలో ఉన్న కాగ్ తీవ్రంగా వ్యతిరేకించింది.
స్టార్టప్ ప్రాజెక్టులోనే రూ.లక్ష కోట్ల కుంభకోణం
రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు మాత్రం ప్లాట్లు కేటాయించకుండా గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం, సింగపూర్ సంస్థల కన్సార్షియం, సీసీడీఎంసీ (కేపిటల్ సిటీ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ)తో కలిసి ఏర్పాటు చేసే ఏడీపీ (అమరావతి డెవలప్‌మెంట్ పార్టనర్)కి ప్రభుత్వం 1,691 ఎకరాలను అప్పగించింది. ఎకరం రూ.4 కోట్లు (కనీస ధర)గా నిర్ణయించింది. మొత్తం విలువ రూ.6,764 కోట్లు. వీటిలో 371 ఎకరాలను మౌలిక సదుపాయాలకు కేటాయించాల్సి ఉంటుంది. తొలి విడతగా 50 ఎకరాలు, రెండో దశలో 200 ఎకరాలను సింగపూర్ సంస్థలకు ఉచితంగా అప్పగిస్తుంది. మిగతా 1,070 ఎకరాలను ప్లాట్లుగా వేసి విక్రయిస్తారు.
ఈ భూమికి రోడ్లు, నీటి సౌకర్యం, వరద మళ్లింపు వంటి మౌలిక సదుపాయాలన్నీ ప్రభుత్వం సొంత ఖర్చు రూ.5,500 కోట్లతో కల్పిస్తుంది. ఏడీపీలో సీసీడీఎంసీ వాటాగా రూ.221.9 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఈ మొత్తం పెట్టుబడిలో సీసీఎండీసీకి దక్కే వాటా 42 శాతమే. కానీ కేవలం రూ.306 కోట్లు మాత్రమే పెట్టే సింగపూర్ కన్సార్షియంకు దక్కే వాటా 58 శాతం. సింగపూర్ కన్సార్షియంకు తొలుత 50, తర్వాత 200 ఎకరాలను ఉచితంగా కట్టబెట్టేందుకు నాటి చంద్రబాబు సర్కార్ అంగీకరించింది.
ఆనాడు అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పన నుంచి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు వరకు గతంలో సింగపూర్ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ కీలక పాత్ర పోషించారు. ‘ఫార్ములా-1 కార్ రేసింగ్ ఒప్పందం’లో ముడుపులు తీసుకున్న కేసులో ఈశ్వరన్ జైలుకెళ్లారు. ఏడాది పాటు జైలు జీవితం అనుభవించి గత నెల జూన్ 5న విడుదలయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, పురపాలక మంత్రి నారాయణతో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు.
అమరావతి భూములతో జేబులు నింపుకునే ప్లాన్
అమరావతిలో ఎకరం రూ.50 కోట్ల చొప్పున 1,070 ఎకరాలను అమ్మి రూ.53,500 కోట్లను చంద్రబాబు అండ్ కో సింగపూర్ సంస్థల కన్సార్షియం సొమ్ము చేసుకోవడానికి ప్లాన్ వేశాయి. తొలుత 50, రెండో దశలో 200 ఎకరాలను కన్సార్షియంకు ఉచితంగా కట్టబెట్టడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ 250 ఎకరాలను ఎకరం రూ.50 కోట్ల చొప్పున అమ్ముకున్నా రూ.12,500 కోట్ల మేర సొమ్ము చేసుకోవడమే ఆ సంస్థల ప్లాన్. అంటే గరిష్టంగా రూ.లక్ష కోట్లను చంద్రబాబు అండ్ కో, సింగపూర్ సంస్థలు కాజేయడానికి పథకం పన్నాయని స్పష్టమవుతోంది. 1,691 ఎకరాల స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనే ఈ స్థాయిలో దోచుకుంటే 34 వేల ఎకరాల రాజధానిలో ఇంకే స్థాయిలో దోపిడీ చేయడానికి ప్లాన్ వేశారన్నది అంచనాలకే అందడం లేదు.
కుంభకోణం బయటపడిపోతుందనే భయంతో..
2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడటంతో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల దోపిడీకి చంద్రబాబు వేసిన స్కెచ్‌కు తెరపడింది. కుంభకోణం బహిర్గతమైతే అంతర్జాతీయంగా ప్రతిష్ఠ దెబ్బతింటుందని భావించిన సింగపూర్ సంస్థల కన్సార్షియం 2019 అక్టోబర్ 30న ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు నాటి వైయస్సార్సీపీ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.
వారి అభ్యర్థనల మేరకు ఆ ఒప్పందాన్ని అప్పట్లో ప్రభుత్వం రద్దు చేసింది. చంద్రబాబు, లోకేష్ సింగపూర్ పర్యటనకు వెళ్తున్నది రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికా? పెట్టుబడులు పెట్టడానికా అనేది స్పష్టం చేయాలి?. జైలు నుంచి విడుదలైన సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌ను కలవడానికి వెళ్తున్నారా లేదా? మైత్రిని పునరుద్ధరించడానికి అన్నట్టు గ్యాస్ కొట్టడం ఆపాలి. అసత్య కథనాలు రాసేముందు పాఠకులు చీకొడతారేమోనన్న విచక్షణతో ఎల్లో మీడియా పనిచేయాలి.