
సాక్షి, అమరావతి: సాధారణంగా రాజకీయ పార్టీల అధికారిక పత్రికల్లో ఆ పార్టీ కార్యక్రమాలే ప్రచురితమవుతుంటాయి. టీడీపీ ఇందుకు మినహాయింపు కాదు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ పార్టీ ఓ అధికారిక పత్రికను నడుపుతోంది. కేవలం వాళ్ల అధినేతకు సంబంధించినవి, లేదా ఆ పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన వార్తలు మాత్రమే ప్రచురిస్తూ వచ్చేది. మరో రాజకీయ పార్టీ వార్తలకు చోటే ఉండకపోగా.. వాటి నాయకుల గురించి వ్యతిరేక కథనాలను మాత్రం ప్రచురిస్తూ ఉంటుంది. కానీ, ఈ మధ్య ఆ పార్టీ అధికారిక పత్రికలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరికి పెద్దపీట వేస్తోంది. బీజేపీ రాష్ట్ర పగ్గాలు చేపట్టాక, ఆమె వివిధ ప్రాంతాల్లో విలేకరుల సమావేశాలలో మాట్లాడిన వివరాలను టీడీపీ తన అధికారిక పత్రికలో అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రచురిస్తోంది. చిత్తూరు జిల్లాలో శుక్రవారం ఆమె నిర్వహించిన ప్రెస్‌మీట్ వార్త శనివారం టీడీపీ అధికారిక పత్రికలో ప్రత్యేకంగా ప్రచురితమైంది. ఇది చూసి బీజేపీ నాయకులే అవాక్కవుతున్నారు. బీజేపీ అధ్యక్షుడి విలేకరుల సమావేశం వివరాలను టీడీపీ అధికార పత్రికలో ప్రత్యేకంగా ప్రచురించడం తాము ఎప్పుడూ చూడలేదని కమలం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
బీజేపీ నేతగా కన్నా టీడీపీ నాయకురాలిగా..
నిజానికి.. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ వ్యతిరేకురాలిగా ముద్రపడిన పురందేశ్వరి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె వ్యవహారశైలిలో స్పష్టమైన మార్పు వచ్చిందన్న చర్చ ఆ పార్టీలో నడుస్తోంది. ఆమె ఇప్పుడు బీజేపీ నాయకురాలిగా కన్నా టీడీపీ నాయకురాలిగానే ఎక్కువగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఆమె సొంత పార్టీతో పాటు, ఇతర పార్టీల నుంచీ వస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర నాయకులుగానీ, జాతీయ పార్టీ తరఫున రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షించే నేతలుగానీ తమ పార్టీ విధానం అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీలకు సమదూరమంటూ చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలోనే.. ఐదేళ్ల క్రితం ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల బీజేపీకి దగ్గరయ్యేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆ పార్టీ నాయకులు పట్టించుకోవడంలేదు. కానీ, పురందేశ్వరి మాత్రం బీజేపీ రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి.. చంద్రబాబు, తెలుగుదేశం భారం తన మీద వేసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. మరోవైపు ఏళ్ల తరబడి బీజేపీలో కొనసాగుతున్న వారికంటే.. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నాయకులకే ఆమె ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆ పార్టీ నేతలే బహిరంగ ప్రకటన చేసే పరిస్థితి ఏర్పడింది.
టీడీపీ విధానాలే, బీజేపీ విధానాలుగా..
ఇక బీజేపీ సొంత కార్యక్రమాలు, విధానాల కంటే టీడీపీ విధానాలే బీజేపీ విధానాలుగా పురందేశ్వరి మార్చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఎందుకంటే.. గత నాలుగున్నర ఏళ్లుగా టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపైనా, సీఎం జగన్‌పైనా వ్యక్తిగతంగా చేసిన విమర్శలనే ఇప్పుడు పురందేశ్వరి మక్కీకిమక్కీగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం వేదిక నుంచి వల్లెవేస్తున్నారని ఆమె పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు.
ఎందుకంటే.. ఇటీవల కాలంలో టీడీపీకి పూర్తిగా అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎంపీ రఘురామకృష్ణరాజు సీఎం జగన్ బెయిల్ విషయంలో న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగానే, పురందేశ్వరి సైతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షరాలి హోదాలో పార్టీ లెటర్ హెడ్ మీద రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ లేఖ రాశారు. అదే లేఖలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పదేళ్లుగా బెయిల్‌పై కొనసాగడాన్ని తప్పుపడుతూ ప్రస్తావించడం గమనార్హం.