సాక్షి, అమరావతి: రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఓ ఒంటరి మహిళను బెదిరించి శ్రీధర్ లైంగిక వేధింపులకు గురి చేసిన వ్యవహారం బయటకు రావడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశాన్ని కవర్ చేస్తూ జనసేన, ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా జనసేన పార్టీ శ్రీధర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సదరు మహిళ ఆరోపణలపై విచారణ చేయాలని జనసేన నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణల విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్టు తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ కమిటీలో టి. శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టీసీ వరుణ్ సభ్యులుగా ఉన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ వారం రోజుల్లో కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, కమిటీ మహిళ ఆరోపణలపై నిజానిజాలు విచారణ చేసి పార్టీకి నివేదిక అందించనుంది. అనంతరం, నివేదికను పరిశీలన చేసి, తుది నిర్ణయం వెలువడే వరకు శ్రీధర్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అందులో స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా.. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై మహిళా ఉద్యోగి లైంగిక వేధింపుల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, ఇంత దారుణంగా ఆధారాలతో సహా ఎమ్మెల్యే లైంగిక వేధింపులు వెలుగులోకి వచ్చినా కూటమి పెద్దలు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అంటూ నెటిజన్లు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అంశాన్ని, పవన్ కళ్యాణ్‌ను సేవ్ చేయడానికి జనసైనికులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే అరవ శ్రీధర్‌ను జనసేన నుంచి సస్పెండ్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేశారు. ఇక, తాజాగా పార్టీ ప్రకటనతో జనసైనికులకు భంగపాటు ఎదురైంది. అయితే, జనసేన కమిటీ ఏర్పాటుపై పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఇదంతా డైవర్షన్‌లో భాగంగానే జరుగుతోందని.. శ్రీధర్‌ను కాపాడే ప్రయత్నమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


