భట్టికే చెమట్లు పట్టించారు.. కాంగ్రెస్‌ నుంచి గెంటేసుకున్న పొన్నాల, కొమ్మూరి | Sakshi
Sakshi News home page

కాలం గిర్రున తిరిగింది.. పాపం ఆ సీనియర్‌ నాయకుడు ఒకప్పుడు తన చేత్తో ఎమ్మెల్యే టికెట్లు, ఇప్పుడేమో!

Published Tue, May 9 2023 7:56 PM

Ponnala Lakshmaiah Vs Kommuri Pratap Reddy MLA Ticket Bhatti Vikramarka - Sakshi

ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కీలక మంత్రిగా హవా నడిపారు. పార్టీకి అధికారం పోయింది. పదవులు చేజారిపోయాయి. ఇప్పుడు టిక్కెట్ తెచ్చుకోవడమే ఆ మాజీ పీసీసీ చీఫ్‌కు కష్టమంటున్నారు. గత ఎన్నికల్లో తనకు ప్రచారం చేసిన నేతే ఇప్పుడు ఆయనకు అడ్డుపడుతున్నాడు.

మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి నేనేంటే నేనే అంటూ ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర జనగామలో పోరు యాత్రగా మారింది. రెండు వర్గాలు ఒకరిని మరొకరు కుమ్మేసుకున్నారు. తోసుకున్నారు. తిట్టుకున్నారు. పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. 

పాదయాత్రలో లొల్లి షురూ..
భట్టి విక్రమార్కకే చెమట్లు పట్టించారు పొన్నాల, కొమ్మూరి. ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు ఆధిపత్య పోరు ప్రదర్శించారు. ఇద్దరు నేతల మధ్య కొనసాగుతున్న   అంతర్గత విభేదాలతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. గత ఎన్నికల్లో పొన్నాల ఓటమితో ఈసారి కొమ్మూరి టిక్కెట్‌పై ఆశలు పెంచుకున్నారు. దీంతో ఇద్దరి మధ్యా వార్ మొదలైంది. చాన్నాళ్ళుగా సైలెంట్‌ ఉన్న వ్యవహారం భట్టి  పాదయాత్ర సందర్భంగా రోడ్డున పడింది. 

ఈ తరుణంలో పొన్నాల అనుచరుడైన డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మాసనపల్లి లింగాజీ కొమ్మూరిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి కొమ్మూరికి కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధంలేదని చెప్పారు. అదే సమయంలో కొమ్మూరి అనుచరులు పొన్నాలనే పార్టీ నుంచి తొలగించినట్లు ప్రకటించారు.

ఓడిన తర్వాత నియోజకవర్గాన్ని, పార్టీని పట్టించుకోకుండా అధికార పార్టీకి కోవర్ట్ గా మారి జనగామలో హస్తం పార్టీని అస్తవ్యస్తం చేస్తున్నాడని హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. పోటా పోటీ ఫిర్యాదులతోపాటు భట్టి పాదయాత్రలో తమ సత్తా చాటేందుకు యత్నించారు. భట్టి  కూడా ఈ న్యూసెన్స్ ఏంటని ఇరువర్గాలను తీవ్రంగా మందలించారు. 
(హైదరాబాద్‌లో మళ్లీ ఉగ్ర కదలికలు.. 16 మంది అరెస్ట్‌)

సైడయిపోయిన కొమ్మూరి
కొమ్మూరి వస్తే పాదయాత్రకు సహకరించబోనని పొన్నాల స్పష్టం చేయడంతో.. ఒకదశలో భట్టి రెండు చేతులు జోడించి ముందుకు వెళ్ళమని కొమ్మూరికి విజ్ఞప్తి చేశారు. దీంతో కొమ్మూరి పాదయాత్ర నుంచి నిష్క్రమించారు. నర్మెట్టలో కార్నర్ మీటింగ్ పెట్టేందుకు పొన్నాల ఏర్పాటు చేయగా కొమ్మూరి వర్గీయులు నిరసన వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చేసేది లేక భట్టి కార్నర్ మీటింగ్ ను క్యాన్సల్ చేసుకుని ముందుకు సాగారు. 

దీంతో పొన్నాల అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కొమ్మూరి అనుచరులను సభా వేదిక వద్దకు ఎలా అనుమతిచ్చారంటూ పోలీసులపై ఫైర్ అయ్యారు. కొమ్మూరి మాత్రం పార్టీపై ఉన్న అభిమానంతో భట్టి పాదయాత్ర సక్సెస్ కావాలని పొన్నాల సైకోయిజం వల్లనే పాదయాత్ర కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలో మూడు రోజులపాటు  భట్టి పాదయాత్ర సాగగా ఫస్ట్ డే మాత్రమే భట్టితో కొమ్మూరి కనిపించారు. పొన్నాల మాత్రం ఆది నుంచి అంతం వరకు అన్నీ తానై భట్టిని నడిపించారు.

ఉల్టా పల్టా
గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పొన్నాల నియోజకవర్గానికి దూరం కాగా.. కొమ్మూరి మాత్రం అక్కడ పార్టీ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రజలతో మమేకమ్యారు. పార్టీలో రేవంత్‌రెడ్డి వర్గంగా పేరు తెచ్చుకున్నారు. కొమ్మూరికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్న పొన్నాల.. భట్టి విక్రమార్క పాదయాత్రను తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. ఒకప్పుడు తన చేతితో అభ్యర్థులకు టిక్కెట్ ఇచ్చిన పొన్నాల ఇప్పుడు తనకు టిక్కెట్ వస్తుందో రాదో అన్న దీనస్థితికి దిగజారిపోయారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
(కూతురు ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. ఏమన్నారంటే!)

Advertisement
Advertisement