
శివాజీనగర: కర్ణాటకలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. జేడీఎస్ సీనియర్ నేత, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ. కుమారస్వామిని విచారించేందుకు అనుమతివ్వాలని రాష్ట్ర పోలీసు శాఖ గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్‌కు విజ్ఞప్తి చేసింది. దీంతో, కన్నడ రాజకీయం హీటెక్కింది.
గతంలో బళ్లారి జిల్లాలో శ్రీ సాయి వెంకటేశ్వర మినరల్స్ మైనింగ్ కేసులో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కుమారస్వామి అక్రమాలకు పాల్పడినట్లు ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఆరోపిస్తోంది. దీనిపై ఇప్పటికే ఓ కేసు విచారణలో ఉన్నందున ఆయనను విచారించడానికి అనుమతి ఇవ్వాలని సిట్ బృందం రాజ్‌భవన్‌కు లేఖ రాసింది. అయితే చార్జ్‌షీట్ కన్నడలో ఉందని, ఆంగ్లంలోకి అనువదించి అందజేయాలని రాజ్‌భవన్ అధికారులు సూచించారు. దీంతో సుమారు 4,500 పేజీల చార్జ్‌షీట్‌ను ఇంగ్లీష్‌లోకి మార్చి సమర్పించారు. ఈ నేపథ్యంలో గరవ్నర్ అనుమతి ఇస్తే సిట్ అధికారుల ముందు కుమారస్వామి విచారణకు హాజరుకావలసి ఉంటుంది. ప్రస్తుతం కర్ణాటకలో కేంద్రమంత్రి కుమారస్వామి, కాంగ్రెస్ సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా.. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూముల వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్యపై ఆరోపణలు రావడం కన్నడ రాజకీయాలను కుదిపేసింది. ఈ కేసులో సిద్ధరామయ్యకు భారీ ఉపశమనం లభించింది. ఈ భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఆయనకు వ్యతిరేకంగా ఆధారాల్లేవని లోకాయుక్త పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో సీఎంతో పాటు ఆయన సతీమణి పార్వతి, తదితరులకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాల్లేవని తేల్చి చెప్పారు. ఈ అంశంపై తుది నివేదికను హైకోర్టుకు సమర్పించనున్నట్లు సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణకు రాసిన లేఖలో పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో తొలి నలుగురు నిందితులపై వచ్చిన ఆరోపణలకు ఆధారాల్లేకపోవడంతో నిరూపితం కాలేదని తెలిపారు.
అక్రమాస్తుల కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు ఊరట లభించిన విషయం తెలిసిందే. 2013-2018 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డీకే శివ కుమార్ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఆదాయానికి మించిన ఆస్తుల్ని కూడబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో ఆయనపై సెప్టెంబరు 2020న సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసింది. విచారణ ప్రారంభించింది. దర్యాప్తు కొనసాగుతుండగానే ఆ కేసు సీబీఐ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో లోకాయుక్త పోలీసులకు బదిలీ అయ్యింది. ఈ కేసు విచారణలో భాగంగా డీకే శివకుమార్ గత వారం లోకాయుక్త పోలీసుల ముందు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయనకు ఊరట దక్కింది.