పిన్నెల్లి హత్యకు పథకం: పేర్ని నాని ఆందోళన | Sakshi
Sakshi News home page

పిన్నెల్లి హత్యకు పథకం: పేర్ని నాని ఆందోళన

Published Mon, May 27 2024 3:59 AM

పల్నాడు జిల్లా కారంపూడిలో టీడీపీ గూండాలు చేసిన  విధ్వంసాన్ని చూపిస్తున్న మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని

మాజీ మంత్రి పేర్ని నాని ఆందోళన

బెయిల్‌ ఇవ్వడంతో అంతమొందించేందుకే మూడు తప్పుడు కేసులు.. ఎమ్మెల్యేకు హాని జరిగితే సీఐ నారాయణస్వామి, ఐజీ త్రిపాఠిదే బాధ్యత

పోలీసు వ్యవస్థకు మాయని మచ్చలా తయారైన అధికారులను వదిలిపెట్టం.. వేధిస్తున్న అధికారులు 

4 తర్వాత మూల్యం చెల్లించక తప్పదు

సాక్షి, అమరావతి: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంటాడి హత్య చేసేందుకు పోలీసుల ద్వారా టీడీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని  ఆందోళన వ్యక్తం చేశారు. పిన్నెల్లి ప్రాణాలకు ఎలాంటి హాని జరిగినా సీఐ నారాయణస్వామి, గుంటూరు రేంజ్‌ ఐజీ, డీజీపీదే బాధ్యతని స్పష్టం చేశారు. సీఐ నారాయణస్వామిని అడ్డు పెట్టుకుని తనను అంతమొందించేందుకు టీడీపీ నేతలు కుట్ర చేస్తున్నట్లు ఈసీ, పోలీసు ఉన్నతాధికారులకు పిన్నెల్లి ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన  ఇంటి వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పారామిలిటరీ బలగాలను ఈనెల 14న ఎందుకు వెనక్కి రప్పించారని నిలదీశారు. 

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి ఈ కుట్రలపై గవర్నర్, రాష్ట్రపతి, ప్రధానికి మొర పెట్టుకుంటేగానీ పారా మిలిటరీ బలగాలను పంపలేదన్నారు. పోలీసు వ్యవస్థకు మాయని మచ్చలా తయారై సంఘ విద్రోహక శక్తుల్లా వ్యవహరిస్తున్న అధికారులకు ముందుంది ముసళ్ల పండుగని హెచ్చరించారు. పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో టీడీపీ గూండాలకు వత్తాసు పలుకుతున్న వారు జూన్‌ 4 తరువాత తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. పేర్ని నాని ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా మాచర్ల, నరసరావుపేట నియోజకవర్గాల్లో టీడీపీ మూకల విధ్వంసకాండను రుజువు చేసే పలు వీడియోలను ప్రదర్శించారు.

పిన్నెల్లి 2009 నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మాచర్లలో వైఎస్సార్‌సీపీకి బలమైన పునాది వేశారు. మాచర్లలో టీడీపీ అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తోందని, గట్టి భద్రత కల్పించి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరపాలని కోరుతూ ఈనెల 11న ఆర్వో, జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల కమిషన్, పోలీసు ఉన్నతాధికారులకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వినతిపత్రం అందచేశారు.

⇒ మాచర్ల నియోజకవర్గంలో ఇప్పటివరకూ అల్లర్లు జరగని ప్రాంతాల్లో పారా మిలటరీ బలగాలను నియమించిన అధికారులు ఘర్షణలు చోటుచేసుకునే చోట్ల మాత్రం హోంగార్డులతో సరిపుచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై టీడీపీ మూకలు దాడి చేస్తుంటే ప్రేక్షకపాత్ర వహించడం ద్వారా పోలింగ్‌ శాతాన్ని తగ్గించేందుకు కుట్ర చేశారు. వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులను భయభ్రాంతులకు గురి చేసి టీడీపీ మూకలు రిగ్గింగ్‌కు పాల్పడ్డాయి.

⇒ ఈనెల 13న పోలింగ్‌ రోజు పాల్వాయి గేట్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసమైనట్లు పీవో లాగ్‌ బుక్‌లో ఎందుకు నమోదు చేయలేదు? అర క్షణమైనా పోలింగ్‌కు విఘాతం కలిగిందా? ఈనెల 17న విచారణకు వెళ్లిన సిట్‌ బృందానికైనా ఈవీఎం ధ్వంసం గురించి చెప్పారా? ఈనెల 18న డీజీపీకి సిట్‌ ఇచ్చిన ప్రాథమిక నివేదికలోనూ ఎమ్మెల్యే పిన్నెల్లి పేరు లేదు. ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేసినట్లు ఆ నివేదికలో ఎక్కడా లేదు. మీడియాకు సిట్‌ విడుదల చేసిన నివేదికే అందుకు తార్కాణం.

⇒ ఈనెల 20న లోకేష్‌ ట్వీట్‌ ఆధారంగా పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఎన్నికల కమిషన్‌ మర్నాడు ఆదేశించింది. లోకేష్‌కు ఆ వీడియో ఎలా వచ్చిందని మీడియా ప్రశ్నిస్తే తన కార్యాలయం నుంచి లీక్‌ కాలేదని, ఎలా వచ్చిందో విచారణలో తేలుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పేర్కొనడం హాస్యాస్పదం.

⇒ ఈసీ ఉత్తర్వులపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించి ఈనెల 22న బెయిల్‌ తెచ్చుకుంటే అదే రోజు ఆయనపై తప్పుడు కేసు బనాయించారు. ఈనెల 14న కారంపూడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను చెదరగొట్టేటప్పుడు తనకు  గాయమైందని, తనపై దాడి చేసిన వారిలో పిన్నెల్లి  ఉన్నారని ఈనెల 22న సీఐ నారాయణస్వామి తాపీగా స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. పిన్నెల్లి పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి తప్పుడు కేసు బనాయించారు. సీఐకి 14న గాయమైతే 22 వరకూ స్టేట్‌మెంట్‌ ఇవ్వకుండా ఏం చేశారు?

⇒ పోలింగ్‌ మర్నాడు పారా మిలటరీ బలగాలు మాచర్లలో ఉన్నా పక్కనే ఉన్న కారంపూడిలో సీఐ నారాయణస్వామి, ఎస్సై రామాంజనేయులు అండతో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన టీడీపీ రౌడీమూకలు విధ్వంసానికి తెగబడ్డాయి. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఇళ్లు, దుకాణాలను ధ్వంసం చేసినా పోలీసులు పట్టించుకోలేదు.

⇒ టీడీపీకి లొంగిపోయిన ఎన్నికల వ్యవస్థ, పోలీసు వ్యవస్థలు పిన్నెల్లిపై కక్ష కట్టి తప్పుడు కేసులు బనాయిస్తున్నాయి. మాచర్లలో ఎన్నికల హింసకు సంబంధించి ఎస్సీ, డీఎస్పీ, ఎస్సై సస్పెండైనా ఐజీ త్రిపాఠీకి సన్నిహితుడైన సీఐ నారాయణస్వామిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో కారంపూడి ఎస్సైగా ఉన్నప్పుడు అత్యంత వివాదాస్పంగా వ్యవహరించి సస్పెన్షన్‌కు గురైన నారాయణస్వామిని సీఐగా ఎలా నియమిస్తారు? ఆయన వ్యవహార శైలిపై గత నెల 8నే ఎమ్మెల్యే పిన్నెల్లి ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదు. 

⇒ పోలింగ్‌ రోజు టీడీపీ కార్యకర్తను హత్య చేసేందుకు పురిగొల్పారని, మహిళలను చంపుతానని బెదిరించారని పిన్నెల్లిపై ఈనెల 23న మరో రెండు కేసులు నమోదు చేశారు. ఇలా ఇంకెన్ని తప్పుడు కేసులు బనాయిస్తారో డీజీపీ వెల్లడించాలి. పిన్నెల్లిని కౌంటింగ్‌కు రానివ్వకుండా చేసి దౌర్జన్యాలకు తెగబడాలని టీడీపీ కుట్రలు చేస్తోంది. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన ఈసీ అందుకు వంత పాడటం దారుణం.  

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement