పవన్‌ ప్రతిపాదన.. బీజేపీ పక్కనపెడుతుందా..

Pawan Kalyan Will Ask Tirupati Seat To Janasena - Sakshi

సాక్షి, తిరుపతి : గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన జనసేన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని వ్యూహత్మంగా అడుగులు వేస్తోంది. బీజేపీ భాగస్వామ్య పక్షంగా చేరి.. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తోంది. సీట్లు పంపకాలు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాల్లో ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకోకుండా బీజేపీ నీడలో మెలుగుతోంది. జనసేన అధినేత పవన్‌ కళ్యాన్‌ సైతం ఒంటరి పోటీకి ధైర్యం చేయలేక, కమలనాథుల వెంటనే పయనిస్తున్నారు. పేరుకే సొంత పార్టీ అయినప్పటికీ.. బీజేపీ నేతల కకబంధహస్తాల్లో చిక్కుకుపోయి అంతా కాషాయ నేతలకే వదిలేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే జీహెచ్‌ఎంసీ ఎ‍న్నికల్లో పోటీ చేస్తామని తొలుత ప్రకటించిన పవన్‌.. మూడు రోజులకే మాటమార్చారు. జనసేన ప్రకటనతో రంగంలోకి దిగిన బీజేపీ నేతలు.. జీహెచ్‌ఎంసీ బరిలో నుంచి పవన్‌ను తప్పించారు. వెంటనే బీజేపీ అభ్యర్థులకు మద్దతును సైతం ప్రకటించారు. ఈ పరిణామం జనసైనికుల ఆగ్రహాం, అసంతృప్తి, నిరాశకు దారితీసింది. (ప్రచారానికే పరిమితమైన జనసేన)

తిరుపతి సీటును జనసేనకు..!
పవన్‌ ప్రకటనతో పోటీకి సిద్ధమైన నేతల ఆశలపై పవన్‌ నీళ్లు చల్లారని సొంతపార్టీ నేతలు, కార్యకర్తలే నిరసన స్వరం వినిపించారు. మరోవైపు తమ అభ్యర్థుల తరుఫున పవన్‌ ప్రచారం చేయాలని బీజేపీ పట్టుపడుతోంది. ఇక క్రమంలోనే బీజేపీ పెద్దలతో భేటీకి పవన్‌ కళ్యాన్‌ సిద్ధమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డాతోపాటు మరికొంత మంది కీలక నేతలతో భేటీ కానున్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ, జనసేనలో ఏ పార్టీ అభ్యర్థిని పోటీకి దించాలనే అంశంతో పాటు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో తన ప్రచారం గురించి చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీలో పవన్‌ కళ్యాణ్‌ బీజేపీ నేతల ముందు కీలక ప్రతిపాదన చేయనున్నారని జనసేన వర్గాల ద్వారా తెలుస్తోంది. త్వరలో జరుగనున్న తిరుపతి ఉప ఎన్నిక సీటును జనసేనకు ఇవ్వాలని పవన్‌ కోరే అవకాశం ఉంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో తిరుపతి సీటును తమకు కేటాయించాలని పవన్‌ షరతు విధించినట్లు సమాచారం. దీనిపైనే నేటి భేటీలో ప్రధానంగా ఇరుపార్టీల నేతలు చర్చించనున్నారు.

బీజేపీ నీడలోనే జన సైనికులు
దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించి ఊపు మీద ఉన్న కమలనాథులు తిరుపతి సీటును వదులుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. అయితే గత లోక్‌సభ ఎ‍న్నికల్లో బీజేపీ అభ్యర్థికి కేవలం 16 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. సామాజిక సమీకరణాలు, పవన్‌ ఫాలోయింగ్‌ను దృష్టిలో ఉంచుకుని సీటుకే కేటాయించాలని జనసేన డిమాండ్‌ చేస్తోంది. మరోవైపు తిరుపతి విజయం తమదేనని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపని జనసేనకు తిరుపతి సీటు కేటాయిస్తే నిండా మునిగిపోతామని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. దీంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల మాదిరిగానే తిరుపతిలోనూ జనసేన సైనికులు బీజేపీ నీడలోనే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. పవన్‌ ప్రతిపాదనను బీజేపీ పెద్దలు సైతం పక్కనపెట్టే అవకాశం ఉంది. దీనిపై నేటీ భేటీ అనంతరం స్పష్టత రానుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top