గొట్టిపాటి లక్ష్మికి ఏ హోదాతో ప్రభుత్వ ఆహ్వానం? | Officials Invite Defeated TDP In Charge To Government Programme | Sakshi
Sakshi News home page

గొట్టిపాటి లక్ష్మికి ఏ హోదాతో ప్రభుత్వ ఆహ్వానం?

Jul 7 2026 10:59 AM | Updated on Jul 7 2026 11:05 AM

Officials Invite Defeated TDP In Charge To Government Programme

ఒంగోలు: నియోజకవర్గంలోని ప్రభుత్వాధికారులు పచ్చనేతల్లా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దర్శి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద సర్వశిక్షా అభియాన్‌ స్కూల్‌లో సోమవారం విభిన్న ప్రతిభావంతులకు పరికరాలు అందజేసేందుకు పీడీ వస్తున్నారని ఎంఈఓ–2 రమాదేవి అత్యుత్సాహంగా ప్రధానోపాధ్యాయుల గ్రూపులో గొట్టిపాటి లక్ష్మి పర్యటన వివరాలు అంటూ ప్రత్యేకంగా హెడ్‌లైన్‌ పెట్టి పోస్టు చేశారు. 


గొట్టిపాటి లక్ష్మిని సత్కరిస్తున్న ఎంఈఓ రమాదేవి, ఎంపీడీఓలు   

ఆమె పర్యటనకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు అందరూ హాజరుకావాలంటూ ప్రభుత్వ అధికారులు, ఇతర గ్రూపులో.. ఇట్లు దర్శి తెలుగుదేశం పార్టీ కార్యాలయం, దర్శి నియోజకవర్గం పేరుతో మెసేజ్‌లు పెట్టడం చూసి ప్రభుత్వ ఉద్యోగులు సైతం విస్తుపోయారు. ఈ కార్యక్రమానికి పీడీ  పేరు ప్రస్తావించకుండానే పీడీతో కలిసి గొట్టిపాటి లక్ష్మి పరికరాలు అందజేస్తారని మెసేజ్‌ పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన వారికి బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో కూడా లక్ష్మి పాల్గొంటుందని, అందరూ హాజరుకావాలని ప్రధానోపాధ్యాయుల గ్రూపులో పెట్టి మరీ ఆహ్వానించారు. 

దర్శి నియోజకవర్గ ప్రజలు ఓడించిన గొట్టిపాటి లక్ష్మి ఏ హోదాతో ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కానీ, చివరకు సర్వశిక్షా అభియాన్‌ పీడీ ఆ కార్యక్రమాలకు హాజరుకాలేదు. 9 గంటలకు కార్యక్రమం ప్రకటించగా, గొట్టిపాటి లక్ష్మి ఆలస్యంగా హాజరయ్యారు. అప్పటివరకూ ఎంఈఓ–2 రమాదేవి దివ్యాంగులను అన్నం కూడా తిననివ్వకుండా కూర్చోబెట్టారు. ఎంపీడీఓ సమావేశపు హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని టీడీపీ కార్యక్రమంలా నిర్వహించారు. టీడీపీ నేతలను స్టేజీపై కూర్చోబెట్టి అధికారులు కింద కుర్చీలలో కూర్చోవడం గమనార్హం.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement