
ఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ అనూహ్యంగా రాజీనామా చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. ధన్‌ఖడ్ రాజీనామా నేపథ్యంలో ఇప్పుడు తదుపరి ఉప రాష్ట్రపతి ఎవరు అనే కొత్త చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఎవరిని ఎంపిక చేస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మనోజ్ సిన్హా, వీకే సక్సేనా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివన్ష్ నారాయణ్ సింగ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేరు కూడా తెరపైకి వచ్చినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయనను బీజేపీలోకి తీసుకుని ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా వ్యవహారం బీజేపీ కుట్రగా బీహార్‌లో ప్రతిపక్ష ఆర్జేడీ ఆరోపించింది. బీహార్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనుండగా బీజేపీ ఈ కుట్రకు తెరతీసిందని ఆర్‌జేడీ నేతలు చెబుతున్నారు. దీని ద్వారా అప్రాధాన్యమైన ఉపరాష్ట్రపతి వంటి పోస్టులో సీఎం నితీశ్ కుమార్‌ను కూర్చోబెట్టాలనేదే బీజేపీ అసలు ఉద్దేశమంటున్నారు. నితీశ్ కుమార్‌ను తప్పించి, బీహార్‌లో తమ పార్టీ సీఎంను కూర్చోబెట్టాలని బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించింది. వచ్చే ఎన్నికల్లో ఎన్‌డీఏ ఓటమి ఖరారని భావిస్తున్న బీజేపీ హఠాత్తుగా ఈ ఎత్తుగడ వేసిందని విమర్శించింది. అయితే, గతంలో పలుమార్లు నితీశ్ ఉపరాష్ట్రపతి పదవి చేపట్టనున్నారంటూ వచ్చిన వార్తలు విధితమే.
శశిథరూర్‌కు ఆఫర్?
ఇటీవలి కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్‌కు క్రమంగా దూరమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన త్వరలోనే హస్తానికి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరుతున్నారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్‌పై కేంద్రం నియమించిన ఎంపీల కమిటీలో ఒకదానికి శశిథరూర్ నేతృత్వం వహించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే తాజా రేసులో శశిథరూర్ పేరు తెరపైకి వచ్చింది. ఆయనను పార్టీలోకి తీసుకుని ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
లిస్టులో వారిద్దరూ..
ఉపరాష్ట్రపతి పదవి రేసులో ఢిల్లీ, జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లలో ఒకరికి అవకాశం ఇవ్వనే ప్రచారం కూడా జరుగుతోంది. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 6వ తేదీతో ముగియనుంది. బీజేపీ సీనియర్ నేత అయిన సిన్హా గతంలో ఆ పార్టీ జాతీయ కౌన్సిల్‌లో సభ్యుడిగా వ్యవహరించారు. మోదీ తొలి కేబినెట్‌లో కేంద్ర సహాయ మంత్రిగా కూడా సేవలందించారు. ఆర్టికల్ 370 రద్దు అయిన ఏడాది తర్వాత జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన సిన్హా.. ఈ కేంద్ర పాలిత ప్రాంతం పాలనలో తనదైన ముద్ర వేశారు. విమర్శలు, వివాదాలతో అనేక సార్లు వార్తల్లో నిలిచారు. దీంతో, ఆయన పేరు కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గత మూడేళ్లుగా ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ హయాంలో ఉన్న సమయంలో.. నియామకాల నుంచి వివాదాల వరకు నాటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో విభేదించి తరచూ వార్తల్లో నిలిచారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి ఎల్జీతో వివాదం కూడా ఓ కారణమైంది. దీంతో ఆయన కేంద్రం దృష్టిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఉపరాష్ట్రపతి పదవికి సక్సేనా వైపు మొగ్గుచూపే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉప రాష్ట్రపతి ఎవరు అనే ఉత్కంఠ నడుస్తోంది.