‘తెలంగాణ, కర్ణాటకలో సత్తా చాటాం’

Narendra Modi Participates In Bjp Victory Celebrations - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణాదిన బీజేపీ ప్రభావం లేదనేవారికి తాజా ఎన్నికలు షాక్‌ ఇచ్చాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణ, కర్ణాటకలో సత్తా చాటామని చెప్పారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో కాషాయ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించడంతో బుధవారం బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్య విజయమని అన్నారు. చదవండి : బీజేపీకే ఎందుకు పట్టంగట్టారు!?

ఎన్నికల ఫలితాల కోసం దేశం మొత్తం ఎదురుచూసిందని, కరోనా సమయంలో ఇలాంటి ఎన్నికలు నిర్వహించడం కత్తిమీద సామని అన్నారు. ఫలితాల నేపథ్యంలో ప్రజలంతా టీవీలు, ట్విటర్‌, ఫేస్‌బుక్‌లకు అతుక్కుపోయారని చెప్పారు. గతంలో ఎన్నికల ఫలితాలు వెల్లడికాగానే మీడియాలో బూత్‌ల రిగ్గింగ్‌, ఓట్ల గల్లంతుకు సంబంధించిన కథనాలు వచ్చేవని, ఇప్పుడు పోలింగ్‌ శాతం ఎంత పెరిగిందనే పతాక శీర్షికలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్‌ భారత్‌ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిందని అన్నారు.

బిహార్‌లో అద్భుత విజయం అందించారని, తాజా ఎన్నికల్లో తమ పార్టీని ఆదరించిన దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పనిచేస్తూ ఉంటే ప్రజలే ఆశీర్వదిస్తారని అన్నారు. విజయోత్సవ సభలో ప్రధాని మోదీతో పాటు బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, పలువురు బీజేపీ అగ్రనేతలు, పెద్దసంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top