
ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం గుంపరమాన్‌దిన్నె ఎంపీటీసీ తులసమ్మ, ఆమె భర్త, వాటర్ యూజర్స్ అసోసియేషన్ చైర్మన్ కుందనూరు మోహన్‌రెడ్డి తమ పదవులతో పాటు టీడీపీకి రాజీనామా చేసి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ఝలక్ ఇచ్చారు. తులసమ్మ శిరివెళ్ల ఎంపీడీఓ కార్యాలయం చేరుకుని ఎంపీడీఓ శివమల్లేశప్పకు రాజీనామా పత్రం అందజేశారు. ఆమె భర్త మోహన్‌రెడ్డి వాటర్ యూజర్స్ అసోసియేషన్ పదవికి రాజీనామా చేసేందుకు కేసీ కెనాల్ డీఈని సంప్రదించగా రాజీనామా పత్రం కలెక్టర్‌కు ఇవ్వాలని సూచించడంతో కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్లారు.
ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ.. భూమా అఖిలప్రియను వెన్నంటి ఉంటూ ఆమె ఏ పార్టీలోకి మారితే.. అనుచరులతో కలిసి తాము కూడా వారి వెంట నడుస్తూ వచ్చామన్నారు. అయినా కార్యకర్తలకు సరైన న్యాయం, తగిన గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. ఇలాంటి పార్టీలో ఉండటం ఇష్టంలేక పదవులతో పాటు పార్టీకి రాజీనామా చేశామన్నారు.
‘బి’ ట్యాక్స్ బాదుడు భరించలేకే..
అఖిలప్రియకు మోహన్‌రెడ్డి రూ.5 లక్షలు ‘బి’ ట్యాక్స్ చెల్లిస్తే తప్ప గుంప్రమాన్ దిన్నె వాటర్ యూజర్స్ అసోసియేషన్ చైర్మన్ పదవి దక్కలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇటీవల అంగన్‌వాడీ పోస్ట్ ఖాళీ అవడంతో గ్రామానికి చెందిన ఒకరికి ఆ పోస్ట్ ఇవ్వాలని మోహన్‌రెడ్డి సిఫారసు చేయగా.. ఊరికే ఇచ్చే ప్రసక్తే లేదని, రూ.8 లక్షలు ‘బి’ ట్యాక్స్ కడితేనే ఇప్పిస్తామని చెప్పినట్టు టీడీపీలో చర్చ సాగుతోంది. అంత డబ్బు ఇవ్వలేరని చెప్పడంతో గ్రామంలో మరో వ్యక్తితో బేరం ఆడుతున్నట్టు తెలుసుకున్న మోహన్‌రెడ్డి రూ.8 లక్షలు కప్పం కట్టి అంగన్‌వాడీ పోస్ట్ ఇప్పించినట్టు సమాచారం. గుంప్రమాన్‌దిన్నె శివారు రాజనగరానికి సీసీ రోడ్లు వేసేందుకు మంజూరైన రూ.10 లక్షల నిధులను మోహన్‌రెడ్డికి తెలియకుండా గ్రామానికి చెందిన మరో వ్యక్తికి కమీషన్ కింద అమ్ముకున్నట్టు తెలుస్తోంది. మోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీ కెనాల్ అభివృద్ధికి మంజూరైన పనులను సైతం ‘బి’ ట్యాక్స్ పేరుతో ఎవరో కొత్త వ్యక్తులకు అమ్ముకోవడంపైనా అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో భార్యాభర్తలిద్దరూ పదవులకు, టీడీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు చెందిన మండల, గ్రామస్థాయి నాయకులు వారి పరిధిలో మంజూరయ్యే అభివృద్ధి పనులు చేపట్టడం పరిపాటి. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎప్పుడూ లేనివిధంగా పని ఎక్కడైనా, పదవి ఏదైనా ‘బి’ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తోంది. కప్పం కడితే చాలు వారు ఏ పారీ్టకి ఎంత సేవ చేశారు అని చూసే పనిలేకుండా పనులు, పదవులు కట్టబెడుతున్నారు. చేసేదిలేక దశాబ్దాలుగా చక్రం తిప్పిన నాయకులు సైతం పదవులు, పనులకు కప్పం కట్టాల్సి వస్తోంది.
కప్పం కట్టి పదవులు పొందినా.. వాటి పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులను వారికి ఇవ్వకుండా 20 శాతం కమీషన్ తీసుకుంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టడంతో టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా తిరగబడుతున్నారు. కొందరు తాము కమీషన్ ఇచ్చేది లేదని ఎదురు తిరుగుతుండగా.. మరికొందరు తాము చైర్మన్లుగా, అధ్యక్షులుగా ఉన్నా సంబంధిత పనులను తమతో మాట మాత్రమైన చెప్పకుండా ఇతరులకు కట్టబెట్టడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.