న‌ల్గొండ నియోజ‌క‌వ‌ర్గంలో అభ్య‌ర్థుల పూర్తి వివ‌రాలు ఇవే.. | Telangana Assembly Polls 2023: Here Are The Complete Details Of The Candidates And Politics In Nalgonda Dist Constituency - Sakshi
Sakshi News home page

TS Assembly Elections 2023: న‌ల్గొండ జిల్లా నియోజ‌క‌వ‌ర్గంలో అభ్య‌ర్థుల పూర్తి వివ‌రాలు ఇవే..

Published Sat, Nov 18 2023 11:40 AM

Nalgonda Distrcit Assembly Politics - Sakshi

నల్గొండ నియోజకవర్గం

  • జిల్లా: నల్గొండ
  • లోక్ సభ పరిధి: నల్గొండ
  • రాష్ట్రం: తెలంగాణ
  • మొత్తం ఓటర్ల సంఖ్య: 2,37,951
  • పురుషులు: 1,16,487
  • మహిళలు: 1,21,326

ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం నాలుగు మండలాలు ఉన్నాయి:

  • నల్గొండ
  • తిప్పర్తి
  • కనగల్
  • మాడుగులపల్లి

నియోజకవర్గం ముఖచిత్రం
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వరుసగా నాలుగోసారి నల్గొండ నుంచి విజయం సాధించారు. గతంలో ఆయన వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన సమీప అభ్యర్థి భూపాల్‌ రెడ్డిపై విజయం సాధించారు. భూపాల్‌ రెడ్డి ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ నుంచి బరిలో నిలవడంతో రాష్ట్ర స్థాయిలో ఈ నియోజకవర్గంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వెంకట్‌రెడ్డి గెలుపుపై ధీమాతో ఉండగా.. నల్గొండలో జెండా పాతాలని గులాబీ దళం విశ్వప్రయత్నాలు చేస్తోంది. మొత్తం 15 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ ఏడుసార్లు, టీడీపీ మూడుసార్లు విజయం సాధించాయి.

2018లో
నల్గొండ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా పోటీ చేసిన కంచర్ల భూపాల్‌ రెడ్డి సంచలన విజయం సాధించారు. నల్గొండలో స్ట్రాంగ్‌ మాన్‌గా పేరొందిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై ఆయన 23,698 ఓట్ల ఆదిక్యతతో విజయం సాధించారు. 1999 నుంచి ఇక్కడ నుంచి వరసగా గెలుస్తున్న కోమటిరెడ్డి 2018లో ఓటమి చెందారు. భూపాల్‌ రెడ్డి 2014లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓడిపోయి, 2018లో టిఆర్‌ఎస్‌లో చేరి గెలుపొందారు. భూపాల్‌ రెడ్డికి 98,792 ఓట్లు రాగా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి 75,094 ఓట్లు వచ్చాయి.

ఇక్కడ మూడోస్థానం స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసిన వెంకటేశ్వర్లుకు వచ్చింది. ఆయనకు సుమారు మూడువేల ఓట్లు వచ్చాయి. భూపాల్‌ రెడ్డి సామాజికంగా రెడ్డి వర్గం నేత. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2019లో లోక్‌ సభ ఎన్నికలలో భువనగిరి నుంచి పోటీ చేసి గెలుపొందడం విశేషం. నల్గొండ పట్టణంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాలుగు సార్లు గెలిచారు. 2014లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసనసభకు ఎన్నికైనా ఆయన సోదరుడు రాజగోపాలరెడ్డి భువనగిరి నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు.

2018లో వెంకటరెడ్డి అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయి, తదుపరి 2019లో ఎమ్‌.పిగా గెలిస్తే, రాజగోపాలరెడ్డి మునుగోడు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాజగోపాలరెడ్డి ఒకసారి ఎమ్మెల్సీగా, ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా కూడా గెలిచారు.  ఇద్దరు సీనియర్లు జానారెడ్డి, దామోదరరెడ్డిలను కాదని వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి 2009లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం విశేషం. వైఎస్‌ మరణం తర్వాత రోశయ్య క్యాబినెట్‌లో ఉన్నారు. అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో కొనసాగిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేశారు.

నల్గొండలో కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ఐ కలిసి ఏడు సార్లు, టిడిపి మూడుసార్లు, పిడిఎఫ్‌ రెండుసార్లు, బీఆర్‌ఎస్‌ ఒకసారి, అవిభక్త సిపిఐ ఒకసారి సిపిఎం ఒకసారి గెలుపొందగా, ఇండిపెండెంటు ఒకరు గెలిచారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు 1985లో ఉమ్మడి రాష్ట్రంలో మూడు ప్రాంతాల నుంచి పోటీ చేశారు. హిందుపూర్‌, గుడివాడలతో పాటు, నల్గొండ నుంచి పోటీచేసి విజయం సాధించారు. మూడుచోట్ల ఒకేసారి గెలవడం ఒక రికార్డు.

కాంగ్రెస్‌ నాయకుడు చకిలం శ్రీనివాస్‌రావు నల్గొండలో రెండుసార్లు, మిర్యాలగూడలో ఒకసారి గెలిచారు. ఒకసారి  ఆయన లోక్‌సభకు కూడా ఎన్నికయ్యారు. 1962లో ఇక్కడ గెలిచిన సిపిఐ నేత ధర్మభిక్షం 1952లో సూర్యాపేటలో, 1957లో నకిరేకల్‌లో గెలిచారు. ఈయన నల్గొండ నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఒకసారి ఇక్కడ గెలిచిన  రఘుమారెడ్డి ఒకసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

కాగా 2004లో టిడిపి పక్షాన ఇక్కడ శాసనసభకు పోటీచేసి ఓడిపోయిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, 1999లో  టిడిపి పక్షాన, 2009, 2014లలో కాంగ్రెస్‌ ఐ పక్షాన లోక్‌సభకు ఎన్నికయ్యారు. తదుపరి కాలంలో ఆయన బీఆర్‌ఎస్‌లో చేరిపోయి ఎమ్మెల్సీ అయి కౌన్సిల్‌ చైర్మన్‌ అయ్యారు. రైతు సమన్వయ సమితి అద్యక్షుడుగా కూడా వ్యవహరించారు. నల్గొండలో 12 సార్లు రెడ్లు, రెండుసార్లు బ్రాహ్మణ, ఒకసారి గౌడ్‌, ఒకసారి  ఎస్‌.సి, ఒకసారి కమ్మ సామాజికవర్గాలు ఎన్నికయ్యాయి.

Advertisement
Advertisement