
సాక్షి, నాగర్ కర్నూల్: కృష్ణా జలాలు పొలాల్లో పారుతుంటే ఎందుకంత విషం చిమ్ముతున్నారంటూ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పాలమూరుకు ఎందుకు న్యాయం చేయలేదంటూ ప్రశ్నించారు. పాలమూరులో ప్రాజెక్టులకు డిసెంబర్‌లో భూములు సేకరిస్తాం. రెండేళ్లలో ప్రాజెక్ట్‌లు పూర్తి చేసి చూపిస్తాం’’ అని రేవంత్ అన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి మండలం జటప్రోల్‌లో రూ.150 కోట్లతో 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముందుగా గ్రామంలోని పురాతన మదనగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన, ఆ తర్వాత భారీ బహిరంగ సభ ప్రసంగించారు. సభలో ఇందిరా మహిళాశక్తి కింద స్వయం సహాయక బృందాల మహిళలకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘‘రెండేళ్లు కాలేదు అప్పుడే దిగిపో.. దిగిపో అంటున్నారు. పాలమూరు అంటే కేసీఆర్ కుటుంబానికి చిన్నచూపు. కరీంనగర్ నుంచి పారిపోయిన కేసీఆర్ ఆదరిస్తే సున్నం పెట్టారు. వాల్మికీలను ఎస్టీ జాబితాలో చేర్పిస్తామన్న కేసీఆర్ ఎందుకు చేయలేదు?. చెప్పులు కుట్టమని, గొర్రెలు పెంచమని చేపలు పట్టమని చెప్పారు. ఆయన బిడ్డలే రాజ్యాలు ఏలాలా? పాలమూరు బిడ్డలకు పదవులు వద్దా?. మాదిగ కులాల వర్గీకరణ చేసినందుకు కేసీఆర్‌కు కడుపుమంటగా ఉంది. 25 వేల కోట్లు ఖర్చు పెడితే పాలమూరు ప్రాజెక్ట్‌లు పూర్తయ్యేవి. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయ్యింది’’ అంటూ రేవంత్ విమర్శలు గుప్పించారు.