అది వైఎస్సార్‌సీపీ ఘన చరిత్ర.. సంక్షేమానికి బంగారు బాట | MP Vijaya Sai Reddy Comments On 2019 Assembly Elections In Andhra Pradesh - Sakshi
Sakshi News home page

అది వైఎస్సార్‌సీపీ ఘన చరిత్ర.. సంక్షేమానికి బంగారు బాట

Published Thu, Aug 31 2023 8:06 PM

MP Vijaya Sai Reddy Comments On 2019 Assembly Elections In AP - Sakshi

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ (15వ ఏపీ శాసనసభ) పదవీకాలం మరో 9 నెలల్లో ముగియనున్న సందర్భంగా కిందటి ఎన్నికలను ఒకసారి గుర్తుచేసుకుందాం. అంతకుముందు.. లోక్‌సభతోపాటు జరగాల్సిన ఈ ఎన్నికలకు 2019 మార్చి 10న ఆదివారం భారత ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించింది. భారత ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం 2019 మే 27లోగా ఏపీ అసెంబ్లీకి తాజాగా ఎన్నికలు జరిపించాల్సి ఉంది. 

దీంతో ఎలక్షన్‌ షెడ్యూల్‌ ప్రక్రియ పూర్తి కావడానికి రెండున్నర నెలల ముందు తేదీలు అధికారికంగా ప్రకటించారు. కిందటి శాసనసభ ఎన్నికల కార్యక్రమాన్ని బట్టి చూస్తే.. రాష్ట్ర 16వ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలల తర్వాత షెడ్యూల్‌ ప్రకటిస్తారు. అంటే, 2024 మార్చి 15లోగా ఏపీ శాసనసభ ఎలక్షన్ల తేదీలు వస్తాయి. పార్లమెంటుతోపాటు జరిగిన కిందటి శాసనసభ ఎన్నికల ప్రక్రియ 2019 మార్చి 10–మే నెల 23 మధ్య 75 రోజుల్లో పూర్తయింది. మార్చి 10న ఎన్నికల షెడ్యూలు రాగా, మే 23న ఎన్నికల ఫలితాలు ప్రకటించారు.

వైఎస్సార్‌సీపీకి భారీ మెజార్టీ..
ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 లోక్‌సభ, 175 శాసనసభ స్థానాలకు ఒకే రోజున (2019 ఏప్రిల్‌ 11న) పోలింగ్‌ జరిగింది. ఎన్నికల కార్యక్రమం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయిన మార్చి 18 నుంచే నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలైంది. ప్రస్తుత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చివరిసారి ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన ఈ జోడు ఎన్నికల్లో ప్రస్తుత పాలకపక్షం వైఎస్సార్‌సీపీ పార్టీ మున్నెన్నడూ కనీవినీ ఎరగని మెజారీటీతో ఘనవిజయం సాధించింది. 

టీడీపీ అప్రజాస్వామిక చర్య..
ఎన్నికల తేదీలు ప్రకటించడానికి ఆరు నెలల ముందే రాష్ట్రంలో ఓటర్ల వ్యక్తిగత వివరాలను నాటి పాలకపక్షం అక్రమంగా తనకు అనుకూలంగా వాడుకోవడానికి ప్రయంత్నిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇవి ఆరోపణలు మాత్రమే కాదని వాస్తవాలని తర్వాత ప్రజలకు అర్ధమైంది. ఇంటింటికి వెళ్లి సర్వేల పేరుతో సేకరించిన ఓటర్ల వివరాలను బట్టి నాటి ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ పార్టీ అభిమానులని భావించిన ప్రజల ఓట్లను తొలగించే కార్యక్రమం మొదలవ్వగా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ యావత్తూ ఉద్యమించింది. ఫలితంగా నాటి టీడీపీ సర్కారు అప్రజాస్వామిక చర్యలకు అడ్డకట్టవేయగలిగారు. 

ఈసీ చర్యలతో ప్రజాస్వామ్యానికి విజయం..
ఎన్నికల కమిషన్‌ సకాలంలో తీసుకున్న చర్యల ఫలితంగా పోలింగ్‌ ప్రశాంతంగా, సజావుగా జరిగింది. మే 23న జరిగిన ఓట్ల లెక్కింపులో దాదాపు ఐదున్నర కోట్ల ఆంధ్రుల అభీష్టానికి అనుగుణంగా వైఎస్పార్‌సీపీ 22 లోక్‌సభ, 151 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుని చరిత్రాత్మక విజయం నమోదు చేసుకుంది. మరి ఐదేళ్ల పదవీ కాలం తర్వాత అంటే 2024 మే నెలాఖరులోగా జరగాల్సిన ఏపీ 16వ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనకు ఆరు మాసాల ముందు రాష్ట్రంలో తెలుగుదేశం హయాంతో పోల్చితే మామూలు పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 

వైఎస్సార్‌సీపీ ప్రజాహిత విధానాలు, కార్యక్రమాల కారణంగా పాలకపక్షం వరుసగా రెండోసారి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో నమోదు చేసుకుంటుందని ఎన్నికల, రాజకీయ పండితులు, విశ్లేషకులు అంచనావేస్తున్నారు. 2019 ఏప్రిల్‌–మే ఎన్నికల ముందు ప్రకటించిన ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో)తో పాటు కొత్తగా రూపొందించిన ప్రజా సంక్షేమ పథకాల ప్రకారం గత నాలుగున్నర ఏళ్లుగా నగదు బదిలీ ప్రక్రియ విజయవంతంగా అమలవుతోంది. ఆంధ్రా ప్రజలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాలనతో గరిష్ఠ స్థాయిలో సంతృప్తి చెందుతున్నారు. 

వచ్చే ఎన్నికల కోసం ప్రజలు సిద్ధం..
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి మొదటి భాగంలో ప్రకటించే ఏపీ అసెంబ్లీ ఎన్నికల తేదీల గురించి జనం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కిందటి ఎన్నికల్లో నాటి పాలకపక్షం టీడీపీ ఓటమిపై లేదా వైఎస్సార్‌సీపీ విజయంపై అప్పటి రూలింగ్‌ పార్టీ అనుకూల మీడియా ప్రచారం చేసిన కట్టుకథలను నమ్మే జనం కొంత మందైనా ఉన్నారు. కానీ, ఇప్పుడు వైఎస్సార్‌సీపీ మరోసారి శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించడంపై అత్యధిక ప్రజానీకానికి ఎలాంటి అనుమానాలు లేవు. 2024 మార్చి మొదటి వారం తర్వాత నుంచి మే నెలాఖరులో ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటించే రెండున్నర నెలల కాలం మరోసారి ఆంధ్రప్రదేశ్‌ భవితవ్యాన్ని బంగారు బాటన నడిపించడానికి అత్యంత కీలకమైనది. వైఎస్సార్‌సీపీ పార్టీని రెండోసారి వరుసగా గెలిపించి తమ సంక్షేమానికి, ప్రగతికి మార్గం సుగమం చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది నేడు జగమెరిగిన సత్యం.


:: విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ, రాజ్యసభ సభ్యులు.

Advertisement
Advertisement