
సాక్షి, ఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం జరిగింది. వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీలు గురుమూర్తి, పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి చేశారు.
ఏపీలో క్షీణిస్తున్న శాంతి భద్రతలు, వైఎస్సార్‌సీపీ నేతల అక్రమ అరెస్టుల అంశాన్ని పార్లమెంటు సమావేశాల్లో ఆ పార్టీ లేవనెత్తనుంది. రాష్ట్రంలోని ఖనిజ సంపదను అప్పుల కోసం ఏపీఎండీసీ తాకట్టు పెట్టడం, పోలవరం ఆలస్యం, రైతుల సమస్యలు.. ధాన్యం సేకరించకపోవడం గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం, అమరావతిలో అవినీతి, సూపర్ సిక్స్ ఫెయిల్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరణ, మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ, ఏపీలో పెరుగుతున్న నిరుద్యోగం, నత్త నడకన ఇళ్ల నిర్మాణాలు, తిరుమలలో భద్రత లోపాలు తదితర అంశాలను వైఎస్సార్‌సీపీ ప్రస్తావించనుంది.
అఖిలపక్ష సమావేశం అనంతరం వైఎస్సార్‌సీపీ రాజ్యసభ పక్షనేత పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో అధర్మ పాలన సాగుతోందని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని.. అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ ఆయన దుయ్యబట్టారు. కార్యకర్తలను, నాయకులను అరెస్టు చేసి హింసిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఉనికి లేకుండా చేయడం కోసం అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ అంశాలన్నీ పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తాం’’ అని బోస్ తెలిపారు.
మామిడి, మిర్చి, పొగాకు రైతులకు కనీసం మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. 12 రూపాయలు మద్దతు ప్రకటించి నిస్సిగ్గుగా కేవలం ఐదు రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు. మామిడి, మిర్చి, పొగాకు రైతుల సమస్యలు పార్లమెంటులో ప్రస్తావిస్తాం. రైతులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఒక్కో రైతుకు 20 వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల్లో చెప్పిన.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. కౌలు రైతులకు సహాయం చేయడం లేదు. ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించిన టీడీపీ ఇప్పుడు విచ్చలవిడిగా అప్పులు చేస్తోంది’’ అని బోస్ మండిపడ్డారు.