
సాక్షి, కాకినాడ: చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆదేశాలతోనే పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. పవన్ చేస్తున్నది వారాహి యాత్ర కాదని, నారాహి యాత్ర అని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే ద్వారంపూడి. నారాహి వాహనం ఎక్కి పవన్ ద్వారంపూడి జపం చేస్తున్నాడని, తనపై నిందలు వేయడం పవన్‌కు టీడీపీకి అలవాటేనని చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉంటే పవన్ మాత్రం చంద్రబాబు, లోకేష్ రాసిన స్క్రిప్ట్‌ను చదువుతున్నాడన్నారు.
‘సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు. పవన్ ది వారాహి యాత్ర కాదు.. నారాహి యాత్ర. నా మీద నిందలు వేయడం పవన్, టీడీపీకి అలవాటే. కాకినాడకు చెడ్డపేరు తీసుకొచ్చే ప్రయత్నం చేయొద్దు. బెస్ట్ లివింగ్ సిటీల్లో నాలుగో స్థానంలో కాకినాడ ఉంది. కాకినాడకు ఉన్న మంచి పేరును పవన్ చెడగొట్టొద్దు. నారాహిపై పవన్ నిత్యం ద్వారంపూడి జపం చేస్తున్నాడు. చంద్రబాబు స్క్రిప్ట్ నే పవన్ చదువుతున్నాడు. కాకినాడలో పోటీపై సవాల్ చేస్తే పవన్ తోకముడిచి వెళ్లిపోయాడు. పవన్.. వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం. కాకినాడ పరువు ప్రతిష్టలను దెబ్బతీస్తే ఊరుకునేది లేదు’అని ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు.