మేనిఫెస్టోలపై చర్చకు వచ్చే దమ్ముందా?: జోగి రమేష్‌ సవాల్‌

Minister Jogi ramesh Challenges Atchannaidu On Manifesto Discussion - Sakshi

సాక్షి, తాడేపల్లి: తెలుగుదేశం పార్టీకి తెగులు పట్టిందని మంత్రి జోగి రమేష్‌ మండిపడ్డారు. టీడీపీ దివాళా తీసిందని అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేదనీ తెలుసని ఎద్దేవా చేశారు. పొత్తుల పేరుతో అందరి కాళ్లు పట్టుకుంటూ చంద్రబాబు తిరుగుతున్నారని దుయ్యబట్టారు. అలాంటి పార్టీకి చెందిన అచ్చెన్నాయుడు వైస్సార్‌సీపీ మేనిఫెస్టో ఫెయిల్ అయిందని ఆరోపించటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. 

99.5% హామీలను అమలు చేసిన నేత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని చెప్పిన జోగి రమేష్‌.. దీనిని తాము నిరూపిస్తామని తెలిపారు. మేనిఫస్టోలపై చర్చకు వచ్చే దమ్ముందా? అని ప్రశ్నించారు. టీడీపీ 2014 నాటి మేనిఫెస్టో, వైఎస్సార్‌సీపీ 2019 నాటి మేనిఫెస్టో మీద చర్చకు రాగలరా?అని ప్రశ్నించారు. మేనిఫెస్టో అంటే తమకు బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమని తెలిపారు. మేనిఫెస్టో అమలు చేశాం కాబట్టే  ధైర్యంగా ప్రతి ఇంటికీ వెళ్ళి మళ్ళీ ఓట్లు అడగగలుగుతున్నామన్నారు.

చరిత్రలో ఎవరైనా ఎన్నికల తర్వాత ఇలా ఇంటికి వెళ్ళి అమలు చేసిన కార్యక్రమాల గురించి చెప్పారా? అని మంత్రి జోగి రమేష్‌ ప్రశ్నించారు. చంద్రబాబులాగా మేనిఫెస్టోని నెట్ నుంచి తొలగించలేదని దుయ్యబట్టారు. మేనిఫెస్టోని చించి శనక్కాయల పొట్లాలుగా మార్చలేదని మండిపడ్డారు.  2014లో మేనిఫెస్టోని అమలు చేయలేదు కాబట్టే చంద్రబాబును జనం చిత్తుచిత్తుగా ఓడించారని గుర్తు చేశారు. 

‘అసలు చంద్రబాబుకు ఏపీతో ఏం పని?. ఈ రాష్ట్రంలో ఆధార్ కార్డు ఉందా?. ఇల్లు, డోర్ నెంబర్ ఉందా?. ఇలాంటి అడ్రస్ లేని వ్యక్తులు మా గురించి మాట్లాడటానికి సిగ్గుండాలి. రైతులు, డ్రాక్రా మహిళలకు రుణమాఫీ పేరుతో దారుణంగా మోసం చేశారు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారు. అలాంటి మోసకారి, దుర్మార్గుడు అయినందునే చంద్రబాబుకు ఈ గతి పట్టింది. 30 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తున్న జగన్ లాంటి సీఎం దేశంలో ఎక్కడైనా ఉన్నారా?. అసలు చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క పథకమైనా ఉందా?. 

‘చంద్రబాబు దిక్కుమాలిన మేనిఫెస్టోని అసలు ఎవరైనా నమ్ముతారా?. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మోకాళ్ల మీద నడిచినా ఆ పాపం పోదు. మళ్ళీ ఈరోజు మహిళలకు ఉచిత ప్రయాణమని అంటున్నారు. మేము ఎలాంటి ప్రకటనా చేయకపోయినా మాపై ఆరోపణలు చేస్తున్నారు. రామోజీ, రాధాకృష్ణ, చంద్రబాబు, పవన్, లోకేష్ ఉండేది, తినేది హైదరాబాదులో. అక్కడ కూర్చుని ఏపీలో రాజకీయాలు చేయటం ఏంటి?. ఈ ఎన్నికల తర్వాత వారు ఈవైపు ఇక కన్నెత్తి కూడా చూడరు’ అని జోగి రమేష్‌ విమర్శించారు.
చదవండి: అర్హులకే నంది అవార్డులు.. ఎవరికీ అన్యాయం జరగదు: పోసాని

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top